Donald Trump twitter : ట్విట్టర్​లోకి ట్రంప్​ రీఎంట్రీ! థ్యాంక్స్​ టు మస్క్​..-donal trump twitter account to be restored after elon musk s take over says report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump Twitter : ట్విట్టర్​లోకి ట్రంప్​ రీఎంట్రీ! థ్యాంక్స్​ టు మస్క్​..

Donald Trump twitter : ట్విట్టర్​లోకి ట్రంప్​ రీఎంట్రీ! థ్యాంక్స్​ టు మస్క్​..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 28, 2022 08:25 AM IST

Donald Trump twitter account to be restored : డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​లోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.

ట్విట్టర్​లోకి ట్రంప్​ రీఎంట్రీ! థ్యాంక్స్​ టు మస్క్​..
ట్విట్టర్​లోకి ట్రంప్​ రీఎంట్రీ! థ్యాంక్స్​ టు మస్క్​.. (Reuters / File)

Donald Trump twitter account to be restored : గతేడాది ట్విట్టర్​ నుంచి శాశ్వత బహిష్కరణకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు గుడ్​ న్యూస్​ అందింది! మరి కొన్ని రోజుల్లో ఆయన ట్విట్టర్​లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. దిగ్గజ సామాజిక మాధ్యమాన్ని ఎలాన్​ మస్క్​ సొంతం చేసుకోవడం ఇది సాధ్యపడింది!

ఈ విషయంపై డొనాల్డ్​ ట్రంప్​ స్పందించారు.

"ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్​కు నా అభినందనలు. పాత మేనేజ్​మెంట్​ ఎజెండాలతో పనిచేసేది. మార్పు అనివార్యమని చాలా మంది భావించారు. సోమవారం నుంచి నా ట్విట్టర్​ ఖాతా పనిచేస్తుందని నాకు తెలిసింది. చూద్దాం. ట్విట్టర్​తో మళ్లీ ప్రయాణం చేస్తుండటం సంతోషంగా ఉంది," అని డొనాల్డ్​ ట్రంప్​ ఓ ప్రకటనను విడుదల చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ ఓటమి నేపథ్యంలో గతేడాది జనవరిలో దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా యూఎస్​ క్యాపిటల్​లోకి నిరసనకారులు దూసుకెళ్లి, రచ్చ రచ్చ చేశారు. వీరందరు ట్రంప్​ మద్దతుదారులని అప్పట్లో వార్తలొచ్చాయి. అంతేకాకుండా.. హింసాకాండ వెనుక ట్రంప్​ హస్తం ఉందని, విధ్వంసం సృష్టించే విధంగా ప్రజలను ట్రంప్​ రెచ్చగొట్టారని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. డొనాల్డ్​ ట్రంప్​ను శాశ్వతంగా బహిష్కరించింది ట్విట్టర్​. ఆ తర్వాత ఆయన 'ట్రూత్​' పేరుతో సొంతంగా సోషల్​ మీడియాను స్థాపించారు.

ఎలాన్​ మస్క్​ ట్విట్టర్​ డీల్​ పూర్తి..

Elon Musk twitter : 6 నెలల ఉత్కంఠకు తెరదించుతూ.. ట్విట్టర్​ డీల్​ని పూర్తి చేశారు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​. ట్విట్టర్​ను సొంతం చేసుకున్న కొద్ది గంటల్లోనే.. సీఈఓ పరాగ్​ అగర్వాల్​ను మస్క్​ తొలగించినట్టు తెలుస్తోంది. పరాగ్​ అగర్వాల్​తో పాటు మరో ఇద్దరిని కూడా మస్క్​ ఫైర్​ చేసినట్టు సమాచారం.

ఏడాది తొలినాళ్ల నుంచి ఈ వ్యవహారంపై ఊహాగానాలు జోరుగా సాగాయి. ట్విట్టర్​ను కొనుగోలు చేసేందుకు ఎలాన్​ మస్క్​ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మస్క్​ ట్వీట్లు ఉండేవి. ట్విట్టర్​లో భావ ప్రకటనా స్వేచ్ఛను పెంపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ట్విట్టర్​ నిరాకరించలేని విధంగా ధరను ఆఫర్​ చేశారు. ఇక మస్క్​ చేతిలో ట్విట్టర్​ని పెట్టేందుకు షేర్​హోల్డర్లు కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఫలితంగా 44బిలియన్​ డాలర్లు పెట్టి ట్విట్టర్​ను కొనుగోలు చేశారు ఎలాన్​ మస్క్​.

Elon Musk twitter news : అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో.. ట్విట్టర్​ డీల్​కు బ్రేక్​ పడింది. ట్విట్టర్​ చెప్పిన దానికన్నా.. సామాజిక మాధ్యమంలో బాట్​​ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వాటిని సీరియస్​గా పరిగణించారు ఎలాన్​ మస్క్​. పూర్తి డేటాను బయటపెట్టాలని డిమాండ్​ చేశారు. అందుకు ట్విట్టర్​ ఒప్పుకోలేదు. డీల్​పై చర్చల సమయంలోనే సమాచారం ఇచ్చామని చెప్పింది. ఆగ్రహంతో ట్విట్టర్​ డీల్​ను నిలిపివేశారు ఎలాన్​ మస్క్​.

ఈ నేపథ్యంలో.. శుక్రువారం లోపు ట్విట్టర్​ను కొనుగోలు చేయాలని మస్క్​కు డెడ్​లైన్​ ఇచ్చింది అక్కడి కోర్టు. అందుకు తగ్గట్టుగానే.. ట్విట్టర్​తో డీల్​ని పూర్తి చేశారు టెస్లా సీఈఓ. అంతకన్నా ముందు.. తన ట్విట్టర్​ బయోను 'చీఫ్​ ట్వీట్​'గా మార్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం