Equity mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లోకి తగ్గిన నిధుల వరద-equity mutual funds inflow drops 43 pc to 8 898 crore rupees in july ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Equity Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లోకి తగ్గిన నిధుల వరద

Equity mutual funds: మ్యూచువల్ ఫండ్స్‌లోకి తగ్గిన నిధుల వరద

HT Telugu Desk HT Telugu
Aug 08, 2022 04:19 PM IST

Equity mutual funds' inflow drops: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూలై నెలలో భారీగా నిధులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.

<p>మ్యూచువల్ ఫండ్స్‌కు తగ్గిన నెట్ ఇన్‌ఫ్లో (ప్రతీకాత్మక చిత్రం)</p>
<p>మ్యూచువల్ ఫండ్స్‌కు తగ్గిన నెట్ ఇన్‌ఫ్లో (ప్రతీకాత్మక చిత్రం)</p> (HT_PRINT)

న్యూఢిల్లీ, ఆగస్టు 8: స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల మధ్య ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి జూలై నెలలో రూ. 8,898 కోట్లు వచ్చి చేరాయి. జూన్ నెలతో పోలిస్తే నిధుల ప్రవాహం 43 శాతం తక్కువ కావడం గమనార్హం. అయినప్పటికీ ఈక్విటీ స్కీమ్స్‌లోకి నిధుల ప్రవాహం రావడం వరుసగా ఇది 17వ నెల కావడం విశేషం.

జూన్ నెలలో నికర ఇన్‌ఫ్లో రూ. 15,495 కోట్లుగా ఉంది. మే నెలలో అది రూ. 18,529 కోట్లుగా ఉంది. ఏప్రిల్ నెలలో రూ. 15,890 కోట్ల మేర మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఏఎంఎఫ్ఐ) సోమవారం సంబంధిత గణాంకాలు వెల్లడించింది.

మార్చి 2021 నుంచి ఈక్విటీ స్కీముల్లోకి నిధుల రాక కొనసాగుతోంది. ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ కారణంగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీనికంటే ముందు కరోనా కాలంలో జూలై 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు వరుసగా 8 నెలల పాటు ఈక్విటీ స్కీముల నుంచి ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించుకున్నారు. దాదాపు రూ. 46,791 కోట్ల సొమ్ము వెనక్కి మళ్లింది.

జూలై నెలలో ఈక్విటీ ఓరియెంటెడ్ కేటగిరీల్లోకి నిధుల రాక కనిపించింది. స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి ఎక్కువ నిధులు వచ్చి చేరాయి. రూ. 1,780 కోట్ల మేర ఈ కేటగిరీలోకి పెట్టుబడులు వచ్చాయి. ఆ తరువాత ఫ్లెక్సి క్యాప్ ఫండ్ కేటగిరీలోకి రూ. 1,381 కోట్ల నిధులు వచ్చి చేరాయి. లార్జ్ క్యాప్ ఫండ్, లార్డ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీల్లో ఒక్కోదాంట్లో రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులు వచ్చి చేరాయి.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములు కాకుండా, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా జూలై నెలలో రూ. 4,930 కోట్ల మేర నిధులను ఆకర్షించాయి. జూన్ నెలలో ఈ కేటగిరీలో దాదాపు రూ. 92,247 కోట్ల మేర నిధుల ఉపసంహరణ చోటు చేసుకుంది.

అయితే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్) నుంచి రూ. 457 కోట్ల మేర నిధులను మదుపరులు ఉపసంహరించుకున్నారు. జూన్ నెలలో ఈ కేటగిరీలో రూ. 135 కోట్ల మేర ఇన్‌ఫ్లో ఉంది.

మొత్తంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ జూలై నెలలో రూ. 23,605 కోట్ల నికర ఇన్‌ఫ్లో కలిగి ఉంది. ఈ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిధుల రిడెంప్షన్ ఎక్కువగా ఉంది.

టాపిక్