Financial planning : ఈ ఐదు విషయాలు తెలుసుకుంటే.. రూ. కోట్లు మీ సొంతం!-financial planning 5 biggest money mistakes that most indians make
Telugu News  /  National International  /  Financial Planning, 5 Biggest Money Mistakes That Most Indians Make
మనీ విషయంలో భారతీయులు చేసే ఐదు తప్పులు ఇవే!
మనీ విషయంలో భారతీయులు చేసే ఐదు తప్పులు ఇవే!

Financial planning : ఈ ఐదు విషయాలు తెలుసుకుంటే.. రూ. కోట్లు మీ సొంతం!

25 June 2022, 12:07 ISTSharath Chitturi
25 June 2022, 12:07 IST

Financial planning : మీకు కోట్లు కోట్లు సంపాదించాలని ఉందా? మీ ఆశలన్నీ డబ్బు సంపాదనపైనే ఉందా? ఆయితే మీరు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మీకోసమే ఈ కథనం.

Financial planning : చిన్నప్పటి నుంచి ఉద్యోగం వచ్చేంత వరకు చాలా నేర్చుకుంటాము. కానీ జీవితంలో ముఖ్యమైనది మాత్రం ఎవరూ నేర్పించరు. అదే 'ఫైనాన్షియల్​ ప్లానింగ్​'. డబ్బును ఎలా వినియోగించాలి? ఎలా ఖర్చుపెట్టాలి? ఎలా పొదుపు చేయాలి? అన్న విషయంలో ముఖ్యంగా భారతీయులు చాలా వీక్​! 'రిస్క్​'కి భయపడి ముందడుగు వేయరు. రూ. కోట్లు సంపాదించాలని ఆశలు ఉన్నా.. డబ్బులన్నీ పోపు డబ్బాల్లోనే దాచుకుంటారు. ఇలా చేస్తే డబ్బులు ఎలా పెరుగుతాయి? మనలో మార్పు వస్తేనే.. డబ్బులు మన దగ్గరికి వస్తాయి. భారతీయులు సాధారణంగా చేసే తప్పులను మీరూ తెలుసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి..

ఖాళీగా పడి ఉండటం..

భారతీయుల ఇళ్లల్లో డబ్బులు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంటాయి. పరుపు కింద, వంటింట్లో, బీరువాల్లో డబ్బులు ఉంటాయి. వీటి వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం డబ్బు కోసం పనిచేయకూడదు.. ఆ డబ్బే మన కోసం పనిచేసే స్థాయికి ఎదగాలి. అలా జరగాలంటే.. ముందు డబ్బును ఖాళీగా ఉంచకూడదు. మంచి ఇంట్రెస్ట్​ ఇచ్చే పథకాలు, మ్యూచ్యువల్​ ఫండ్స్​ వంటి వాటిల్లో పెట్టి, సంపదను వృద్ధి చేసుకోవాలి.

సేవింగ్స్​ అకౌంట్​, కరెంట్​ అకౌంట్లు ఉన్నాయి కదా? అని అనుకుంటారు. వాస్తవానికి వాటితోనూ ఇంట్రెస్ట్​లు వస్తాయి. కానీ అవి ఏమాత్రం సరిపోతాయి? అందుకే మెరుగైన వడ్డీలు తెచ్చిపెట్టే వాటిలో పెట్టుబడి పెట్టాలి.

ఆశలు ఫుల్​- ప్రణాళికలు నిల్​..

Personal finance : ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఎన్నో కలలు ఉంటాయి. కానీ వాటిని నెరవేర్చుకునేందుకు కావాల్సిన 'ఆర్థిక' ప్రణాళికలు మాత్రం ఉండవు. మన భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలంటే.. రేపు అనే రోజు కోసం, ఇప్పుడే ఆర్థిక ప్రణాళికలు వేయాలి. ఆ ప్రణాళికలను అమలు చేసుకోవాలి. మన అవసరాలను.. స్వల్పకాలం, దీర్ఘకాలంగా విభజించుకుని అందుకు తగ్గట్టు డబ్బులు పోగు చేయాలి, వాటిని ఇన్​వెస్ట్​ చేయాలి.

పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి వాటికి నెలల ముందే ప్లాన్స్​ వేస్తూ ఉంటాము. అలాంటిది.. అత్యంత ముఖ్యమైన 'జీవితం' పట్ల నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటాము? ఎందుకు ప్రణాళికలు రచించుకోవడం లేదు.

