Valentine's Getaways । ప్రేమకు చిహ్నాలు ఈ ప్రదేశాలు.. మీ విహారయాత్రకు ఇవే గొప్ప గమ్యస్థానాలు !
07 February 2023, 11:12 IST
- Valentine's Getaways: ప్రేమికుల రోజును మరింత ప్రత్యేకంగా మార్చడానికి మీరు మీ ప్రియమైన వ్యక్తితో విహారయాత్ర చేసేందుకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలికే కొన్ని గమ్యస్థానాలను ఇక్కడ తెలియజేస్తున్నాం చూడండి.
Valentine's Getaways
వాలెంటైన్స్ వీక్ మొదలైంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఫిబ్రవరి 7న మొదలయ్యే రోజ్ డేతో వేడుకలు ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రేమికులు అంటే కేవలం పెళ్లికాని యువతీయువకులు మాత్రమే కాదు, పెళ్లైన భార్యాభర్తలు కూడా ఒకరిపై ఒకరు తాము చూపించుకునే ప్రేమను సెలెబ్రేట్ చేసుకోవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీరు అనుభవించే కొన్ని అపురూప క్షణాలు కూడా మీ జీవితంలో మీకు ఎప్పటికీ నిలిచిపోయే తీపి గుర్తులుగా నిలిచి ఉంటాయి. మరి మీ ప్రేమను వేడుక చేసుకునేందుకు మీరు సిద్ధమేనా?
ఈ ప్రేమికుల వారంలో ప్రేమ జంటలు కలిసి విహరించడానికి భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడేవారైతే సుందరమైన దృశ్యాలతో కూడిన రోడ్ వేలు ఉన్నాయి.
Valentine's Day Week Getaways- ప్రేమికుల విహారయాత్రకు ఉల్లాసభరితమైన ప్రదేశాలు
మీ ప్రేమికుల రోజును మరింత ప్రత్యేకంగా మార్చడానికి మీరు మీ ప్రియమైన వ్యక్తితో విహారయాత్ర చేసేందుకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలికే కొన్ని గమ్యస్థానాలను ఇక్కడ తెలియజేస్తున్నాం చూడండి.
ఆగ్రా
ప్రేమకు ప్రతీక అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్ మహల్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ మన దేశంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఉంది. షాజహాన్- ముంతాజ్‌ల ప్రేమకథను తెలియజేసే ఈ అపురూప కట్టడం వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా మీరు మీ ప్రియమైన వ్యక్తితో కలిసి ఆగ్రా సందర్శించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
శ్రీనగర్
శ్రీనగర్ పేరు చెప్పగానే చుట్టూరా మంచుతో కప్పబడిన కొండలు, ప్రశాంతమైన నదులతో ఒక అద్భుత దృశ్యం కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. 'పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ మ్యాజిక్ మీరు అనుభూతి చెందాలనుకుంటే జమ్మూ-కశ్మీర్ లోని శ్రీనగర్ వెళ్లాల్సిందే.
అలెప్పి
ఏ మాయ చేశావే.. అంటూ మీరు మీ ప్రేయసి ప్రేమ మాయలో మునిగితేలాలంటే కేరళలోని అలెప్పి గొప్ప ప్రదేశం. అలెప్పిలోని బ్యాక్ వాటర్స్‌లో హౌస్‌బోట్‌ను అద్దెకు తీసుకుని, మీ భాగస్వామితో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో మేల్కొలపండి. ఈ ప్రదేశం మీకు నిజమైన వాలెంటైన్స్ డే వైబ్స్ అందించడంలో ఏమాత్రం నిరాశపరచదు.
ఊటీ
మీ ఇద్దరి మధ్య ఉన్న కొండంత ప్రేమను మనసారా చూపించుకోడానికి హిల్ స్టేషన్ ఊటీ వెళ్లవచ్చు. ఇది భారతదేశంలోని ప్రఖ్యాత హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటి. ఊటీలో మీరు మీ ప్రేమ భాగస్వామితో చెట్టాపట్టాలేసుకొని ఛల్ చయ్య చయ్యా అంటూ సాగిపోవచ్చు. ఇక్కడి చల్లని వాతావరణ, టీ తోటలు, ఆతిథ్యం మిమ్మల్ని మరో ప్రపంచంలో విహరింపజేస్తాయి.
తార్కర్లీ
ఉప్పెనంత మీ ప్రేమకు సముద్రమే సాక్ష్యం. ప్రేమ జంటలకు సముద్ర తీరం ఎంతో రొమాంటిక్ స్పాట్. భారతదేశంలో అద్భుతమైన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. మీరు గోవా, పాండిచ్చేరి, అండమాన్, లక్షద్వీప్ వంటి బీచ్‌లు ఇదివరకే చూసినట్లయితే అరేబియా సముద్ర తీరంలో ఉన్న తార్కర్లీ బీచ్ వెళ్లండి. ఎక్కువ జనసందడి లేని ప్రశాంతమైన బీచ్ వాతావరణాన్ని, మృదువైన ఇసుక తిన్నెలను, నీలిరంగులోని జలాలను, అలల నడుమ ఆటలను అన్నింటినీ ఆస్వాదించవచ్చు.