Delhi MCD Election Results: ఢిల్లీ కార్పొరేషన్ ఆప్‍దే.. బీజేపీ 15ఏళ్ల ఆధిపత్యానికి తెర
Delhi MCD Election Results 2022: ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‍ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆప్.. ఇక ఢిల్లీ పురపాలికనూ సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్.. ఆప్‍కు పట్టం కట్టబెట్టింది.
Delhi MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi).. ఆమ్‍ఆద్మీ పార్టీ వశమైంది. MCD ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సేన చరిత్రాత్మక విజయం సాధించింది. 15 సంవత్సరాలుగా ఢిల్లీ కార్పొరేషన్.. భారతీయ జనతా పార్టీ (BJP) కంట్రోల్‍లో ఉండగా.. ఈసారి ఆప్ కైవసం చేసుకుంది. కార్పొరేషన్‍లో కాషాయ పార్టీ ఆధిపత్యానికి ఆప్ ముగింపు పలికింది. 8 సంవత్సరాలుగా దేశ రాజధాని ఢిల్లీని పాలిస్తున్న ఆమ్‍ఆద్మీ.. తొలిసారి మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.
Delhi MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍లోని 250 వార్డుల్లో ఆమ్‍ఆద్మీ పార్టీ (AAP) 134 స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీకి 126 స్థానాలు అవసరం కాగా.. ఆప్ ఆ ఆధిక్య మార్కును సునాయాసంగా దాటింది. ఘన విజయం సాధించింది. ఢిల్లీ మేయర్ పీఠాన్ని తొలిసారి దక్కించుకునేందుకు సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 104 స్థానాల్లో గెలిచింది. 15 సంవత్సరాల తర్వాత ఎంసీడీ ఎన్నికల్లో కమలం పార్టీ పరాజయాన్ని చవిచూసింది. 2007 నుంచి ఢిల్లీ కార్పొరేషన్‍ను ఏలిన కషాయదళం ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 చోట్ల మాత్రమే గెలిచింది. సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
ఆరంభంలో ఉత్కంఠ
Delhi MCD Polls Results 2022:ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే లెక్కింపు మొదలైన గంట, గంటన్నర వరకు ఆప్, బీజేపీ హోరాహోరీగా ఉన్నట్టు కనిపించాయి. స్పష్టమైన మెజార్టీ వస్తుందా అన్న సందేహాలు కూడా రేగాయి. అయితే కాసేపటికే ట్రెండ్ మొత్తం ఆమ్‍ఆద్మీ వైపు మొగ్గింది. సులువుగా ఆధిక్య మార్కును దాటేసింది. మరోవైపు కాంగ్రెస్ 10 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు దగ్గరిగా.. ఈ తుది ఫలితాలు ఉన్నాయి.
ఆమ్ఆద్మీ సంబరాలు
Delhi MCD Polls Results 2022: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికాక ముందు నుంచే ఆమ్‍ఆద్మీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. డోళ్లతో వీధుల్లో వేడుకలు చేసుకున్నారు. సీఎం కేజ్రీవాల్ వల్లే గెలుపు సాధ్యమైందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆమ్‍ఆద్మీనే ప్రత్యామ్నాయం అంటూ నినదిస్తున్నారు.
250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍కు ఈనెల 4వ తేదీన పోలింగ్ జరిగింది. సుమారు 50 శాతం పోలింగ్ నమోదైంది.
2017 ఎన్నికల సమయంలో 270 వార్డులు ఉండగా.. అప్పుడు బీజేపీ 181 చోట్ల గెలిచింది. ఆమ్‍ఆద్మీ ఆ ఎన్నికల్లో 48 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఆమ్‍ఆద్మీ అధికారం దక్కించుకుంది.