తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Infertility: భారతీయ జంటల్లో పెరిగిపోతున్న సంతానలేమి సమస్య, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Infertility: భారతీయ జంటల్లో పెరిగిపోతున్న సంతానలేమి సమస్య, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Haritha Chappa HT Telugu

06 April 2024, 7:00 IST

google News
    • Infertility: భారతీయ జంటల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు. భారతదేశంలో కోట్ల మంది దంపతులు అనేక కారణాల వల్ల పిల్లలు కనలేకపోతున్నారు.
భారతీయ జంటల్లో సంతానలేమి
భారతీయ జంటల్లో సంతానలేమి (Pexels)

భారతీయ జంటల్లో సంతానలేమి

Infertility: పెళ్లయిన ప్రతి జంట త్వరగా తల్లిదండ్రులు అయ్యేందుకు ఇష్టపడతారు. అయితే భారతదేశంలో తొలిసారిగా అనేక జంటలు పిల్లలు కలగక ఇబ్బంది పడుతున్నారు. ది లాన్సెట్ చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు చాలా తగ్గిపోయినట్టు బయటపడింది. అలాగే ఒక మహిళ ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లల్ని కంటున్నట్టు తేలింది. మన దేశంలో దాదాపు 28 మిలియన్ల జంటలు పిల్లలు లేక బాధ పడుతున్నారని ఈ అధ్యయనంలో బయటపడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి ఆరు జంటలలో ఒక జంట పిల్లలు కలగక ఎంతో బాధను అనుభవిస్తున్నారు.

పిల్లలు కలగక పోవడానికి జీవనశైలి పద్ధతులతో పాటు జీవసంబంధ కారకాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే జన్యుపరమైన కారణాలవల్ల, పర్యావరణ కారణాలవల్ల కూడా పిల్లలు కలగకపోవడం అనేది జరుగుతుందని వివరిస్తున్నారు వైద్యులు.

స్త్రీ పురుషుల్లో సమస్యలు

కేవలం మహిళల్లోనే కాదు పురుషుల్లో ఎన్నో సమస్యల వల్ల వారికి పిల్లలు కలగడం లేదని చెబుతున్నారు వైద్యులు. పురుషుల్లో స్పెర్మ్ కౌంటు తక్కువగా ఉండడం, వీర్య కణాలు కదిలే వేగం తక్కువగా ఉండడం, స్పెర్మ్ ఆకారం అసాధారణంగా ఉండడం వంటివి సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. ఇక మహిళల్లో హార్మోన్లు అసమతుల్యత ఉండడం, అండోత్సర్గం సరిగా జరగకపోవడం, గర్భాశయం లేదా ఫెలోపియన్ ట్యూబులలో అసాధారణలు ఉండడం, వయస్సు ఎక్కువగా ఉండడం వంటివి కూడా ప్రధాన కారకాలుగా ఉన్నాయి. మహిళ అండాలు నాణ్యతగా ఉంటేనే పిల్లలు కలుగుతారు. ఎప్పుడైతే వాటి నాణ్యత తగ్గుతుందో... పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది.

జీవన శైలి వల్ల

ఆధునిక జీవనశైలిలో ఆహారం ఎంతో మారిపోయింది. దీని వల్ల పురుషులు, మహిళల ఆరోగ్యం ఎంతగానో ప్రభావితం అవుతుంది. మహిళల్లో అండోత్సర్గంలో సమస్యలు వస్తున్నాయి. అండోత్సర్గంలో అండం విడుదలవ్వక పోవడం, పీరియడ్స్ రాకపోవడం, పీరియడ్స్ చాలా తక్కువ సమయం పాటు కావడం వంటివి కూడా కారణంగా మారుతున్నాయి. థైరాయిడ్ గ్రంధి సమస్యలు, అడ్రినల్ సమస్యలు, పిట్యూటరీ వ్యాధి వంటివి మహిళల్లో అండోత్సర్గం సరిగా కాకుండా అడ్డుకుంటాయి. అండోత్సర్గము సరిగా కాకపోతే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. అండోత్సర్గంలో అండం విడుదలయితేనే వీర్య కణంతో కలిసే అవకాశం ఉంటుంది. అదే అండం విడుదల కాకపోతే పిల్లలు పుట్టే అవకాశం సున్నా.

మహిళల్లో ఫైబ్రాయిడ్లు సమస్యలు, అండాశయంలో తిత్తులు పెరగడం, ఎండోమెట్రియోసిస్ వంటి పరిస్థితుల వల్ల గర్భం ధరించలేకపోతున్నారు. ఇక పురుషుల్లో హైపోథాలమస్, పిట్యూటరీ వ్యాధులు కూడా పిల్లలు కలగకుండా అడ్డుకుంటున్నాయి.

ఎవరైతే అధిక ధూమపానం, మద్యపానం చేసేవారు, ఎక్కువ కాలం పాటు కూర్చుని ఉండే ఉద్యోగాలు చేసేవారు, వ్యాయామం చేయనివారు, వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో సంతానలేని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. నలభై ఏళ్లు దాటిన తర్వాత పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత చాలా వరకు తగ్గుతుంది. ఇది కూడా సంతానోత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఉన్న పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు.

అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపు 6.2గా ఉండేది. 2021లో ఆ రేటు రెండు కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. ఇలాగే కొనసాగితే 2050 కల్లా 1.29కి, 2100 సంవత్సరానికల్లా 1.04కి పడిపోయే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆధునిక జీవనశైలిని మార్చుకోకపోతే మహిళలు, పురుషుల్లో సంతానాన్ని కనే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని చెబుతున్నారు వైద్యులు.

తదుపరి వ్యాసం