Punjab election result | సీఎం, మాజీ సీఎంలకు ప్రజలు భారీ షాక్​-punjab election result channi amarinder singh looses ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Punjab Election Result | సీఎం, మాజీ సీఎంలకు ప్రజలు భారీ షాక్​

Punjab election result | సీఎం, మాజీ సీఎంలకు ప్రజలు భారీ షాక్​

HT Telugu Desk HT Telugu
Mar 10, 2022 02:59 PM IST

పంజాబ్​ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం చరణ్​జిత్​ సింగ్​ చన్నీ, మాజీ సీఎం అమరీందర్​ సింగ్​లకు ప్రజలు భారీ షాక్​ ఇచ్చారు. చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. ఇక అమరీందర్​ సైతం ఓడిపోయారు.

అమరీందర్​ సింగ్​- చరణ్​జీత్​ సింగ్​ చన్నీ
అమరీందర్​ సింగ్​- చరణ్​జీత్​ సింగ్​ చన్నీ (Hindustan times)

Punjab election results | పంజాబ్​ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్​కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా.. కాంగ్రెస్​ 'కోటి' ఆశలు పెట్టుకున్న చరణ్​జిత్​ సింగ్​ చన్నీ.. పోటీ చేసిన రెండు సీట్లల్లోనూ ఓటమిపాలయ్యారు. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ దఫా ఎన్నికల్లో చన్నీ రెండు సీట్లల్లో(చంకౌర్​ సాహెబ్​, బదౌర్​) పోటీ చేశారు. కానీ ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవలేదు. బదౌర్​లో.. ఆమ్​ ఆద్మీ పార్టీకి చెందిన లభ్​ సింగ్​ చేతిలో చన్నీ ఓడిపోయారు. లభ్​ సింగ్​కు 57వేల పైచిలుకు ఓట్లు రాగా.. చన్నీ 23వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు.

Charanjit Singh Channi defeated | ఇక మరో సీటులో చన్నీపై అదే పేరు ఉన్న ఆప్​ అభ్యర్థి చరణ్​జిత్​ సింగ్​ గెలిచారు. వీరి మధ్య దాదాపు 5వేల ఓట్ల తేడా ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి చన్నీపై కాంగ్రెస్​ కోటి ఆశలు పెట్టుకుంది. దళిత నేత.. ఓట్లు తెచ్చిపెడతాడని.. తొలుత ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఆ తర్వాత సీఎం అభ్యర్థిగా నిలబెట్టింది. నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా.. దళిత మంత్రంతో హైకమాండ్​ చన్నీకి ఓటేసింది. కానీ ప్రజలు మాత్రం ఆయనకు ఓటు వేయలేదు. ఇది పంజాబ్​ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది.

అమరీందర్​ సింగ్​ కూడా..

Amarinder Singh seat | ఇక మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ది కూడా ఇదే పరిస్థితి. పాటియాలా నుంచి పోటీ చేసిన కెప్టెన్​.. ప్రత్యర్థి, ఆప్​ అభ్యర్థి అజిత్​పాల్​ కోహ్లీ చేతిలో ఓటమిపాలయ్యారు. దాదాపు 20వేల ఓట్ల తేడాతో అమరీందర్​ ఓడిపోవడం గమనార్హం. ప్రజల నిర్ణయాన్ని స్వీకరిస్తున్నట్టు అమరీందర్​ వెల్లడించారు.

సిద్ధూతో విభేదాలతో కాంగ్రెస్​కు, సీఎం పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు అమరీందర్​. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ను స్థాపించారు. కానీ ఆయనే గెలవలేకపోయారు. ఇక ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంది.

సిద్ధూ పరిస్థితి..

Navjot Singh Sidhu election | నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ కూడా ఓటమి పాలయ్యారు. సీద్ధూకు 32,929 సీట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి, ఆప్​ అభ్యర్థి జీవన్​ జ్యోత్​ కౌర్​కు 39,520 సీట్లు వచ్చాయి.

ఓటమిపై సిద్ధూ స్పందించారు. ‘ప్రజల మాట.. దేవుడి మాటతో సమానం. నేను స్వీకరిస్తున్నాను,’ అని అన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్​ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పంజాబ్​ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.

పంజాబ్​ కాంగ్రెస్​లో అంతర్గత కలహాలు, అమరీందర్​- చన్నీలతో విభేదాలతో సిద్ధూ పేరు నిత్యం వార్తల్లో ఉండేది. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేసేవారు సిద్ధూ. ఎన్నికలు సమీపించినా ఆయన వైఖరి మారలేదు. సీఎం అభ్యర్థిగా తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. హైకమాండ్​పై ప్రత్యక్షంగానే విమర్శలు చేశారు.

ఇక ప్రస్తు పంజాబ్​ ఎన్నికల ఫలితాలలో పంజాబ్​లో ఆప్​ దూసుకెళుతోంది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.

IPL_Entry_Point

సంబంధిత కథనం