Election Results 2022 Live: గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. హిమాచల్‌ హస్తానిదే-assembly election results 2022 live updates gujarat and himachal pradesh constituency wise counting updates election news today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Election Results 2022 Live: గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. హిమాచల్‌ హస్తానిదే

గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేంద్ర పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ల విజయోత్సాహం(PTI)

Election Results 2022 Live: గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. హిమాచల్‌ హస్తానిదే

11:46 AM ISTDec 08, 2022 03:57 PM HT Telugu Desk
  • Share on Facebook
11:46 AM IST

  • Assembly Election Results 2022 Live: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గుజరాత్‌లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. హిమాచల్‌లో నువ్వానేనా అన్న పోరు కొనసాగుతోంది. ఫలితాలు ఎప్పటికప్పుడూ తెలుసుకునేందుకు HT తెలుగు లైవ్ పేజీని రిఫ్రెష్ చేయండి.

Thu, 08 Dec 202211:38 AM IST

హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. 68 సీట్లకు గాను ఇప్పటికే 38 స్థానాల్లో విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గద్దెనెక్కాలంటే ఆ పార్టీకి 35 సీట్లు వస్తే సరిపోతుంది.

Thu, 08 Dec 202210:42 AM IST

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భారీ విజయం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా అర్బన్ నియోజకవర్గం నుంచి 1.92 లక్షల ఆధిక్యంతో వరుసగా రెండోసారి విజయం సాధించారు. పటేల్ ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకుంటారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. పటేల్‌కు 2,12,480 ఓట్లు రాగా, ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి అమిబెన్ యాగ్నిక్ 21,120 ఓట్లను సాధించారు. ఆప్ అభ్యర్థి విజయ్ పటేల్ 15,902 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పాటిదార్-ఆధిక్యత గల ఘట్లోడియా స్థానం గుజరాత్‌కు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చింది. భూపేంద్ర పటేల్, ఆనందీబెన్ పటేల్ ఇక్కడి నుంచే ముఖ్యమంత్రులయ్యారు. ఇది బీజేపీకి కంచుకోట. 2017లో పాటిదార్ కోటా ఆందోళన అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చినప్పటికీ, భూపేంద్ర పటేల్ 1.17 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

Thu, 08 Dec 202210:27 AM IST

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపు

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ అభ్యర్థిగా జామ్‌నగర్ నార్త్ నియోజక వర్గంలో తన సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యం కనబరిచారు. 15 రౌండ్ల ఓటింగ్ తర్వాత రివాబా జడేజా 77,630 ఓట్లను గెలుచుకోగా, ఆమె సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్ కర్మూర్ 31,671 ఓట్లు సాధించారని ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బిపేంద్రసింగ్ జడేజా మూడవ స్థానంలో నిలిచారు. రవీంద్ర జడేజా తన భార్య రివాబా కోసం ప్రచారం చేశారు. అయితే అతని సోదరి నైనాబా జడేజా కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. 

Thu, 08 Dec 202209:46 AM IST

సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ ఓట్లను విభజించేందుకు గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి బీజేపీ నిధులు సమకూర్చిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఆరోపించారు. కొత్తగా ఆవిర్భవించిన పార్టీ భారీగా డబ్బును వెదజల్లిందని అన్నారు. ‘గుజరాత్‌లో ఆప్ చాలా ఖర్చు చేసింది. కాంగ్రెస్ ఓట్లను విభజించేందుకు బీజేపీ ఆప్‌కి నిధులు సమకూర్చిందని నాకున్న సమాచారం. ఆప్ ఎన్నికల్లో పోటీ చేసినందున మేం వెనుకబడిపోయాం..’ అని సిద్ధరామయ్య ఇక్కడ విలేకరులతో అన్నారు. కొత్తగా వచ్చిన పార్టీకి 10 శాతం ఓట్లు రావడంతో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిందని ఆయన అన్నారు. 'ఎన్నికల్లో ఆప్ భారీగా డబ్బు ఖర్చు చేసింది. కాంగ్రెస్ కంటే ఎక్కువ ఖర్చు చేసింది. ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది' అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ‘ఆప్ ఎన్నికల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో మా ఓట్లను మాయం చేసింది..’ అని అన్నారు. 

Thu, 08 Dec 202209:00 AM IST

మీ పార్టీ పతనం గురించి ఆందోళన చెందండి: షెకావత్

నదుల ఉగ్రరూపం కంటే కాంగ్రెస్ పార్టీ పతనం గురించి ఎక్కువగా ఆందోళన చెందాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిని ఎగతాళి చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని తన నియోజకవర్గంలో నది ఉద్ధృతి వల్ల జరిగిన నష్టం గురించి ప్రశ్నోత్తరాల సమయంలో చౌదరి అడిగిన అనుబంధ ప్రశ్నకు జలశక్తి మంత్రి సమాధానమిచ్చారు. నదీజలాల ఉద్ధృతి వల్ల జరిగిన నష్టం కంటే కాంగ్రెస్ పతనం గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందాలని షెకావత్ అన్నారు. నది ఉద్ధృతి తీవ్రమైన సమస్య అని, దీనికి చాలా కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. 

Thu, 08 Dec 202208:35 AM IST

గుజరాత్‌లో మిన్నంటిన సంబరాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో గాంధీనగర్‌లో ఆ పార్టీ సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ విజయాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ కార్యకర్తలు సంగీత వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. మధ్యాహ్నం 2.03 గంటల వరకు ఎన్నికల సంఘం తాజా గణాంకాల ప్రకారం బీజేపీ 156 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుజరాత్‌లో 27 ఏళ్లుగా భాజపా అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 2017లో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చింది. 

Thu, 08 Dec 202208:24 AM IST

హిమాచల్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం

ఇప్పటివరకు ఉన్న ఫలితాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. 68 స్థానాలు ఉన్న హిమాచల్‌లో అధికారంలోకి రావాలంటే కనీసం 35 స్థానాలు దక్కాలి. ఇక్కడ కాంగ్రెస్ ఇప్పటివరకు రెండింట విజయం సాధించి, మరో 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే మొత్తంగా 40 సీట్లలో పైచేయి సాధించింది. ఇక బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అయితే కొన్నిస్థానాల్లో మెజారిటీ కేవలం వందల్లో ఉండడంతో అంతిమ ఫలితాల్లో మార్పు తప్పకపోవచ్చు. 

Thu, 08 Dec 202208:20 AM IST

కర్ణాటకపై సానుకూల ప్రభావం: బొమ్మై

గుజరాత్‌లో బీజేపీ ఘనవిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలో ఎన్నికల ఫలితాలపై సానుకూల ప్రభావం చూపుతాయని అన్నారు. ఈ  ఫలితం కర్నాటక ఎన్నికలపైనా సానుకూల ప్రభావం చూపుతుందని, బీజేపీ క్యాడర్‌కు, మద్దతుదారులకు ఇది పెద్ద నైతిక స్థైర్యాన్ని ఇస్తుందని, మరింత శక్తివంతంగా పనిచేస్తే తమ గెలుపు ఖాయమని బొమ్మై ఇక్కడ విలేకరులతో అన్నారు. ప్రజలు మంచి పరిపాలనకు మద్దతిచ్చారని, ప్రభుత్వ సానుకూలత గుజరాత్‌లో ఎక్కువగా ఉందని అభివర్ణించారు.

Thu, 08 Dec 202207:57 AM IST

ఫలితాలపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు: ఖర్గే

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ‘ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతే సాయంత్రం మా పార్టీ మాట్లాడుతుంది’ అని ఖర్గే విలేకరులతో అన్నారు. గుజరాత్‌లో బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 127 సీట్ల తన స్వంత రికార్డును, 1985 నాటి కాంగ్రెస్ 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టనుంది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను బీజెపీ ప్రస్తుతం 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Thu, 08 Dec 202207:27 AM IST

పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న ముఖ్యమంత్రి, పార్టీ చీఫ్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ మరికాసేపట్లో గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయానికి రానున్నారు. పార్టీ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రానుందని తాజా ట్రెండ్స్ సూచించడంతో నేతలిద్దరూ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. బిజెపి ఇప్పటికే రెండు స్థానాల్లో విజయంతో తన ఖాతా తెరిచింది. దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంతో దహోద్ నియోజకవర్గంలో పార్టీ తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ గెలిచిన మరో స్థానం పెట్లడ్ నియోజకవర్గం. ఎన్నికల కమిషన్ తాజా ట్రెండ్స్ ప్రకారం మధ్యాహ్నం 12.56 గంటల వరకు బీజేపీ 152 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 19, ఆప్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Thu, 08 Dec 202206:56 AM IST

