Solar Eclipse: సూర్య గ్రహణానికీ, పిల్లల్లో గ్రహణం మొర్రి రావడానికి మధ్య సంబంధం ఏమిటి? గ్రహణాల వల్ల మొర్రి వస్తుందా?
04 April 2024, 13:25 IST
- Solar Eclipse 2024: మరికొన్ని రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది. గ్రహణం సమయంలో ఎన్నో నమ్మకాలు, అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ముఖ్యంగా గ్రహణాల సమయంలో పుట్టే పిల్లలకు గ్రహణం మొర్రి వచ్చే అవకాశం ఉందని అంటారు.
సూర్య గ్రహణం
Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. ఇది ఏర్పడినప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అన్ని దేశాల్లోని ప్రజలు చూడలేరు. కొన్ని దేశాల్లోని ప్రజలు మాత్రమే చూడగలరు. ఈసారి ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలు చూడలేరు.
సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికో, అమెరికా, కెనడా వంటి దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. మన భారత దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించకపోయినా కూడా గర్భంతో ఉన్న మహిళలను చాలా జాగ్రత్తగా ఉండమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండకపోతే వారికి గ్రహణం మొర్రి ఉన్న పిల్లలు పుడతారని అంటారు. ఈ గ్రహణ సమయంలో తల్లి గర్భంలోని పిండం పై ప్రభావం పడుతుందని చెబుతారు. గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం వల్ల గర్భస్రావం వంటివి కూడా జరగవచ్చని అంటారు. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.
సైన్సు ఏం చెబుతోంది?
పూర్వం నుంచి గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణాన్ని చూడకూడదనే నమ్మకం ఉంది. అది పిండానికి హాని కలిగిస్తుందని అంటారు. అయితే ఈ నమ్మకానికి శాస్త్రీయ ఆధారం లేదు. పిండం తల్లి గర్భంలో ఉంటుంది.. గర్భంలో పరిస్థితులు చక్కగా ఉంటే పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. సూర్యరశ్మికి పిండం నేరుగా ప్రభావితం కాదు, కాబట్టి సూర్య గ్రహణానికి, పిండం ఆరోగ్యానికి సంబంధం లేదు. అలాగే సూర్యగ్రహణ సమయంలో జన్మించిన పిల్లలకు లేదా గ్రహణం సమయంలో తల్లి కొన్ని పనులు చేయడం వల్ల పిల్లల్లో గ్రహణం మొర్రి వచ్చే అవకాశం ఉందని అంటారు. ఇది నిజమని సైన్సు నిర్ధారించలేదు.
గ్రహణం మొర్రి వంటివి పుట్టుకతో వచ్చే లోపం. వీటికి జన్యుపరమైన కారకాలు, తల్లి ఆరోగ్య సమస్యలు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండకపోతే గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని అంటారు. దీనికి కూడా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. గ్రహణం సమయంలోనే కాదు గ్రహణం లేని సమయంలో కూడా తల్లి జాగ్రత్తగా ఉండకపోతే లేదా జన్యుపరమైన కారణాలు ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.
సైన్సు చెబుతున్న ప్రకారం సూర్యగ్రహణాలు గర్భిణీ స్త్రీలకు, వారి గర్భంలో ఉన్న బిడ్డలకు ఎలాంటి ప్రత్యక్ష హానిని కలిగించవు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటే సరిపోతుంది. గ్రహణాన్ని చూడాలనుకుంటే కంటికి తగిన రక్షణ ఇచ్చే గ్లాసెస్ పెట్టుకొని చూడడం మంచిది. గర్భిణుల్లో గ్రహణానికి సంబంధించి భయాలు, ఆందోళనలు ఉంటే అవి ఒత్తిడిని పెంచుతాయి. భావోద్వేగాలను పెంచుతాయి. కాబట్టి ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. గ్రహణం సమయంలో మీకు లేదా మీ శిశువులకు ఎలాంటి హాని జరుగుతుందని సైన్స్ చెప్పడం లేదు. ఒత్తిడి, ఉద్వేగాన్ని తగ్గించుకోవడానికి లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయండి.
గర్భిణులు ఏం చేయాలి?
సూర్యగ్రహణ సమయంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎక్కువ నీటిని తాగుతూ ఉండడం మంచిది. అలాగే కాఫీ, టీలకు దూరంగా ఉంటే డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే తగిన విశ్రాంతిని తీసుకోండి. గర్భధారణ సమయంలో భయాలు పెట్టుకుంటే అలసటగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా, మీకు నచ్చిన భంగిమలో నిద్రపోండి. గ్రహణం గురించి ఇంకేమైనా భయాలు ఉంటే మీ వైద్యులను సంప్రదించి ధైర్యం తెచ్చుకోండి. వైద్యులు కూడా గ్రహణానికి, మొర్రికి ఎలాంటి సంబంధం లేదనే చెబుతారు.
టాపిక్