తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  2022 Elections Roundup : ఎన్నికల భారతంలో బీజేపీదే హవా.. ఆమ్​ ఆద్మీకి తీపి జ్ఞాపకం!

2022 elections roundup : ఎన్నికల భారతంలో బీజేపీదే హవా.. ఆమ్​ ఆద్మీకి తీపి జ్ఞాపకం!

24 December 2022, 9:13 IST

google News
    • 2022 elections roundup in India : దేశ రాజకీయాల్లో బీజేపీ హవా.. 2022లోనూ కొనసాగింది! ఈ ఏడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలు, ఉప సమరం, స్థానిక ఎన్నికల్లో కమలదళం సత్తా చాటింది. అదే సమయంలో బీజేపీకి గట్టిపోటీ.. ఆమ్​ ఆద్మీ నుంచి లభించింది. పంజాబ్​ అసెంబ్లీతో పాటు ఢిల్లీ స్థానిక సమరంలో విజయం సాధించిన ఆప్​.. దేశ రాజకీయాల్లో దూకుడును మరింత పెంచేసింది.
ఎన్నికల భారతంలో బీజేపీదే హవా.. ఆప్​లో చిగురించిన ఆశ!
ఎన్నికల భారతంలో బీజేపీదే హవా.. ఆప్​లో చిగురించిన ఆశ!

ఎన్నికల భారతంలో బీజేపీదే హవా.. ఆప్​లో చిగురించిన ఆశ!

2022 elections roundup in India : 2022 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా.. ఎన్నికలతో ఈ ఏడాది చాలా రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారాలు, హామీల మోతమోగిపోయాయి. ఎప్పటిలాగానే.. ఎన్నికల భారతంలో బీజేపీనే పైచేయి సాధించింది. మొత్తం 7 రాష్ట్రాల్లో.. ఐదింట్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆమ్​ ఆద్మీకి మాత్రం ఈ ఏడాది.. ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది! పంజాబ్​ అసెంబ్లీతో పాటు ఢిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో విజయం సాధించి.. జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు, గెలుపోటములను ఓసారి చూద్దాం..

'అసెంబ్లీ'లో బీజేపీ హవా..

గోవా:- గోవాలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ కమలదళానికి 20సీట్లు దక్కాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి బీజేపీకి 7సీట్లు అధికంగా వచ్చినా.. మెజారిటీకి(21) ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. కానీ ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించింది. ప్రమోద్​ సావంత్​ మరోమారు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్​​.. 11 సీట్లతోనే సరిపెట్టుకుంది.

ఉత్తరాఖండ్​:- ఉత్తరాఖండ్​లో సైతం బీజేపీ.. తన అధికారాన్ని నిలబెట్టుకుంది. 70 సీట్లున్న అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగ్గా.. బీజేపీ 47స్థానాల్లో గెలుపొందింది. మెజారిటీ(36)కి మించిన సీట్లు లభించడంతో రెండోసారి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. సీఎం పదవిని స్వీకరించారు పుష్కర్​ సింగ్​ ధామి. కాంగ్రెస్​కు ఇక్కడ 19 సీట్లే దక్కాయి. గతంతో పోల్చుకుంటే 8 సీట్లు పెరిగాయి. మరోవైపు గతంతో పోల్చుకుంటే బీజేపీకి 10సీట్లు దక్కాయి!

2022 Punjab elections : పంజాబ్​:- పంజాబ్​లో సంచలనమే జరిగింది! అధికార కాంగ్రెస్​కు తేరుకోలేని విధంగా షాక్​ ఇస్తూ.. ఇక్కడ ఆమ్​ ఆద్మీ దూసుకెళ్లింది. 117 సీట్లకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగ్గా.. ఆప్​నకు ఏకంగా 92 సీట్లు వరించాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే 72 సీట్లు పెరిగాయి. ఇక అధికారం కోల్పోయిన కాంగ్రెస్​కు 18 సీట్లే దక్కాయి. గతంతో పోల్చుకుంటే 59 సీట్లు తగ్గాయి. ఆప్​ గెలుపుతో భగవంత్​ మన్​ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ గెలుపుతో ఆప్​లో కొత్త ఆశలు చిగురించాయి. జాతీయ రాజకీయాల్లో ఆప్​.. తన బలాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తున్న సమయంలో పంజాబ్​ గెలుపు రావడం విశేషం. పంజాబ్​ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​ మరింత దూకుడుగా వ్యవహరిండం మొదలుపెట్టింది.

మణిపూర్​:- 60సీట్లు మణిపూర్​ అసెంబ్లీకి ఫిబ్రవరి 28, మార్చ్​ 5న రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మెజారిటీకి 31 సీట్లు అవసరం ఉండగా.. బీజేపీకి 32 స్థానాల్లో విజయం లభించింది. ఫలితంగా వరుసగా రెండోసారి ఇక్కడ అధికారాన్ని చేపట్టింది. బీరేన్​ సింగ్​ మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు. గతంతో పోల్చుకుంటే కమలదళానికి ఈసారి 11 సీట్లు పెరగడం గమనార్హం.

