తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day 2023 । మీ ప్రియమైన వ్యక్తికి మీ ప్రేమ కానుకగా ఏం ఇవ్వాలనుకుంటున్నారు? గిఫ్ట్ ఐడియాలు ఇవిగో!

Valentines Day 2023 । మీ ప్రియమైన వ్యక్తికి మీ ప్రేమ కానుకగా ఏం ఇవ్వాలనుకుంటున్నారు? గిఫ్ట్ ఐడియాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

13 February 2023, 10:51 IST

    • Valentines Day 2023 Gift Ideas: ఈ ప్రేమికుల రోజున మీ ప్రియాతి ప్రియమైన వ్యక్తికి ఏం బహుమతి అందజేయాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి, ఇవి మీకు ఉపయోగపడతాయేమో చూడండి.
Valentines Day 2023 Gift Ideas
Valentines Day 2023 Gift Ideas (Unsplash)

Valentines Day 2023 Gift Ideas

ప్రేమికుల రోజు వేడుకకు వేళయింది, ప్రేమికులు అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. వారం క్రితం రోజ్ డేతో మొదలైన వాలెంటైన్ వీక్ కిస్ డేతో తుదికి చేరుకుంది. చివరగా వాలెంటైన్స్ డే ఒక్కటే మిగిలి ఉంది. వాస్తవానికి ప్రేమించటానికి రోజులు చాలవు, యుగాలు చాలవు. నిజమైన ప్రేమకు ఇలా ప్రేమికుల రోజు అంటూ ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. అయినా మీరు ప్రేమించే వ్యక్తి కళ్లలో ఆనందం చూడటానికి, మన ప్రేమకు గుర్తుగా ఒక వేడుక చేసుకోవటానికి ఇది ఒక సందర్భం.

ప్రేమికుల రోజున మీ ప్రియాతి ప్రియమైన వ్యక్తికి ఏదైనా బహుమతి అందిస్తే, అది మీ ప్రేమకు గుర్తుగా, చిరకాల జ్ఞాపకంగా నిలిచి ఉంటుంది. కానీ ఎలాంటి బహుమతి ఇవ్వాలి? వారు ఒక చిన్న పువ్వును కోరుకుంటే మీ హృదయాన్నే పువ్వుగా మార్చి కానుకగా ఇచ్చేంత గొప్ప ప్రేమ మీది కావచ్చు. నిజానికి స్వచ్ఛమైన మీ ప్రేమ కంటే మీరు అందించే విలువైన బహుమతి ఏదీ లేదు. అయితే ఇక్కడ మీరు వారి ముఖంలో చిన్న చిరునవ్వు చూడటానికి, వారి కళ్లల్లో ఆనందాన్ని చూడటానికి మీరు చేసే చిన్ని ప్రయత్నమే ఈ బహుమతి ఇవ్వడం.

ఈ కానుక మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది, వారిని ఇలాగే సంతోషంగా ఉంచుతారనే నమ్మకాన్ని కలిగిస్తుంది. అది ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ కావచ్చు లేదా ఒక మంచి డ్రెస్ కావొచ్చు, బ్రాండెడ్ యాక్సెసరీ కావొచ్చు లేదా పువ్వులు, చాక్లెట్లు ఏవైనా కావొచ్చు.

Valentines Day 2023 Gift Ideas- ప్రేమికుల రోజు బహుమతులు

మీ ప్రియమైన వ్యక్తికి ఎలాంటి బహుమతి ఇవ్వాలా? అని ఆలోచిస్తుంటే ఇక్కడ కొన్ని ఐడియాలు ఉన్నాయి, వీటిని పరిశీలించండి.

గ్రీటింగ్ కార్డ్

నేటికాలంలో గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మీ ప్రియమైన వ్యక్తికి ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ కొనుగోలు చేసి ఇవ్వడం కచ్చితంగా వారికి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ గ్రీటింగ్ కార్డుతో పాటుగా మీలోని భావాలను వ్యక్తం చేస్తూ మీరు ప్రేమతో రాసే ఒక మంచి ప్రేమలేఖ లేదంటే ఒక ప్రేమ కవిత వంటివి ఇస్తే తప్పకుండా వారి ముఖంలో చిరునవ్వుని చూస్తారు.

గిఫ్ట్ కార్డ్

గిఫ్ట్ కార్డు అనేది ఒక గిఫ్ట్ వోచర్. ఇది ప్రీపెయిడ్ స్టోర్డ్ వాల్యూ మనీ కార్డ్, సాధారణంగా రిటైలర్ లేదా బ్యాంకు ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ కార్డులు ఇప్పుడు అనేక గిఫ్ట్ షాపులు, ఆన్‌లైన్‌లో కూడా లభిస్తున్నాయి. మీరు ఎంచుకున్న ధరలో గిఫ్ట్ కార్డ్ లభ్యం అవుతుంది. ఇది బహుమతిగా ఇవ్వడం ద్వారా ఇది వారికి నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ గిఫ్ట్ కార్డ్ ద్వారా సినిమా టికెట్స్, అడ్వ్ంచర్స్, టూర్ టికెట్స్, హోటెల్ డైనింగ్, గాడ్జెట్స్ ఇలా కొన్ని ఎంపిక చేసిన వాటిని కొనుగోలు చేసేందుకు వారికి ఈ కార్డ్ ఉపయోగపడుతుంది.

90వ దశకం ప్రేమ

మీరు 90లకు చెందిన వారైతే మీకు మీ స్కూల్ లైఫ్ ప్రేమకథలు మళ్లీ ఉంటే బాగుండు అనిపిస్తే, దీనినే బహుమతిగా ఇవ్వవచ్చు. ఎలా అంటారా? ఏదైనా పాత మ్యూజిక్ సెంటర్ నుంచి ఒక టేప్ రికార్డర్, అలాగే అందులో ప్లే చేసేందుకు క్యాసెట్ కొనుగోలు చేయండి. అందులో మీకు నచ్చిన పాటలను, లేటెస్ట్ సాంగ్స్ కూడా లోడ్ చేసి గిఫ్ట్ గా ఇవ్వండి. ఈ గిఫ్ట్ కచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

కస్టమైజ్డ్ గిఫ్ట్

మీరు మీ ప్రియమైన వ్యక్తికి మీ ఇద్దరి పేర్లు కలిపి లేదా వారి పేరుతోనే కీ చైన్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. అలాగే ఇద్దరికీ ఒకే రకమైన టీ షర్ట్స్ ఇవ్వవచ్చు. ఇంకా మీరే స్వయంగా ఎంపిక చేసిన డిజైన్ ను ఆభరణంగా తయారు చేయించి వారికి బహుమతిగా అందజేయవచ్చు. ఇది వారికి ఎల్లప్పుడూ మీ గుర్తుగా ఉంటుంది.

ఒక మొక్క

మీరు బహుమతిగా ఇచ్చే ఒక చిన్న మొక్క కూడా మీ ప్రేమను ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సమీపంలోని నర్సరీకి వెళ్లి ఇంట్లో పెంచుకోగల మొక్కలను తీసుకోండి. మీ ప్రేమ కానుకగా ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి దానిని పెరగనివ్వండి.