తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Midterm Elections : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. బైడెన్​కు అగ్నిపరీక్ష!

US midterm elections : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. బైడెన్​కు అగ్నిపరీక్ష!

30 October 2022, 20:23 IST

google News
    • US midterm elections 2022 : మధ్యంతర ఎన్నికలకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఇటు డెమొక్రాట్లకు, అటు రిపబ్లికెన్లకు, అధ్యక్షుడు జో బైడెన్​కు ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూఎస్​ మిడ్​టర్మ్​కు సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు..
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. బైడెన్​కు అగ్నిపరీక్ష!
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. బైడెన్​కు అగ్నిపరీక్ష! (REUTERS)

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. బైడెన్​కు అగ్నిపరీక్ష!

US midterm elections 2022 : అమెరికాలో నవంబర్​ 8న.. ఎంతో కీలకమైన మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్​కు ఇది అగ్నిపరీక్ష అని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు.. అటు డెమొక్రాట్లకు, ఇటు రిపబ్లికెన్లకు కీలకంగా మారింది. అసలు మధ్యంతర ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి? గెలిచిన పార్టీకి ఏ విషయాల్లో ఆధిపత్యం లభిస్తుంది?

సెనేట్​.. ప్రతినిధుల సభ..

భారత్​లో పార్లమెంట్​లాగే.. అమెరికాలో 'కాంగ్రెస్​' ఉంటుంది. ఈ కాంగ్రెస్​లో పెద్దల సభ పేరు సెనేట్​. దిగువ సభ పేరు హౌజ్​ ఆఫ్​ రిప్రసెంటేటివ్స్​(ప్రతినిధుల సభ).

సెనేట్​లో 100 సీట్లు ఉంటాయి. 50 రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఇద్దరు చొప్పున సెనేట్​కు వెళతారు. ప్రస్తుతం ఇక్కడ 50-50తో డెమొక్రాట్స్​, రిపబ్లికెన్ల మధ్య సమానంగా సీట్లు​ ఉన్నాయి. అయితే.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ డెమొక్రాట్​ కావడంతో ఈ పార్టీకి పవర్​ కాస్త ఎక్కువ ఉంది. కమలా హ్యారిస్​ వద్ద టై బ్రేకింగ్​ ఓటు ఉంటుంది. నవంబర్​లో 34 సీట్లకు ఓటింగ్​ జరగనుంది. గెలిచిన వారు 6ఏళ్ల పాటు సెనేట్​లో ఉంటారు.

Democrats US midterm elections : ఇక ప్రతినిధుల సభలో 435 సీట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ 222-213తో డెమొక్రాట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. నవంబర్​లో మొత్తం 435 సీట్లు ఎన్నికలకు వెళ్లనున్నాయి. గెలిచిన వారు రెండేళ్లు ప్రతినిధుల సభలో ఉంటారు.

సెనేట్​, ప్రతినిధుల సభతో పాటు 36రాష్ట్రాల్లోని గవర్నర్​, ఇతర స్థానిక పదవులకు కూడా నవంబర్​ 8న ఎన్నికలు జరగనున్నాయి.

ఎవరు గెలుస్తారు?

చరిత్రను చూస్తే.. అధికారంలో ఉన్న పార్టీ.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో దారుణ ప్రదర్శనలు చేసింది! ఇంచుమించుగా.. అధ్యక్ష ఎన్నికలు జరిగిన 2ఏళ్లకు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. అంటే అధ్యక్షుడి పాలనపై ప్రజల్లో అప్పటికే ఒక అంచనా ఉంటుంది.

ఇక ఇప్పుడు బైడెన్​కు రేటింగ్​ తక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి. అబార్షన్​ చట్టాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బైడెన్​, డెమొక్రాట్లు వ్యతిరేకించడంతో వారికి మద్దతు పెరిగింది. కానీ ద్రవ్యోల్బణం వంటి సమస్యలు కారణంగా రేటింగ్​ పడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

Republicans US midterm elections : ప్రతినిధుల సభలో రిపబ్లికెన్​ పార్టీ అధిపత్యం సాధించవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. సెనేట్​లో మాత్రం పోరు హోరాహోరీగా ఉంటుందని తెలుస్తోంది.

బైడెన్​కు అగ్నిపరీక్ష..!

పదవిలో ఉన్న పార్టీకి మధ్యంతర ఎన్నికలు అత్యంత కీలకం. కాంగ్రెస్​పై పట్టుకోల్పోతే.. కీలక బిల్లులను గట్టెక్కించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. ఇప్పుడు డెమొక్రాట్లు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

2024లోపు పాస్​ చేయాల్సిన బిల్లుల లిస్ట్​ను డెమొక్రాట్​ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. కానీ ఏ ఒక్క సభలోనైనా రిపబ్లికెన్లు ఆధిపత్యం సాధిస్తే.. డెమొక్రాట్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. అంతేకాకుండా.. సెనేట్​ పదవీ కాలం 6ఏళ్లు కాబట్టి.. ఇప్పుడు గెలిచిన పార్టీకి 2024 అధ్యక్ష ఎన్నికల్లో కొంత బలం చేకూరుతుంది.

Joe Biden US midterm elections : అటు ఈ ఎన్నికలు రిపబ్లికెన్లకు కూడా కీలకమే. అబార్షన్​ చట్టాలకు డెమొక్రాట్​లు చేయాలనుకుంటున్న మార్పులను రిపబ్లికెన్లు అడ్డుకోవచ్చు. వాతావరణ మార్పులపై డెమొక్రాట్ల చర్యలు నచ్చకపోతే.. వాటినీ నిలిపివేయవచ్చు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​కు అమెరికా అందిస్తున్న సాయంపై డెమొక్రాట్లను ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.

వీటన్నింటికీ మించి.. అధ్యక్షుడు జో బైడెన్​పై అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించేందుకు రిపబ్లికెన్లు ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మధ్యంతర ఎన్నికల్లో పైచేయి సాధిస్తే.. బైడెన్​కు కొత్త చిక్కులు వచ్చినట్టే. అందుకే.. ఏ ఒక్క సభలో అయినా రిపబ్లికెన్లకు ఆధిపత్యం లభిస్తే.. డెమొక్రాట్లకు కష్టమే అవుతుంది.

ఇక సెనేట్​పై ఆధిపత్యం సాధిస్తే.. ఫెడరల్​ కోర్టుల జడ్జీలను ఎంపిక చేసే అవకాశం లభిస్తుంది. రిపబ్లికెన్లకు మద్దతు పెరిగితే.. అధ్యక్షుడు బైడెన్​ ప్రతిపాదించే వారి నామినేషన్లను తిరస్కరించే రైట్​ వీరి చేతుల్లో ఉంటుంది.

US elections : 2016లో ఇదే జరిగింది. అప్పుడు రిపబ్లికెన్ల ఆధిపత్యం ఉన్న సనేట్​లో.. నాటి అధ్యక్షుడు బరాక్​ ఒబామా చేసిన జడ్జీల ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. కానీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు ఈ చిక్కులు రాలేదు.

తదుపరి వ్యాసం