తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Motorcycle Day 2022 | లాంగ్ రైడ్ కోసం టాప్ 5 టూరింగ్ మోటార్ సైకిళ్లు ఇవే!

World Motorcycle Day 2022 | లాంగ్ రైడ్ కోసం టాప్ 5 టూరింగ్ మోటార్ సైకిళ్లు ఇవే!

Manda Vikas HT Telugu

21 June 2022, 16:39 IST

    • Motorcycle Day - మోటార్ సైకిల్ పై లాంగ్ రైడ్ వెళ్లాలని ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. మరి అందుకు తగినట్లుగా మోటార్ సైకిల్ కూడా ఉండాలి. మీరు లాంగ్ రైడ్ వెళ్లాలని ప్లాన్ చేస్తే మీ కోసం కొన్ని బెస్ట్ మోటార్ సైకిళ్ల జాబితా ఇక్కడ ఇచ్చాం.
Motorcycles
Motorcycles (Pixabay)

Motorcycles

కారులో షికారు సౌకర్యంగానే ఉంటుంది. అయితే బైక్ మీద రైడ్ మజాగా ఉంటుంది. సిటీ రోడ్లపై చక్కర్లు కొట్టాలన్నా, ఇరుకు గల్లీలలో తిరగాలన్నా మోటార్ సైకిల్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బైక్‌పై లాంగ్ డ్రైవ్ వెళ్తే ఆ ప్రయాణం గురించి ఎంత వర్ణించినా తక్కువే. సుదూర ప్రదేశాలకు మోటార్ సైకిళ్లపై చేసే స్వారీ ఆహ్లాదభరితంగానే కాదూ, సాహసోపేతంగానూ ఉంటుంది.

మన భారతదేశంలో సాహస ప్రియులను ఆకర్షించే ఎంతో అందమైన, నిర్మలమైన ప్రదేశాలు ఉన్నాయి. హిమగిరి శిఖరాల నడుమ, పర్వత మార్గాల్లో వంపులు తిరిగే రహదారులపై మోటార్ సైకిళ్లపై చేసే లద్దాఖ్ యాత్ర ఎంతో మందికి అడ్వెంచర్ ప్రియులకు చిరకాల స్వప్నం, ఇటు దక్షిణాదిన పచ్చని తేయాకు తోటల సౌందర్యాన్ని చూస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ మోటార్ సైకిల్ రైడ్‌కు వెళ్లడం ఎవరికీ నచ్చకుండా ఉంటుంది? ఖరీదైన లగ్జరీ కారు కూడా ఇవ్వని అనుభూతి మోటార్ సైకిల్ ద్వారా మీకు లభిస్తుంది.

ఇప్పుడు మీకు కూడా ఒక బైక్ తీసుకొని లాంగ్ రైడ్‌కు వెళ్లాలనిపిస్తుంది కదూ? అయితే సుదూర మార్గాలకు సుదీర్ఘమైన ప్రయాణం చేసేటపుడు అందుకు తగినట్లుగా మీ మోటార్ సైకిల్ కూడా ఉండాలి. లాంగ్ రైడ్‌లు చేసేందుకు అవసరమైన శక్తిని, సౌకర్యం అలాగే భద్రతా ఫీచర్లలో మేటిగా ఉన్న వివిధ టూరింగ్ మోటార్‌సైకిళ్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి. 

అన్నట్టూ ప్రతీ ఏడాది జూన్ 21న ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం (World Motorcycle Day) గా నిర్వహిస్తున్నారు.

ఇండియాలో టాప్ 5 టూరింగ్ మోటార్ సైకిళ్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్

అడ్వెంచర్లతో కూడిన లాంగ్ రైడ్ ఆలోచన చేసినపుడు మొదటగా మన మదిలో మెదిలేవి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లు. ఇందులోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. ఇండియాలో అత్యంత సరసమైన టూరింగ్ మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో నడుస్తుంది. ఈ మోటార్‌సైకిల్ వెనుకవైపు అనేక మౌంట్‌లతో పాటు లగేజీ క్యారియర్‌తో వస్తుంది. ఈ బైక్‌కు ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక మోనోషాక్ , హాఫ్-డ్యూప్లెక్స్ స్ప్లిట్ క్రెడిల్ ఫ్రేమ్ ఉన్నాయి. ఫీచర్ల పరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్పర్ డిస్‌ప్లే పాడ్‌ను ఉపయోగిస్తుంది. Google మ్యాప్స్‌తో రూపొందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ రియల్ టైమ్ దిశలను అందిస్తుంది.

బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్

బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్ ఒక ఎంట్రీ-లెవల్ క్రూజింగ్ బైక్. ఇది 220cc ఆయిల్-కూల్డ్ DTS-i ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌తో నడుస్తుంది. సుమారు 40 kmpl మైలేజీని అందిస్తుంది. క్రూయిజర్ డిజైన్, తక్కువ-స్లంగ్ సీటును కలిగి ఉన్న బజాజ్ అవెంజర్ 220 క్రూజ్ లాంగ్ రైడ్‌లు చేసేటపుడు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఎత్తు తక్కువ ఉన్న వారు కూడా ఈ మోటార్ సైకిల్ ను సులభంగా నియంత్రించవచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో కూడిన సింగిల్ ఛానల్ ABS సుదీర్ఘ ప్రయాణాలకు మెరుగైన భద్రతను అందిస్తుంది. అలాగే పొడవైన విండ్‌షీల్డ్, ఎత్తు తక్కువ సీటు, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్‌లు కలిగి ఉండటం ఈ మోటార్ సైకిల్ ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు.

KTM 390 అడ్వెంచర్

హైపర్ రైడింగ్ లను ఇష్టపడే వారికోసం KTM 390 పర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంటుంది. KTM 390 మీద సుదీర్ఘ ప్రయాణాలు ఆహ్లాదంగా అనిపిస్తాయి. ఈ అడ్వెంచర్ బైక్‌లో తేలికపాటి ట్రేల్లిస్ ఫ్రేమ్‌తో పాటు లగేజ్ లేదా పిలియన్ రైడర్ కోసం వేరు చేయగలిగే ట్రెల్లిస్ సబ్‌ఫ్రేమ్ కూడా ఉంది. 373cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌తో *ఇది నడుస్తుంది. అలాగే ఈ టూరింగ్ బైక్ ఎలక్ట్రానిక్ ఫీచర్లను పరిశీలిస్తే రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, Quickshifter+ మొదలగునవి ఉన్నాయి.

సుజుకి V-Strom 650 XT

సుజుకి V-Strom 650 XT అనేది మిడ్-వెయిట్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్. ఇందులో శక్తివంతమైన 645cc ఇంజన్ ఉంటుంది. ఇది కూడా హైపర్ రైడింగ్ బైక్ కాబట్టి నునుపైన రహదారులపై రయ్యుమని దూసుకెళ్లవచ్చు. అంతేకాదు సుజుకి V-Strom 650 XT ఒక లీటరుకు 26.46 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ మోటార్ సైకిల్ అందించే పనితీరు, సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సుదూర పర్యటనలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 పోటీగా ఉంటుంది.

కీవే 250cc క్రూజర్

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారు బెనెల్లీకి దీని సిస్టర్ సంస్థ అయిన కీవే భారతీయ మార్కెట్లో ఇటీవల కీవే 50 సిసి క్రూజర్ బైక్ ను విడుదల చేసింది. ఇది కూడా సుదీర్ఘ ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉండే ఒక టూరింగ్ మోటార్ సైకిల్. ఇది డిజైన్ పరంగా ఇతర Harley-Davidson Fat Bobకి దగ్గరగా ఉంటుంది. ఇందులో LED లైట్లు , విడిగా ఎత్తుగా ఉండే సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఇంజిన్ గార్డ్, డ్యూయల్ ఎగ్జాస్ట్, షార్ట్ టెయిల్ సెక్షన్, వెనుక టైర్ హగ్గర్ వంటి ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇది ఒక్కరు మాత్రమే ప్రయాణించటానికి సౌకర్యంగా ఉంటుంది.

టాపిక్