USA Tornadoes: అమెరికాలోఅయోవా రాష్ట్రంలో టోర్నడోల బీభత్సం: ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు
Iowa Tornadoes: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉన్న చిన్న పట్టణం గ్రీన్ ఫీల్డ్ బుధవారం భారీ టోర్నడో బారిన పడింది. టోర్నడో బీభత్సంలో అక్కడి నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాణాంతక టోర్నడో కారణంగా ఐదుగురు మరణించారు. టెక్సాస్ లో వేలాది ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Iowa Tornadoes: అయోవాలోని గ్రీన్ ఫీల్డ్ అనే చిన్న నగరంలో సంభవించిన ప్రాణాంతక టోర్నడోలో నలుగురు మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బుధవారం ఈ నగరాన్ని చుట్టుముట్టిన టోర్నడోకు అమెరిక నేషనల్ వెదర్ సర్వీస్ ప్రమాదకరమైనదిగా సూచించే ఇఎఫ్ -3 రేటింగ్ ఇచ్చింది. టోర్నడో అనంతరం జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులకు ఒక రోజు కంటే ఎక్కువ సమయం పట్టింది. క్షతగాత్రుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అయోవా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ తెలిపింది.
కారు ప్రమాదంలో మరొకరు..
గ్రీన్ ఫీల్డ్ కు 25 మైళ్ల (40 కిలోమీటర్లు) దూరంలో టోర్నడో (Tornado) కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడటంతో మరొకరు మృతి చెందినట్లు ఆడమ్స్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో మోనికా జమారోన్ (46) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మిగతా బాధితుల పేర్లను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
టెంపుల్ సిటీలో టోర్నడో బీభత్సం
తీవ్రస్థాయి టోర్నడో బుధవారం దక్షిణం వైపు మళ్లింది. టెక్సస్ (Texas) లో ఆస్టిన్ కు ఉత్తరాన 90,000 మందికి పైగా జనాభా ఉన్న టెంపుల్ నగరంలో శక్తివంతమైన సుడిగాలులు సంభవించడంతో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. వేలాది మంది ఇళ్లల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పాఠశాలలు గురువారం తరగతులను రద్దు చేశాయి. మరోవైపు అయోవాలో గ్రీన్ ఫీల్డ్ ను అస్తవ్యస్తం చేసిన టోర్నడో డెస్ మొయిన్స్ కు నైరుతి దిశలో 55 మైళ్ల (89 కిలోమీటర్లు) దూరంలో ఉన్న చిన్న పట్టణంలో ఇళ్లను నేలమట్టం చేసింది. ఈ సుడిగాలి కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. కార్లు ధ్వంసమయ్యాయి. నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న విద్యుత్ ను ఉత్పత్తి చేసే భారీ పవన టర్బైన్లు కూడా కూలిపోయాయి.
అమెరికాలో అత్యధిక టోర్నడోలు..
వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా తుపానుల తీవ్రతను పెంచుతున్న తరుణంలో అమెరికాలో టోర్నడో సీజన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏప్రిల్ నెలలో అమెరికా (USA)లో అత్యధిక టోర్నడోలు నమోదయ్యాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 859 టోర్నడోలు నమోదయ్యాయి.ఇది యుఎస్ సగటు కంటే 27% ఎక్కువ. అయోవా (Iowa) లోనే ఇప్పటివరకు అత్యధికంగా 81 టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. అయోవాను మంగళవారం అతలాకుతలం చేసిన టోర్నడో 40 మైళ్ల (64 కిలోమీటర్లు) కంటే ఎక్కువ దూరం భూమిపై ఉన్నట్లు కనిపించిందని అక్యూవెదర్ చీఫ్ మెటియోరాలజిస్ట్ జాన్ పోర్టర్ తెలిపారు. బ్లాక్ స్కై టెక్నాలజీ తీసిన శాటిలైట్ ఫోటోలో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. ‘‘టోర్నడో తీవ్రంగా ఉన్న సమయంలో శిథిలాలను వేల అడుగుల మేర గాల్లోకి లేపి గ్రీన్ ఫీల్డ్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో నేలపై పడేసింది. ఈ టోర్నడో ఎంత తీవ్రంగా, ప్రాణాంతకంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం’’ అని పోర్టర్ పేర్కొన్నారు.