Yoga Asana: ఈ ఆసనం రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
30 November 2024, 7:00 IST
- Yoga Asana: కూర్మాసనం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. తాబేలులా ఉండే ఈ భంగిమ వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. శరీర ఫ్లెక్సిబులిటీ పెరగడం సహా మరిన్ని ముఖ్యమైన బెనెఫిట్స్ ఉంటాయి. అవేవో ఇక్కడ చూడండి.
Yoga Asana: ఈ ఆసనం రెగ్యులర్‌గా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
యోగా శరీరానికి ఫిట్‍నెస్‍ను, మానసిక ప్రశాంతతను అందించగలదు. అందుకే ఒత్తిడి, సవాళ్లతో నిండిన ప్రస్తుత జీవనశైలిలో యోగా చేయడం చాలా ముఖ్యం. యోగా వల్ల శరీరం, మెదడు రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా కొన్ని ఆసనాలు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. అలాంటి ఆసనమే కూర్మాసనం. ఈ ఆసనాన్ని రెగ్యులర్‌గా సాధన చేయడం వల్ల కలిగే లాభాలు ఏవి.. ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
శరీర ఫ్లెక్సిబులిటీ.. నొప్పులు తగ్గడం
ఈ కూర్మాసనంలో నడుమును బాగా వంచాల్సి ఉంటుంది. ఛాతిని నేలకు ఆనించాలి. చేతులు, కాళ్లు కూడా బాగా సాగుతాయి. మొత్తంగా ఈ ఆసనం సాధన చేయడం వల్ల శరీర ఫ్లెక్సిబులిటీ బాగా పెరుగుతుంది. వెన్ను నొప్పి లాంటివి తగ్గుతాయి. సరైన భంగిమ ఉండేలా తోడ్పడుతుంది.
మెదడు ప్రశాంతత
కూర్మాసనం వేసే సమయంలో దానిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ ఆసనం గురించే ఆ సమయంలో మెదడు ఆలోచిస్తుంది. దీంతో ఈ యోగాసనం వేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గుతాయి.
జీర్ణక్రియ మెరుగు
కూర్మాసనం వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఈ భంగిమలో పొత్తి కడుపుపై ఒత్తిడి పడుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థలోని అవయవాలు ప్రేరేపణకు గురువుతాయి, జీవక్రియ మెరుగవుతుంది. దీంతో జీర్ణానికి ఈ ఆసనం మేలు చేస్తుంది. కిడ్నీలు, కాలేయం పనితీరును కూడా కూర్మాసనం మెరుగుపరుస్తుంది.
ఆ కండరాలు బలోపేతం
కూర్మాసనం రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరం మధ్య భాగంలో ఉన్న కండరాల దృఢత్వం పెరుగుతుంది. సరైన తీరులో ఉంటాయి. నేలపై ఛాతిని తాకించేందుకు ప్రయత్నించినప్పుడు పొత్తి కడుపు సహా దాని దగ్గర్లో ఉండే కండరాలు బలోపేతం అవుతాయి. దీనివల్ల శరీర బ్యాలెన్స్ మెరుగ్గా ఉంటుంది. నడుము నొప్పి తగ్గేందుకు కూర్మాసనం తోడ్పడుతుంది. కటి ఎముకలకు కూడా మేలు జరుగుతుంది.
కూర్మాసనం వేయడం ఇలా..
- కూర్మాసనం వేసేందుకు ముందుగా.. ఓ చోట కూర్చోవాలి. కాళ్లను ముందుకు చాపాలి.
- మోకాళ్లను కాస్త పైకి వంచాలి. మోకాళ్లు నేలకు మధ్య గ్యాప్ ఉండేలా కాళ్లను మడవాలి.
- మోకాళ్ల కింది భాగం భుజాలకు తాకేలా చేతులను ఆ గ్యాప్‍లో పక్కకు చాపాలి.
- అనంతరం నడుమును ముందుకు వంచాలి. ఛాతి నేలకు తాకే వరకు అలాగే వంగాలి. నుదురు కూడా నేలకు తాకాలి.
- ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. ఈ భంగిమ వేసినప్పుడు తాబేలు ఆకారంలో శరీరం ఉంటుంది. అందుకే దీన్ని కూర్మాసనం అంటారు.
టాపిక్