గోద్రాలో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి 

గుజరాత్‌లోని గోద్రా అసెంబ్లీ స్థానంలో ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి సికె రౌల్జీ గురువారం తన కాంగ్రెస్ ప్రత్యర్థి రష్మితాబెన్ చౌహాన్‌పై ఆధిక్యంలో ఉన్నారు.  20 ఏళ్ల క్రితం రైలును తగులబెట్టిన ఘటన గోద్రాలో చోటుచేసుకుంది. మతపరంగా సున్నితమైన ఈ అసెంబ్లీ స్థానంలో చౌహాన్‌పై రౌల్జీ 25,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రౌల్జీ 2007 నుండి 2016 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 2017 నుండి బిజెపి శాసనసభ్యుడిగా గోద్రా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మతపరమైన విభజన ఇప్పటికీ కొనసాగుతున్న గోద్రాలో దాదాపు 2,79,000 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో 72,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజేష్ భాయ్ పటేల్, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) నుండి షబ్బీర్ కచ్బా కూడా పోటీలో ఉన్నారు. గత ఏడాది జరిగిన గోద్రా మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొంది అరంగేట్రం చేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నమోదు చేయాలని చూసింది.

Thu, 08 Dec 202206:43 AM IST

హిమాచల్‌లో ఆధిక్యంలో ఉన్న ప్రముఖులు వీరే

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలకు గాను 37 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీ ఒక స్థానంలో గెలిచి 27 స్థానాల్లో ముందంజలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో ముందంజలో ఉండగా, 67 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇంకా ఖాతా తెరవలేదని ఎన్నికల సంఘం తెలిపింది. మండి జిల్లాలోని సుందర్‌నగర్‌లో ఒక స్థానం ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బిజెపికి చెందిన రాకేష్ జమ్వాల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 8,125 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సెరాజ్ నుంచి ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్, మంత్రులు బిక్రమ్ సింగ్ (జస్వంత్ పరాగ్‌పూర్), రామ్ లాల్ మార్కండే (లాహౌల్-స్పితి), రాకేష్ పఠానియా (ఫతేపూర్), స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్ (సుల్లా) ముందంజలో ఉన్నారు. బీజేపీకి చెందిన పురాణ్ చంద్ (దరంగ్), మాజీ మంత్రి నరేందర్ బ్రగత కుమారుడు చేతన్ బ్రగత (జుబ్బల్ కోట్‌ఖాయ్), కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ కుమారుడు అనిల్ శర్మ (మండి సదర్) ముందంజలో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి హరోలీ నుంచి ఆధిక్యంలో ఉండగా, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ కుల్దీప్ రాథోడ్ (థియోగ్), మాజీ మంత్రి సుధీర్ శర్మ (ధర్మశాల), ధని రామ్ షాండిల్ (సోలన్) కూడా ముందంజలో ఉన్నారు. కిన్నౌర్ నుండి కాంగ్రెస్‌కు చెందిన జగత్ సింగ్ నేగి, సిమ్లా రూరల్ నుండి దివంగత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్, నౌదన్ నుండి సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు.

Thu, 08 Dec 202206:06 AM IST

గుజరాత్‌లో రికార్డులు తిరగ రాస్తున్న బీజేపీ

గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం తాజా ట్రెండ్స్‌ ప్రకారం 151 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ పాత రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తోంది.  ఇదివరకు ఆ పార్టీ 2002లో 127 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ 1985లో 147 సీట్లు సాధించింది. ఆయా ఎన్నికల రికార్డులు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. రాష్ట్రంలో భారీ మెజారిటీతో బీజేపీ ఏడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇప్పటివరకు వరసగా ఏడుసార్లు విజయం సాధించిన పార్టీగా సీపీఎం చరిత్రలో నిలిచింది. బెంగాల్‌లో సీపీఎం వరుసగా ఏడుసార్లు విజయం సాధించింది.

Thu, 08 Dec 202205:59 AM IST

ముందంజలో ఉన్న బీజేపీ రెబెల్స్

భారతీయ జనతా పార్టీ తిరుగుబాటుదారులు హిమాచల్ ప్రదేశ్‌లోని వారి వారి నియోజకవర్గాల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా ముందంజలో ఉన్నారు. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ 38 స్థానాల్లో, బీజేపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ రెబల్ హితేశ్వర్ సింగ్ బంజార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 8585 ఓట్లతో ముందంజలో ఉన్నారు. మరో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి డెహ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పటి వరకు 10903 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు నలాగఢ్‌లో బీజేపీ రెబల్‌ కేఎల్‌ ఠాకూర్‌ కూడా 12378 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 

Thu, 08 Dec 202205:41 AM IST

హిమాచల్‌లో మెజారిటీ మార్క్ హస్తానికే

ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 68 స్థానాలకు గాను 35 స్థానాలు వచ్చిన వారు గద్దెనెక్కుతారు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 30 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇప్పటివరకు 43.02 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 43.38 శాతం రావడం విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీకి 1.1 శాతం ఓట్లు లభించాయి.

Thu, 08 Dec 202205:39 AM IST

ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి: కాంగ్రెస్

గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి రావడంపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రఘు శర్మ స్పందించారు. తమ పార్టీకి "ఆశ్చర్యకరమైన" ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని.. తుది ఫలితాల కోసం వేచి ఉండాలని అని అన్నారు. మొత్తం 182 స్థానాలకు గాను 151 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 

Thu, 08 Dec 202205:37 AM IST

ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉన్న ఆశాకుమారి వెనకంజ

హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ అసెంబ్లీ స్థానంలో ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆశా కుమారి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థి డిఎస్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుమారి కూడా పోటీలో ఉన్నారు. 

Thu, 08 Dec 202205:20 AM IST

హిమాచల్‌లో ఫలితం రసవత్తరం

హిమాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సి) మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. ఇద్దరూ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రస్తుతం తన నియోజకవర్గం సెరాజ్ నుండి దాదాపు 15 వేల ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. సెరాజ్ సీటులో ఠాకూర్ 14921 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి చేత్ రామ్ 4351 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. సిమ్లా రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ మొత్తం 7233 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. కులు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ సింగ్ ఠాకూర్ 11599 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి నరోతమ్ సింగ్ మొత్తం 8033 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ధర్మశాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ శర్మ 6338 ఓట్లతో ముందంజలో ఉండగా, బిజెపికి చెందిన రాకేష్ కుమార్ 3584 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. 

Thu, 08 Dec 202204:58 AM IST

హిమాచల్‌లో సీన్ రివర్స్

కొద్దిసేపటి క్రితం వరకు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పైచేయి కనబరచగా.. తాజాగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఇక్కడ 33 సీట్లలో, కాంగ్రెస్ 31 సీట్లలో లీడ్‌లో ఉన్నాయి. మరో నాలుగు సీట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఈ పరిస్తితి ఎక్కువసేపు కొనసాగే సంకేతాలు లేవు. బలాబలాలు తరచుగా మారుతున్నాయి.

Thu, 08 Dec 202204:56 AM IST

గుజరాత్‌లో రికార్డుస్థాయి సీట్ల దిశగా బీజేపీ

1995 నుండి రాష్ట్రంలో ఓడిపోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు రికార్డుస్తాయి భారీ విజయాన్ని సాధిస్తుందని ముందస్తు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆప్ 6 స్థానాల్లో లీడ్ కనబరుస్తోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తొలి ట్రెండ్‌లో ముందున్న వారిలో పలువురు సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పూర్ణేష్ మోదీ, కనుభాయ్ దేశాయ్, హార్దిక్ పటేల్‌లు ముందున్న వారిలో ఉన్నారు. ధనేరా, వాఘోడియా స్థానాల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఖంభాలియాలో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వి ఆధిక్యంలో ఉన్నారు. సోమనాథ్, దేడియాపాడ, ధారి, వ్యారా, వరచా రోడ్, గరియాధర్, జామ్‌నగర్ (నార్త్), బోటాడ్, భిలోడా స్థానాల్లో కూడా పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి ఇప్పటివరకు 53.5 శాతం, కాంగ్రెస్‌కు 26.5, ఆప్‌కి 13.3 శాతం ఓట్లు వచ్చాయి. 

Thu, 08 Dec 202204:34 AM IST

హిమాచల్‌లో పై‘చేయి’

హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం ఆధిక్యత కనబరుస్తోంది. తాజా ఫలితాల సరళి ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గాను 65 సీట్లలో ఫలితాలు వెల్లడయ్యాయి. 32 సీట్లలో కాంగ్రెస్, 30 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. మరో 3 సీట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 3 సీట్ల ఫలితాలు తెలియాల్సి ఉంది.

Thu, 08 Dec 202204:15 AM IST

యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ దూకుడు

యూపీలో ములాయం సింగ్ యాదవ్ మరణంతో మైన్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి 71 శాతం ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 27 శాతం ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

Thu, 08 Dec 202204:12 AM IST

హిమాచల్‌లోనూ బీజేపీ ఆధిక్యత

ఇప్పటి వరకు ఉన్న ఫలితాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో 31 స్థానాల్లో బీజేపీ, 23 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. 3 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 11 స్థానాల ఫలితాల సరళి తెలియాల్సి ఉంది.

