తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hiking Destinations । మీ న్యూ ఇయర్ పార్టీ ఓ రేంజ్‌లో ఉండాలంటే.. ఈ ప్రదేశాలకు హైకింగ్ వెళ్లండి!

Hiking Destinations । మీ న్యూ ఇయర్ పార్టీ ఓ రేంజ్‌లో ఉండాలంటే.. ఈ ప్రదేశాలకు హైకింగ్ వెళ్లండి!

HT Telugu Desk HT Telugu

21 December 2022, 21:25 IST

google News
    • Top 5 Hiking Destinations in India: హైకింగ్ ఇప్పుడు అత్యంత ట్రెండిగ్ అడ్వెంచర్ గా మారుతోంది. మీరు ఈ నూతనా సంవత్సర వేడుకలలో అత్యంత ఎత్తులో చేసుకోవాలనుకుంటే ఇక్కడకు వెళ్లండి.
Top 5 Hiking Destinations in India:
Top 5 Hiking Destinations in India:

Top 5 Hiking Destinations in India:

ఇటీవల కాలంలో హైకింగ్, పర్వతారోహణ అనేవి అత్యంత థ్రిల్లింగ్ అడ్వెంచర్ కార్యకలాపాలలో ఒకటిగా మారుతున్నాయి. మన దేశంలోనూ అనేక చోట్ల హైకింగ్ కార్యకలాపాలపై ఆసక్తి చూపేవారు పెరుగుతూపోతున్నారు. చాలా మంది కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కూడా వీకెండ్ వచ్చిందంటే తమకు దగ్గర్లో ఉన్న ఏదైనా కొండ ప్రాంతాన్ని ఎంచుకొని హైకింగ్ చేస్తున్నారు.

ముందుగా చిన్నచిన్న కొండలు ఎక్కడంతో ప్రారంభమయ్యే ఈ హైకింగ్, నెమ్మదిగా పర్వతారోహణ వైపుగా సాగి ఎత్తైన శిఖరాలను సైతం అధిరోహించడం వరకు వెళ్తుంది. హైకర్లు, పర్వతారోహకులు తమ అనుభవం ఆధారంగా తమ లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు, ఆ తర్వాత నెమ్మదిగా తమ స్థాయిని పెంచుకోవచ్చు.

హైకింగ్‌తో కలిగే ప్రయోజనం?

హైకింగ్ కేవలం ఒక సాహసోపేతమైన కార్యకలాపం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప కార్డియోవాస్కులర్ వ్యాయామం కూడా. హైకింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి గొప్పగా ఉపయోగపడుతుంది, ఇతర ప్రాణాధారాలను కూడా అదుపులో ఉంచుతుంది. హైకింగ్ చేయడం వలన మీ కాళ్ళలో కండరాలు దృఢంగా మారతాయి. ఇది మీ కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది, మీ శరీర సమతుల్యతను పెంచుతుంది. అంతకు మించి గొప్ప సరదా లభిస్తుంది, సాహస యాత్రగా మీ జీవితంలో నిలుస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారు.

Top 5 Hiking Destinations in India- భారతదేశంలోని గొప్ప హైకింగ్ ప్రదేశాలు

భారతదేశం సుసంపన్నమైన ప్రకృతి సౌందర్యాలను కలిగి ఉంది. దేశానికి ఉత్తరాన దేదీప్యమానంగా హిమాలయాలు వెలుగొందుతున్నాయి. దక్షిణాన కమనీయమైన పచ్చని కనుమలు ఉన్నాయి. ఇక్కడ ఔత్సాహిక సాహసికులు, విహారయాత్రకు వెళ్ళే ప్రయాణికుల కోసం మంత్రముగ్దులను చేసే పర్వత శ్రేణులు ఎన్నో ఉన్నాయి.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ పర్వతారోహకురాలు, ఫిట్‌నెస్ కోచ్ గాయత్రీ మొహంతీ హైకింగ్ గురించి విశేషాలను పంచుకున్నారు. బిగినర్స్ లెవెల్ నుండి అడ్వాన్స్‌డ్ వరకు తప్పక సందర్శించాల్సిన పర్వతాల జాబితాను ఆమె షేర్ చేశారు. ప్రకృతి ఒడిలోకి నేరుగా ప్రవేశించి మనస్సు, శరీరం, ఆత్మను తిరిగి కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆ అందమైన ప్రదేశాలు ఏవో మీరు కూడా తెలుసుకోండి మరి.

