US tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం; 22 మంది దుర్మరణం; భారీగా ఆస్తి నష్టం
28 May 2024, 19:25 IST
- అగ్ర రాజ్యం అమెరికాను భయంకరమైన వేగంతో వీస్తున్న ఈదురు గాలులు వణికిస్తున్నాయి. ఈ టోర్నడోల వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. గత వారం రోజుల్లోనే వీటి కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. టోర్నడోల ముప్పు ఉండడంతో లూయిస్ విల్లే, కెంటకీ ల్లో జరిగే గజెబొ ఫెస్టివల్ ను రద్దు చేశారు.
అయోవాలోని డేవన్ పోర్ట్ సిటీపై దట్టంగా కమ్ముకున్న భారీ మేఘం
US tornado news: అమెరికాలో శక్తివంతమైన టోర్నడో (tornado)లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. లేటెస్ట్ గా, పెన్సిల్వేనియాలోని మహనోయి సిటీలో ఒక పాఠశాలను, పెద్ద ఎత్తున గృహాలను ధ్వంసం చేశాయి. అమెరికాలో టోర్నడోల కారణంగా కనీసం 22 మంది మరణించారు. టోర్నడోల ప్రభావం పెన్సిల్వేనియాపై అత్యధికంగా ఉంది. ఈ మహనోయి సిటీ పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్‌బర్గ్‌కు ఈశాన్యంగా 70 మైళ్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి సుడిగాలి హెచ్చరికను ఆదివారమే నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసింది. టోర్నడోల వల్ల జరిగిన నష్టాన్ని మంగళవారం అంచనా వేశారు. కాగా, ఈ ప్రాంతంలోని ఆకాశాన్ని దట్టమైన కారు మేఘాలు కప్పేసిన చిత్రాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టెక్సాస్, ఓక్లహోమా, అర్కాన్సాస్, కెంటకీలలో కూడా..
పెన్సిల్వేనియాను తాకడానికి ముందు, ఈ విధ్వంసక టోర్నడోలు టెక్సస్, ఓక్లహోమా, అర్కాన్సాస్, కెంటకీలలో కూడా పలు మరణాలకు కారణమయ్యాయి. ఈ టోర్నడోల కారణంగా టెక్సస్ లో ఏడుగురు, ఆర్కాన్సస్ లో ఎనిమిది మంది చనిపోయారు. ఓక్లహోమాలోని మేయెస్ కౌంటీలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. టోర్నడోల వల్ల డజన్ల సంఖ్యలో గాయపడగా, ఆస్తి నష్టం కూడా భారీగా వాటిల్లింది. టోర్నడోల ముప్పుపై కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం..
కెంటకీ, టెక్సాస్, అర్కాన్సాస్, వెస్ట్ వర్జీనియా, మిస్సౌరీలలో మంగళవారం ఉదయం 200,000 కంటే ఎక్కువ గృహాలు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా లేదు. మరోవైపు, టెక్సాస్, ఓక్లహోమాలో మరికొన్ని రోజులు తీవ్రమైన ఉరుములు, గాలి, పెద్ద వడగళ్ళు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సాధారణంగా సెంట్రల్ యూఎస్ లో మే నెలలో అత్యంత తీవ్రమైన టోర్నడోలు ఏర్పడుతాయి. గత వారం అయోవాలో టోర్నడోల వల్ల కనీసం ఐదుగురు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ నెలలో హూస్టన్‌లో టోర్నడోలు, భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయారు.