Marbles Game | వేసవి సెలవుల్లో గోళీలాట గుర్తుందా? ఆ ఆటకు ఉన్న చరిత్ర ఎంతో ఘనం!
22 April 2023, 10:05 IST
- Marbles Game: ఇప్పుడంటే పిల్లలు మొబైల్స్, కంప్యూటర్లలో వీడియో గేమ్స్ ఆడుతున్నారు కానీ, ఒకప్పుడు వేసవి సెలవుల్లో పిల్లలు గోళీలాట ఆడేవారు. ఈ ఆటకు ఉన్న చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Marbles Game
Marbles Game: వేసవికాలం వచ్చిందంటే పిల్లలందరికీ వేసవి సెలవులు లభిస్తాయి. ఈ సమయంలో ఇంటి వద్దే గడిపే పిల్లలు వివిధ రకాల ఆటలు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు నడిచేది స్మార్ట్ యుగం కాబట్టి ఎక్కువ మంది పిల్లలు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్ లపైనే అన్ని ఆటలు ఆడేస్తున్నారు. కానీ నిన్నటితరంలో ఆటలు అంటే ఇలా ఉండేవి కావు. మీరు 90వ దశకం, 80వ దశకం పిల్లలు అయితే మీ చిన్నతనంలో ఎన్నో ఆటలు ఆడేవారు. ఆ రోజుల్లో ఆటలు ఎంతో సరదాగా ఉండేవి. వేసవి సెలవులు ఎంతో ఆహ్లాదకరంగా గడిచేవి.
మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది, ఆనాడు పిల్లలు ఎక్కువగా వేసవి సెలవుల్లో గోళీలాట ఆడేవారు. జేబులో కొన్ని గోళీలు తీసుకెళ్లి వాడవాడ తిరుగుతూ ఎక్కడ గోళీలాడే వారు కనిపిస్తే అక్కడికి వెళ్లిపోయి, పోటీలో పాల్గొనేవారు. ఆస్ డీమ్, గుంచికట్, రాజురాణి, కోట్ అంటూ ఈ గోళీలాటలోనే చాలా రకాలుగా ఉండేవి. అన్ని ఆటలు ఆడి, ఎన్నో గోళీలు గెలిచి, సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తే అమ్మానాన్నలతో తిట్లు తిన్న రోజులు మీరు ఎప్పటికీ మరిచిపోరు.
ఇప్పుడు ఈ గోళీలాట గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఈరోజు ప్రపంచ గోళీల దినోత్సవం (World Marble Day). ఏమిటీ.. గోళీలకు కూడా ఒక రోజు ఉందంటే నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే (Good Friday) రోజున వరల్డ్ మార్బుల్స్ డేగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ప్రపంచ మార్బుల్స్ దినోత్సవం ఏప్రిల్ 7న వచ్చింది. 1588లో సరిగ్గా ఇదే రోజున ఇంగ్లండ్‌లో మొదటిసారిగా బ్రిటిష్ మార్బుల్స్ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఆ చారిత్రాత్మక రోజును స్మరించుకుంటూ గోళీల దినోత్సవంను జరుపుకుంటారు.
పురాతన గ్రీకులు, రోమన్లు గోళీలాటను చాలా ఇష్టపడేవారు. మొట్టమొదటిసారిగా పాలరాయితో చేసిన చిన్న బంతులను ఉపయోగించి ఆడటం వలన వీటికి 'మార్బుల్స్' అనే పేరు వచ్చింది. కాలక్రమేణా గాజుతో చేసిన గోళీలు, పింగాణితో చేసిన గోళీలు, స్టీల్ గోళీలు ఇలా చాలా రకాలు వచ్చాయి.
నేడు గోళీలాటను ఎవరూ ఆడటం లేదు కాబట్టి అవి కనుమరుగయిపోయాయి. నిజానికి గోళీలాటను ఒలంపిక్స్ లో చేరిస్తే, ఎంతో మంది మనదేశంలోని అనేక గ్రామాల నుంచి ఎంతోమంది ఛాంపియన్లు బయటకు వచ్చేవారు. ఎన్నో గోల్డ్ మెడల్స్ ఖాతాలో వేసుకునేవారు.
అయితే శతాబ్దాలు గడిచినా, నేటికీ కొన్ని యూరోపియన్ దేశాలలో గోళీలు ఆడేవారు ఉన్నారు. వారు జట్లుగా టోర్నమెంట్లలో పాల్గొనడానికి నేటికీ ఇంగ్లాండ్‌కు వెళతాయని నివేదికలు పేర్కొన్నాయి. ఇదీ గోళీలాట చరిత్ర.
ఈ విషయం పక్కనపెడితే, ఈ వేసవిలో పిల్లలను ఎండలో తిప్పకుండా పేరేంట్స్ జాగ్రత్త వహించాలి. ఇంట్లోనే ఆడుకునే సాంప్రదాయ ఆటలు ఎన్నో ఉన్నాయి. బోర్డ్ గేమ్స్ వంటివి కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకోవచ్చు. స్క్రీన్లను పక్కన పెట్టి సరదాగా పిల్లలతో కాలక్షేపం చేయవచ్చు.