Sperm Count: మగవారు జాగ్రత్త, మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ-sperm count men beware the lower your sperm count the higher your risk of cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sperm Count: మగవారు జాగ్రత్త, మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ

Sperm Count: మగవారు జాగ్రత్త, మీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ

Haritha Chappa HT Telugu

Sperm Count: మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం అనేది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు. స్పెర్మ్ కౌంట్‌కు, క్యాన్సర్ కు ప్రత్యేక సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు.

మగవారికి వచ్చే క్యాన్సర్ (pixabay)

Sperm Count: క్యాన్సర్ చాప కింద నీరులా పాకిపోతోంది. ఇప్పుడు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది. తాజాగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా కలిగి ఉన్న పురుషులు క్యాన్సర్ బారిన త్వరగా పడతారని తాజా అధ్యయనం తేల్చింది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. జన్యుపరంగా కొందరికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఎముక లేదా కీళ్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 156 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. అలాగే లింఫ్ నోడ్స్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం 50 శాతానికి పైగా ఉంటుంది.

పురుషుల్లో ఒక మిల్లీలీటర్ వీర్యంలో 1.5 మిలియన్ కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉంటే వారికి ఎముక, కీళ్లు క్యాన్సర్ వచ్చే అవకాశం 143 శాతం అధికంగా ఉంటుంది. అలాగే టెస్టికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 134 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

మగవారిలో స్పెర్మ్ కౌంట్ సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో కనీసం 15 మిలియన్ వీర్యకణాలు ఉండాలి. అప్పుడే అతడు ఆరోగ్యకరంగా ఉన్నట్టు అర్థం. స్పెర్మ్ కౌంటు ఎప్పుడైతే తగ్గిపోతుందో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే వీర్య కణాల నాణ్యత, చలన శీలత కూడా తగ్గిపోతాయి. దీనివల్ల వారికి సంతానోత్పత్తి జరగడం కష్టంగా మారుతుంది. కొందరిలో అది క్యాన్సర్ కూడా దారితీస్తుంది.

సాధారణంగా పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్... అధికంగా వస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ధూమపానం, మద్యపానం, సరైన ఆహారం తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా క్యాన్సర్ కు కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నవారు, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు ఎప్పటికప్పుడు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి మగవారు కొన్ని పనులు చేయాలి. తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తింటూ ఉండాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వదిలేయాలి. బీన్స్, బార్లీ వంటి ఆహారాలను తింటూ ఉండాలి. జింక్ నిండిన ఆహారాలను తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. గుమ్మడి గింజలు, క్యారెట్, దానిమ్మ పండ్లు, అరటి పండ్లు తరచూ తింటూ ఉండాలి. రోజువారీ ఆహారంలో టొమాటోలను ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి.

క్యాన్సర్ తో మరణిస్తున్న వారి సంఖ్యలో మనదేశంలో అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా ఏటా క్యాన్సర్ల వల్లే మరణిస్తున్నారు. ఇక మనదేశంలో ఏటా 11 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన దేశంలో ఉన్న జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి క్యాన్సర్ బాగా ముదిరాకే బయటపడుతోంది. దీని వల్లే మరణాలు సంభవిస్తున్నాయి.

వయసు కారణంగా వచ్చే క్యాన్సర్లు, జన్యుపరంగా వచ్చిన క్యాన్సర్, రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయక వచ్చిన క్యాన్సర్లు తగ్గే అవకాశం తక్కువ. అదే చెడు ఆహారపు అలవాట్లు, ఊబకాయం, మద్యపానం, ధూమపానం వంటి వాటి వల్ల వచ్చిన వాటిని సరైన సమయంలో గుర్తిస్తే బతికే ఛాన్సులు అధికంగా ఉంటాయి.