Siricilla Accident: ఉపాధి హామీ పనిలో ప్రమాదం... ఒకరి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Siricilla Accident: ఉపాధి హామీ పనుల్లో ఉన్న కార్మికులపై మట్టి పెళ్లలు విరిగిపడటంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
Siricilla Accident: ఉపాధి హామీ పనుల్లో కూలీ పనికి వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
కోనరావుపేట మండలం వెంకట్రావ్ పేటలో ఉపాధి హామీ పథకం క్రింద చెరువు కట్ట వద్ద మట్టి తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గుంతలోకి దిగి నలుగురు మహిళలు మట్టి తీస్తుండగా వారిపై మట్టి పెళ్ళలు విరిగి పడ్డాయి.
మట్టి పెళ్ళలు బలంగా తగలడంతో మారుపాక రాజవ్వ (55) అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. కర్నాల లహరి, పల్లం దేవవ్వ, పల్లం రాజవ్వ కు గాయాలయ్యాయి. వెంటనే వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను మృతి చెందిన రాజవ్వ కుటుంబ సభ్యులను అధికారులతోపాటు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మృతి చెందిన మహిళా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రాణాలు కోల్పోయిన తల్లి అనాధలైన ముగ్గురు పిల్లలు
మృతి చెందిన రాజవ్వ నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. రెక్కాడితే గానీ, దొక్క నిండని కుటుంబం కావడంతో ఉపాధి హామీ పనికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రాజవ్వ భర్త మృతి చెందగా ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఎవరికి పెళ్ళి కాలేదు. కూలీ పని చేస్తు కుటుంబాన్ని రాజవ్వ పోషిస్తుంది. ఉపాధి హామీ కూలీ పనికి వెళ్ళి తల్లి మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.
చిన్నప్పుడే తండ్రీ, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో బోరున విలపించారు. ప్రమాదంలో ప్రాణాలు కల్పోయిన మహిళా కుటుంబానికి 25 లక్షల ఎక్సిగ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, కరీంనగర్ జిల్లా)