Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నం… భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే..భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఏపీ సిఎం నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 4,592 కోట్ల వ్యయంతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. దీంతో పాటు అదానీ డేటా సెంటర్‌కు కూడా నేడు శంకుస్థాపన చేయనున్నారు.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లాలో రూ.4592కోట్లతో నిర్మించే భోగాపురం విమానాశ్రయానికి బుధవారం ఉదయం శంకుస్థాపన చేస్తారు. రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో అదానీ గ్రూప్ నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ కు సిఎం శంకుస్థాపన చేస్తారు. రూ. 194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులకు, విజయనగరం జిల్లాలో రూ. 23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా నేడు శంకుస్ధాపన చేస్తారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరిస్తారు.
భూసేకరణ, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి ఎన్‌వోసీ, పర్మిషన్‌లు తీసుకొచ్చి ఎన్‌జీటీ, హైకోర్టు, సుప్రింకోర్టులలో న్యాయవివాదాలు పరిష్కరించి భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల ప్రారంభానికి సిద్దం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది.
ప్రయాణికుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. విశాఖ, శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానిస్తారు. అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ అభివృద్ది చేస్తారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్ ఏర్పాటు చేస్తారు.
ఎయిర్ పోర్ట్‌కు రోడ్ కనెక్టివిటీ…
16 వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం చేపడతారు. కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.
విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం చేపడతారు. రెండువైపులా సర్వీసు రోడ్లు నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పునరావాసం
విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం కల్పించారు. నిర్వాసితులకు ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించారు.
అదానీ డేటా సెంటర్….
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు. టెక్నాలజీ/బిజినెస్ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తారు.
అదానీ డేటా సెంటర్ డేటా హబ్‌తో డేటా స్పీడ్ గణనీయంగా పెరగనుంది. సింగపూర్ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు చేస్తారు. తద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ 5 రెట్లు పెరిగి భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవలు వృద్ది చెందుతాయి. భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదల ఉంటుంది. అధునాతన టెక్ కంపెనీలు విశాఖపట్నంను ఎంచుకునే వీలవుతుంది. తద్వారా ఐటీ రంగంలో ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయి.
డేటా సెంటర్‌కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్శిటీ, స్కిల్ సెంటర్‌ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపుకు మరింత ఊతం ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్టు…
విజయనగరం జిల్లా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీరుతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీరు అందించడమే లక్ష్యంగా రూ. 194.40 కోట్ల వ్యయంతో తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ పనులు చేపడతారు. డిసెంబర్ 2024 నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు.
చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్ సెంటర్
విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ. 23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి సిఎం శంకుస్తాపన చేస్తారు. అన్ని కాలాల్లోను సముద్రంలో సులువుగా చేపలు వేటాడేందుకు వెసులుబాటు దొరుకుతుంది. తుఫాను, విపత్తు సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బతినకుండా బోట్లకు లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. దీని వల్ల మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది.