Masan Holi : రంగులతో కాదు.. చితాభస్మంతో హోలీ.. అక్కడ అదే స్పెషల్
25 February 2024, 18:40 IST
- Masan Holi : సాధారణంగా హోలీ అంటే రంగులతో జరుపుకొంటారు. కానీ చితాభస్మంతో జరుపుకొంటారనే విషయం తెలుసా? వారణాసిలో ఓ ప్రాంతంలో అలానే జరుపుకొంటారు.
మసాన్ హోలీ
రంగులతో హోలీ ఆడుకోవడం అందరికీ తెలుసు.. కానీ శవాలను కాల్చగా వచ్చిన బూడిదతో హోలీ ఆడుకోవడం గురించి మీరు విన్నారా? అక్కడ ఇదే ప్రత్యేకమైన పండుగ.. దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది.. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంతకీ ఆ ప్రాంత ఏంటి..? ఎందుకు ఇలా చేస్తారో తెలుసుకుందాం..
సనాతన ధర్మంలో హోలీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా హోలీని గొప్ప ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకొంటారు. ఈ రంగుల పండుగను వివిధ రాష్ట్రాలలో విభిన్న రీతుల్లో నిర్వహిస్తారు. అయితే ఆధ్యాత్మిక నగరమైన కాశీలో చితాభస్మంతో హోలీ ఆడతారని తెలుసా? దీన్ని మసాన్ హోలీ అంటారు. మన దగ్గర రంగులతో హోలీ ఆడతారు. కానీ అక్కడ మనుషుల శవాలను కాల్చగా వచ్చిన భస్మంతో హోలీ ఆడతారు. దీనికి కారణాలు, ఆ పండుగ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
కాశీలోని రంగభారీ ఏకాదశి రెండో రోజున మసాన్‌కి హోలీ అనగా శ్మశాన హోలీని శ్మశానవాటిక అయిన మణికర్ణికా ఘాట్‌లో ఆడతారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మతపరమైన నగరం. ఇక్కడ మసాన్ హోలీని మహా శ్మశాన హోలీ అని కుడా అంటారు. మణికర్ణిక ఘాట్ వద్ద ఈ హోలీని ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ శివభక్తుల చితాభస్మంతో హోలీ ఆడతారు. చితాభస్మంతో మసాన్ హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు.
మసాన్ హోలీ యొక్క మతపరమైన నమ్మకాలు
మత విశ్వాసాల ప్రకారం, రంగభారీ ఏకాదశి రెండో రోజున శివుడు మణికర్ణికా ఘాట్ వద్ద భక్తులందరినీ సందర్శించి భస్మ హోలీ ఆడుతాడని ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే పరమశివుడు భస్మాన్ని చాలా ఇష్టపడతాడు. నమ్మినవారిలో భస్మంతో మాత్రమే తనను తాను అలంకరించుకుంటాడని విశ్వాసం.
ప్రజల నమ్మకం ప్రకారం, రంగభారీ ఏకాదశి రోజున శివుడు, పార్వతితో వివాహం తరువాత తన నివాసానికి ఎంతో గౌరవంగా తీసుకువచ్చాడు. తరువాత శివుడు ఇతర దేవతలతో హోలీని వేడుకగా ఆడాడు. అయితే ఈ హోలీలో శివుడిని అతిగా ఇష్టపడే రాక్షసులు, పిశాచాలు చేరలేరని చెబుతారు. అందుకే శివుడు స్వయంగా హోలీ ఆడేందుకు మాసాన్ ఘాట్‌కి వచ్చి అందరితో కలిసి భస్మ హోలీ ఆడాడని ఓ కథనం . ఇలా మసాన్ హోలీ ఆడేందుకు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ శివ భక్తులు ఎక్కువగా మసాన్ హోలీలో పాల్గొంటారు.
చారిత్రక విశ్వాసాల ప్రకారం, 16వ శతాబ్దంలో జైపూర్ రాజు మాన్ సింగ్ గంగా నది ఒడ్డున ఉన్న మణికర్ణికా ఘాట్ వద్ద మసాన్ మందిరాన్ని నిర్మించాడని చెబుతారు. ఇది మత గ్రంథాలలో కూడా ప్రస్తావించారు. ప్రతిరోజూ 100 మందిని ఇక్కడ దహనం చేస్తారు. మసాన్ హోలీలో హోలీ ఆడేందుకు ఇక్కడ ప్రత్యేకంగా 4000 నుండి 5000 కిలోల కలపను కాల్చుతారట. ఈ ఏడాది ఇలాంటి హోలీ పండుగను చూడాలంటే.. మీరు కూడా వారణాసి వెళ్లండి. వారణాసి వెళ్లాలని ప్రతి హిందువు అనుకుంటాడు. అక్కడకు వెళ్తే మన ఆత్మ ప్రక్షాలన అవుతుందని నమ్మకం.