Hump back: ముందుకు వంగి నడవడం, కూర్చునే సమస్య ఉందా? ఈ ఆసనాలు వెన్నెముకను నిటారుగా చేస్తాయి
13 October 2024, 5:00 IST
- Hump back: ల్యాప్ టాప్ పై పనిచేసేటప్పుడు సరైన పొజిషన్ లో కూర్చోకపోతే వీపు కింది భాగంలో నొప్పి, వీపులో వంపు వంటివి వస్తాయి. ఈ సమస్య రాకుండా, వచ్చిన సమస్య తగ్గేలా కొన్ని ఆసనాలు ప్రయత్నిస్తే మేలు.
వంగి కూర్చోవడం, నడవడం తగ్గించే వ్యాయామాలు
చాలా మంది రోజంతా నిటారుగా కాకుండా వంగిపోయి ల్యాప్ టాప్ ముందు కూర్చుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శరీర భంగిమ దెబ్బతింటుంది. ఇదే అలవాటుగా మారిపోతుంది. కాస్త వంగి నడవడం, కూర్చున్నప్పుడు భుజాలు వంపేయడం చేస్తారు. కాబట్టి ఈ సమస్య ఇది వరకే ఉన్నా, ఇక మీదట రాకుండా ఉండాలన్నీ కొన్ని వ్యాయామాలు చేయండి.
బాలాసనం:
ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల వీపు నిటారుగా ఉంటుంది. ఇది చేయడానికి వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు మీ నుదిటిని నేలపై ఉంచి, మీ చేతులను ముందు వైపు సాగేలా చూడండి. మీ వెన్నెముక, భుజాలపై సాగదీసిన అనుభూతిని అనుభవించండి. ఈ స్థితిలో కనీసం 1 నిమిషం ఉండండి. లోతైన శ్వాస తీసుకునేటప్పుడు సాగదీతను అనుభవించండి.
శల్భాసనం
ఈ ఆసనం చేయడానికి నేలపై బోర్లా పడుకోవాలి. దీనితో అరచేతులను తొడల కింద ఉంచి తల, మెడ నిటారుగా ఉంచాలి. దీర్ఘంగా లోతైన శ్వాస తీసుకునేటప్పుడు రెండు కాళ్ళను కలిపి పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఈ భంగిమలో కాసేపు ఉండి ఆ తర్వాత కాళ్లను కిందకు దించాలి. ఊపిరి పీల్చుకుని మునుపటి స్థితికి తిరిగి రావాలి.
క్యాట్ కౌ పోజ్
శరీర భంగిమ మెరుగుపరచడానికి, వంగిన వీపును నిటారుగా చేయడానికి పిల్లి-ఆవు భంగిమ లేదా క్యాట్ కౌ పోజ్ ప్రయత్నించాలి. దీనికోసం మీ అరచేతులను నేల మీద ఆనించాలి. రెండు కాళ్లను వజ్రాసనంలో కూర్చున్నట్లు వెనక్కి ఉంచాలి. ఇప్పుడు చేతుల మీద బలం పెట్టి మీ నడుమును వీలైనంతగా గాల్లోకి పైకి తీసుకెళ్లేలా ప్రయత్నించాలి. ఇప్పుడు మీ గడ్డం భాగాన్ని ఛాతీ వైపుకు ఆనించే ప్రయత్నం చేయండి. మీ నాభిని వెన్నెముక వైపుకు లాగుతున్నట్లు చేయాలి. అంతే శ్వాస వదులుతూ మామూలు స్థితికి వచ్చి పునరావృతం చేయండి.
భుజాంగాసనం
ఈ ఆసనం చేయడం కోసం ముందుగా బోర్లా పడుకోండి. తర్వాత రెండు మోచేతులను మీ ఛాతీకి దగ్గరగా నేలమీద ఆనించాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని మీ తలను, నడుమును వీలైనంత వెనక్కి వంచడానికి ప్రయత్నించాలి. అలా కాసేపుండి తర్వాత మెల్లిగా శ్వాస వదులుతూ తలను ముందుకు తీసుకువచ్చి నేలకు ఆనించాలి. ఇదంతా చేస్తున్నప్పుడు మీ భుజాల్లో సాగినట్లుగా అనిపించే అనుభూతి మీరు పొందాలి.