Large cap mutual funds : ఈ మ్యూచువల్ ఫండ్స్‌తో.. రిస్క్ తక్కువ- సంపద ఎక్కువ!
08 August 2022, 20:06 IST
- Large cap mutual funds : లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇందులో రిస్క్ ఎలా ఉంటుంది? రిటర్నులు ఎలా ఉంటాయి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము.
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌తో.. రిస్క్ తక్కువ- సంపద ఎక్కువ!
Large cap mutual funds : ఈక్విటీకి సంబంధించి ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ‘లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్’ ఒకటి. మీరు తక్కువ రిస్క్ కోసం చూస్తూ.. దీర్ఘకాలంలో నిలకడగా సంపదను వృద్ధి చేసుకోవాలని అనుకుంటుంటే.. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాల్సిందే!
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్:-
లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్నే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. దీర్ఘకాలంలో.. మదుపర్లకు అదిరిపోయే రీతిలో సంపద తెచ్చిపెడతాయన్న పేరు ఈ లార్జ్ క్యాప్ కంపెనీలకు ఉంది. క్రమంగా డివిడెండ్లు ఇస్తూనే.. సంపదను సృష్టించేందుకు కూడా ఈ లార్జ్ క్యాప్ సంస్థలు ఉపయోగపడతాయి.
స్మాల్ క్యాప్/ మిడ్ క్యాప్‌తో పోల్చుకుంటే ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మంచి రిటర్నులు కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. రిస్క్ తక్కువగా ఉండి.. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవాలి అని అనుకునే వారు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకారం.. మార్కెట్ క్యాపిటల్‌లో టాప్ 100 కంపెనీలను.. లార్జ్ క్యాప్‌గా గుర్తిస్తారు. అందువల్ల వీటిల్లో పెట్టుబడులు పెడితే రిస్క్ తక్కువగా ఉంటుంది.
రిస్క్ తక్కువ.. లాభాలు నిలకడగా!
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే.. రిస్క్ తక్కువ, రిటర్నులు నిలకడగా ఉంటాయి. రిస్క్ తక్కువగా ఉండటం వల్ల.. ఈ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకోగలుగుతాయి.
What are Large cap mutual funds : అయితే.. రిస్క్ తక్కువగా ఉండటం వల్ల ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. స్మాల్ క్యాప్/ మిడ్ క్యాప్ కన్నా తక్కువ రిటర్నులు జనరేట్ చేస్తాయి. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో.. అక్కడ రివార్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే కదా!
- లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఎక్స్పెన్స్ రేషియోను గమనించాల్సి ఉంటుంది. మీ ఫండ్‌ను నిర్వహించినందుకు.. ఫండ్ హౌజ్ వసూలు చేసే ఫీజే ఈ ఎక్స్పెన్స్ రేషియో. ఉన్న దాంట్లో రిటర్నులు ఎక్కువగా రావాలంటే.. ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండటం ముఖ్యం.
- మార్కెట్ సరైన ప్రదర్శన చేయకపోతే.. లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా డల్‌గానే ఉంటాయి. అందువల్ల లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం 5-7ఏళ్ల వరకు పెట్టుబడి పెడితేనే మంచి సంపదను చూడవచ్చు. 7ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. 10-12శాతం రిటర్నులు వచ్చే అవకాశం ఉంది.
- లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్ గోల్స్‌పై మీకు అవగాహన ఉండాలి. మీ లక్ష్యాలకు తగ్గట్టుగానే పెట్టుబడులు పెట్టాలి.
- ఈక్విటీ ఫండ్ కావడంతో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌పై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పడుతుంది.
ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.