Thu, 08 Dec 202204:45 AM IST

గుజరాత్‌లో చతికిలపడ్డ కాంగ్రెస్

గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. 2017 ఎన్నికల్లో 78 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. ఈసారి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ వెలువరించిన ఫలితాల ప్రకారం 87 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరచగా, కేవలం 13 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 8 స్థానాల్లో లీడ్‌లో ఉంది. వరుసగా ఏడోసారి గుజరాత్‌లో అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ దూసుకుపోతోంది.

Thu, 08 Dec 202203:51 AM IST

గుజరాత్‌లో బీజేపీదే ఆధిక్యం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ కాంగ్రెస్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై అద్భుతమైన ఆధిక్యం కనబరుస్తోంది. కౌంటింగ్ కేంద్రాల నుండి వస్తున్నసమాచారం ప్రకారం బీజేపీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ ప్రవేశంతో ఏర్పడిన త్రిముఖ పోటీలో కాంగ్రెస్ సుదూరంగా రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. 

Thu, 08 Dec 202203:30 AM IST

గుజరాత్ అధికారిక ఫలితాలు ఇవే

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన ఫలితాల ప్రకారం మొత్తం 6 సీట్లలో బీజేపీ 3, కాంగ్రెస్ 2, ఆమ్ ఆద్మీ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Thu, 08 Dec 202203:08 AM IST

హిమాచల్‌లో నువ్వా నేనా

హిమాచల్ ప్రదేశ్‌లో పోటీ నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్ ఫలితాల సరళిని చూస్తే కాంగ్రెస్ కాస్త మొగ్గు కనబరుస్తున్నా చివరకు ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Thu, 08 Dec 202203:06 AM IST

గుజరాత్‌లో దూసుకుపోతున్న బీజేపీ

ఇప్పటివరకు అందుతున్న ఫలితాల ఆధారంగా చూస్తే గుజరాత్‌లో బీజేపీ దూసుకుపోతోంది. మొత్తం 182 సీట్లకు గాను పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తొలి రౌండ్ సరళిని చూస్తే 100 సీట్లలో బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Thu, 08 Dec 202202:59 AM IST

2002 నాటి రికార్డు బీజేపీ అధిగమిస్తుందా?

గుజరాత్‌లో బీజేపీ 2002లో 182 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 127 స్థానాలను గెలుచుకుంది. ఈసారి ఎగ్జిట్ పోల్ అంచనాలు బీజేపీ గెలుపొందే స్థానాలకు 117 నుండి 151 వరకు ఉన్నాయి. 2002 నాటి తన రికార్డును బీజేపీ అధిగమిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Thu, 08 Dec 202202:57 AM IST

బీజేపీ ఈ రికార్డులు సాధిస్తుందా?

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. అధికార భారతీయ జనతా పార్టీ కొన్ని కొత్త రికార్డులను నెలకొల్పాలని చూస్తోంది. గుజరాత్‌లో విజయం సాధిస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కాకుండా వరుసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్లపాటు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన సీపీఐ(ఎం) వరుసగా ఏడు ఎన్నికల్లోనూ విజయం సాధించింది. మరోవైపు, 1985 తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో ఏ పార్టీ కూడా వరుసగా గెలుపొందలేదు. ఇక్కడ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే, ఇది మరో రికార్డు అవుతుంది.

Thu, 08 Dec 202202:52 AM IST

రాజస్తాన్ ఉప ఎన్నిక స్థానంలో ఓట్ల లెక్కింపు

రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సర్దార్‌షహర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. సోమవారం పోలింగ్ రోజు ఈ నియోజకవర్గంలో 72.09 శాతం ఓటింగ్ నమోదైంది. సుదీర్ఘ అనారోగ్యంతో అక్టోబర్ 9న కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. 

Thu, 08 Dec 202202:50 AM IST

యూపీలో ఉప ఎన్నిక జరిగిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు

గతంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి,  ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

Thu, 08 Dec 202202:38 AM IST

కౌంటింగ్ షురూ…

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 11 గంటల తర్వాత తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.

Thu, 08 Dec 202202:33 AM IST

మొత్తం అసెంబ్లీ స్థానాలు..

 గుజరాత్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 182 ఉండగా… కౌంటింగ్​ కేంద్రాలు 37 ఏర్పాటు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

 

Thu, 08 Dec 202202:30 AM IST

సర్వం సిద్ధం…

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 స్థానాల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Thu, 08 Dec 202202:26 AM IST

ఓట్ల లెక్కింపు… 

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.