Uttar Pradesh assembly elections 2022 : ఉత్తర్​ప్రదేశ్​:- ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉత్తర్​ప్రదేశ్​ అత్యంత హాట్​టాపిక్​గా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రాక్టీస్​ మ్యాచ్​గా భావించి.. వివిధ పార్టీలు ఉత్తర్​ప్రదేశ్​లో తీవ్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. ఏడు దశల్లో.. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చ్​ 3-7 తేదీల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 403 సీట్లకుగాను.. 255 సీట్లు దక్కించుకుని మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలదళం. యోగి ఆదిత్యనాథ్​ సీఎంగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం బీజేపీకి ఇక్కడ 57 సీట్లు తగ్గాయి. అదే సమయంలో విపక్ష ఎస్​పీ బలంగా పుంజుకుంది. 111 సీట్లల్లో గెలిచింది. గతంతో పోల్చుకుంటే ఎస్​పీకీ 64 సీట్లు పెరిగాయి. కాంగ్రెస్​ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. బీఎస్​పీకి 1 సీటు దక్కింది. గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్​కు 3, బీఎస్​పీకి 18 సీట్లు తగ్గాయి!

హిమాచల్​ ప్రదేశ్​:- 68 సీట్లున్న హిమాచల్​ ప్రదేశ్​కు నవంబర్​ 12న పోలింగ్​ జరిగింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ గెలిచిన ఏకైక రాష్ట్రం ఇదే. అది కూడా.. అధికార బీజేపీని ఓడించి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. సుఖ్​విందర్​ సింగ్​ సుఖు సీఎంగా ప్రమాణం చేశారు. 35 సీట్ల మెజారిటీ కావాల్సి ఉండగా.. కాంగ్రెస్​కు 40, బీజేపీకి 25 సీట్లు వరించాయి. గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్​కు 18 సీట్లు పెరగ్గా.. బీజేపీ 18 సీట్లు కోల్పోయింది.

2022 Gujarat elections results : గుజరాత్​:- బీజేపీ కంచుకోటగా పేరొందిన గుజరాత్​లో ఈ నెల 1,5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 182 సీట్లు ఉండగా.. మెజారిటీకి 92 స్థానాల్లో గెలుపు అవసరం. కాగా ఇక్కడ బీజేపీ మరోమారు తన ఆధిపత్యాన్ని చెలాయించింది. గతంతో పోల్చుకుంటే.. ఏకంగా 57సీట్లు అధనంగా గెలిచింది. మొత్తం మీద 156 సీట్లను వెనకేసుకుంది. భూపేంద్ర పటేల్​ సీఎం అయ్యారు. విపక్ష కాంగ్రెస్​.. కేవలం 17 సీట్లతో సరిపెట్టుకుంది. గతంతో పోల్చుకుంటే 60 సీట్లు తగ్గాయి. తొలిసారి పోటీ చేసిన ఆప్​నకు ఇక్కడ 5 సీట్లు వచ్చాయి.

ఉప సమరంలోనూ బీజేపీదే హవా..!

2022 elections BJP : ఈ ఏడాది 5 లోక్​సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తర్​ప్రదేశ్​లో 3, పంజాబ్​ 1, పశ్చిమ్​ బెంగాల్​లో 1 లోక్​సభ సీటు ఉపఎన్నికల్లోకి వెళ్లాయి. ఉత్తర్​ప్రదేశ్​లో రెండు సీట్లు బీజేపీకి ఒక సీటు ఎస్​పీకి దక్కాయి. పశ్చిమ్​ బెంగాల్​లో టీఎంసీ, పంజాబ్​లో ఆమ్​ ఆద్మీ గెలిచాయి.

ఇక ఈ ఏడాది 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ 10 సీట్లల్లో గెలిచింది. కాంగ్రెస్​ ఏడింట్లో విజయం సాధించింది.

రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి ఎన్నికలు..

2022 Presidential elections : 2022లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరిగాయి. జులై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందారు. ఆగస్టు 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్​డీఏ అభ్యర్థి జగ్​దీప్​ ధన్​ఖడ్​ విజయం సాధించారు.

స్థానిక సమరం..

MCD election 2022 : 2022లో అసోం, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్​, మణిపూర్​, మిజోరాం, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ్​ బెంగాల్​లో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఢిల్లీ మున్సిపల్​ ఎలక్షన్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్​ 4న ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తొలిసారిగా బీజేపీని ఓడించి విజేతగా అవతరించింది ఆమ్​ ఆద్మీ పార్టీ. ఫలితంగా దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్​ ఎదుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం