తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావ్.. మండుటెండను పండు వెన్నెల్లా మార్చేస్తావ్

Tuesday Motivation : చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావ్.. మండుటెండను పండు వెన్నెల్లా మార్చేస్తావ్

Anand Sai HT Telugu

13 February 2024, 5:00 IST

google News
    • Tuesday Motivation : కొందరికి ప్రేమించినవారు పక్కన ఉంటే ప్రపంచమే తెలియదు. ఎందుకంటే వారి ప్రపంచమంతా ప్రేమించినవారే అయిపోతారు
మంగళవారం మోటివేషన్
మంగళవారం మోటివేషన్ (Unsplash)

మంగళవారం మోటివేషన్

ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే ఈ ప్రపంచాన్నే జయించొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రేమలో పడిన మెుదట్లో ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది. ప్రేమించిన వ్యక్తి అడిగితే జాబిల్లిని కూడా తెచ్చి ఇవ్వాలనేంత ఆలోచన ఉంటుంది. ప్రేమకు ఉన్న శక్తి అలాంటిది. అందుకే కవులు కూడా ప్రేమ గురించి చెప్పి.. చెప్పి అలసిపోయారే తప్ప.. చెప్పడం మాత్రం ఎప్పుడూ ఆపేయలేదు.

ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రేమలో ఉన్న ప్రతీ ఉదయం ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అలాంటి ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి. మీకు నచ్చిన వ్యక్తిని బాగా చూసుకోవాలి. చాలా మందికి ప్రేమలో మెుదటి కొన్ని రోజులు చాలా కొత్తగా ఉంటుంది. రానురాను ఆసక్తి తగ్గిపోతుంది. బంధం విడిపోయేందుకు అసలు కారణం ఇదే. ఒక్కసారి మీరు విలువ ఇవ్వడం తగ్గుతుందని అవతలివారికి అనిపిస్తే.. ఇక విడిపోయేందుకు దగ్గరవుతున్నారని అర్థం.

అందుకే ఏ బంధమైనా బలంగా ఉండాలంటే కొత్తదనం క్రియేట్ చేసుకోవాలి. ప్రేమించిన వ్యక్తి కోసం రోజుల కాస్త సమయంలో కేటాయించి.. వారిని సంతోషపెట్టాలి. అప్పుడే జీవితాంతం ఆనందంగా ఉంటారు. మీకు అలవాటు లేకపోయినా వారి కోసం పాటలు పాడండి.. మీకు రాకపోయినా ప్రేమించిన వారి కోసం కవితలు రాయండి. ఇవన్నీ కాసేపు వారిని నవ్వించినా తర్వాత ఆలోచనల్లో పడతారు. ఎందుకంటే ఇవన్నీ జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు. ఎన్ని జ్ఞాపకాలు పోగేసుకుంటే జీవితానికి అంత మంచిది. మీరు ప్రేమించిన వారి కోసం కొన్ని రకాల కవితలు రాసి వారికి పంపండి. మీ కోసం కింద కొన్ని ఉన్నాయి.

చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావ్..

మండుటెండనైనా పండు వెన్నెల్లాగా మార్చేస్తావ్..

కనుమూయగానే కలల అలవై ముంచెస్తావ్..

ఆరాటపడే ఈ నా మనసుపై అమృత చినుకులను చిలకరిస్తావ్..

నాపై ప్రసరించిన నీ తొలిచూపులు కిరణాలు..

నా హృదయంలో మీటాయి ప్రేమ వీణలు..

నాపై విసిరిన నీ చిరునవ్వుల బాణాలు..

నన్ను నాకే కొత్తగా చూపించాయి ఆశలు..

తాకి తాకనట్టుగా తగిలిన నీ చేతి స్పర్శ..

నన్ను నేనే మరిచిపోయేలా చేసిందట..

అందుకే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలు..

జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ఆస్తులే అవసరం లేదు. మనమే ఆస్తిగా భావించి జీవితాంతం ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలు..

గుర్తు పెట్టుకో నా ఇష్టాలు, నా కష్టాలు, నా సంతోషాలు, నా చిరునవ్వులు.. అన్నీ నీతోనే అంతమవుతాయి.. ఎందుకంటే నేను నీపై పెంచుకున్నది ప్రేమ కాదు.. ప్రాణం..

నువ్వు నాకోసం పుట్టకపోవచ్చు.. కానీ నా ప్రేమ మాత్రం నీకోసమే పుట్టింది. నీ జీవితంలో నేను లేకపోవచ్చు కానీ.. నా మనసులో నువ్ మాత్రం ఎప్పటికీ ఉంటావ్.

నువ్ పక్కన ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు.. ఎందుకంటే నువ్వే నా ప్రపంచమైపోతావ్. నువ్ దూరంగా ఉంటే ప్రపంచంతో నాకు సంబందం ఉండదు.. ఎందుకంటే నువ్ కనిపించని ప్రపంచంలో నాకేదీ నచ్చదు కాబట్టి.

ప్రతి ప్రేమ కథ అద్భుతమైనది.. కానీ మన ప్రేమ కథ అంతకుమించినది..

తదుపరి వ్యాసం