పెట్టుబడులే శ్రేయస్కరం..

స్టాక్​ మార్కెట్లు, మ్యూచ్యువల్​ ఫండ్లు, బాండ్లలో పెట్టుబడులు పెట్టడం అనేది పెద్దవాళ్లకే, యువతకు ఆ అవసరం లేదని అని భారతీయులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పటి యువత.. పార్టీలు వంటి వ్యసనాల కోసం డబ్బులను నాశనం చేస్తున్నారు. వారికున్న ఆర్థిక జ్ఞానం.. సున్నా. లేకపోతే.. సేవింగ్స్​ అకౌంట్​ తీసి అందులో వేస్తూ ఉంటారు. కానీ ఇది సరైన విషయం కాదు. యుక్త వయస్సు నుంచే పెట్టుబడులు పెట్టడం మొదలుపెడితే.. జీవితం సాఫీగా సాగిపోతుంది. రిటర్నులు మంచిగా ఉంటాయి.

ఉదాహరణకు.. ఓ వ్యక్తి.. 25ఏళ్లప్పటి నుంచి ప్రతి నెల రూ.100 మ్యూచ్యూవల్​ ఫండ్స్​లో పెడితే.. రిటైర్మెంట్​ సమయానికి.. అతనికి రూ. 1కోటి వరకు వెనక్కి తిరిగివస్తుంది. ఇదే 'కాంపౌండింగ్​' బలం. కాంపౌండింగ్​ అనేది 8వ వండర్​గా భావిస్తుంటారు.

బీమాలను పట్టించుకోవాలి..

అనేకమంది భారతీయులు.. బీమా పాలసీల వల్ల డబ్బుల వృథా అని అనుకుంటారు. బీమాలు మోసం చేస్తాయని భావిస్తుంటారు. అది కూడా నిజం కాదు. జీవిత బీమా, ఆరోగ్య బీమాల్లో డబ్బులు పెట్టడం వల్ల మనతో పాటు మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా.. డబ్బులను మెరుగైన విధంగా ఉపయోగించుకోవచ్చు.

పెట్టుబడుల్లో జాగ్రత్త..

Investment tips : భారతీయుల్లో చాలా మందికి కొత్త విషయాన్ని ప్రయత్నించడం ఇష్టం ఉండదు. ప్రతిసారీ ఒకటే విషయాన్ని పట్టుకుంటారు. ఇలా చాలా మంది.. ఒకే దాంట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఉదాహరణకు.. గోల్డ్​లో పెట్టుబడి పెడితే, స్టాక్​ మార్కెట్​ను పట్టించుకోరు. మార్కెట్​లో పెడితే, రియల్​ ఎస్టేస్​ను పట్టించుకోరు. కానీ ఇవి అస్సలు మంచిది కాదు. ఇలాచేస్తే చాలా రిస్క్​ ఉంటుంది. మొత్తం డబ్బులను రియల్​ ఎస్టేట్​లో పెట్టి, ఆ తర్వాతి రోజే.. ధరలు భారీగా పడ్డాయి అని తెలిస్తే ఎలా ఉంటుంది? మొత్తం డబ్బులు మార్కెట్​లో పెట్టిన తర్వాత అవి కుప్పకూలితే ఎలా? అందుకే.. మన దగ్గర ఉన్న డబ్బును విభజించుకోవాలి. ప్రతి మార్గంలోనూ కొంతకొంత పెట్టుబడి పెడుతూ ఉండాలి. దీన్నే 'డైవర్సిఫైడ్​ పోర్ట్​ఫోలియో' అని అంటారు.

ఆర్థిక ప్రణాళికలు లేకపోవడం వల్ల జీవితం ప్రభావితమవుతుంది. సరైన మార్గాలను ఎంచుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలా కంటెంట్​ యూట్యూబ్​లో లభ్యమవుతోంది. వాటిని అర్థం చేసుకుంటూ పెట్టుబడులు పెట్టాలి. మీకు అప్పటికీ అర్థంకాకపోతే.. ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించాలి. అంతేకానీ.. అసలు పెట్టుబడులే చేయకుండా ఇంట్లో డబ్బులను ఖాళీగా ఉంచుకోవడం, లేదా.. తెలియని వాటిల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం.. ఈ రెండింటినీ చేయకూడదు!

సంబంధిత కథనం