1. ట్రయండ్ ట్రెక్

ఢిల్లీ, చండీగఢ్ నుండి వారాంతంలో వెళ్లడానికి ట్రయండ్ ట్రెక్ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది ప్రారంభకులు సైతం అత్యంత అధిరోహించగల హిమాలయా ట్రెక్. ధర్మశాల నుండి కేవలం 18కిమీల దూరంలో ఉన్న ఈ హైకింగ్ మీకు అందమైన సూర్యాస్తమయాలతో సహా రోజంతా అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఒకవైపు ఎత్తైన ధౌలాధర్ శ్రేణులు, మరొక వైపు బ్రహ్మాండమైన కాంగ్రా లోయ సుందర వీక్షణను అందిస్తుంది. కాంగ్రా లోయ క్రింద నక్షత్రాలను చూస్తూ ఆనందించవచ్చు.

2. తడియాండమోల్ ట్రెక్

ఎటు చూసినా పచ్చని దృశ్యాలతో నిండిన తడియాండమోల్ ట్రెక్ కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఉంది. పచ్చని కొండల నడుమ మేఘాల నుండి జాలువారే పొగమంచుతో అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యుత్తమ కాఫీని ఉత్పత్తి చేసే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. మైసూరు నుండి 3 గంటల దూరంలో ఉన్న నలకునాడ్ ప్యాలెస్ నుండి ట్రెక్కింగ్ ప్రారంభించవచ్చు. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఇక్కడ షికారు చేయడానికి ఉత్తమ సమయం. గైడ్ లేకుండా కూడా ఇక్కడ హైకింగ్ చేయడం చాలా సులభం.

3. నాంగ్రియాట్ ట్రెక్

మేఘాలయలోని పూర్తిగా జనావాసాల మధ్య ఉన్న హైక్, నాంగ్రియాట్ ట్రెక్. భిన్నమైన స్థానిక సంస్కృతులను చూడవచ్చు. ఈ ప్రాంతం లోయలు, సహజ కొలనులు, జలపాతాలతో కనివిందు చేస్తుంది. ఇక్కడి ఖాసీ గ్రామస్తుల 'సస్పెండ్ లివింగ్ రూట్ వంతెనలు' మీకు అద్భుతమైన పురాతన ఇంజనీరింగ్‌ను మరలా పరిచయం చేస్తాయి. ఏడాది పొడవునా అనేక మంది సందర్శకులను ఇక్కడకు హైకింగ్ కోసం వస్తారు. ఈ కాలిబాట చిరపుంజీకి సమీపంలోని టిర్నా గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఇది భూమిపై అత్యంత తేమగా ఉండే ప్రదేశంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదయింది.

4. చంద్రశిలా ట్రెక్

'దేవతలు స్నానం చేసే ప్రదేశం' గా పేరుగాంచిన డియోరియా తాల్, చంద్రశిలా ట్రెక్ హైకింగ్ కోసం మరొక గొప్ప ప్రదేశం. శీతాకాలంలో ఇక్కడి దృశ్యాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. వసంతకాలంలో ప్రకాశవంతమైన గులాబీ పువ్వులతో వికసించే రోడోడెండ్రాన్ చెట్లతో ఇంకా గొప్పగా ఉంటుంది. గైడ్ లేకుండా కూడా ఇక్కడ ట్రయల్‌ను అనుసరించడం సులభం.

5. గోచా లా ట్రెక్

గోచా లా ట్రెక్ అనేది సాహసికుల కోసం నిర్దేషించిన ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. దీనిని ట్రెక్కింగ్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకోవాలి. ఇక్కడి ప్రధాన హైలైట్ సిక్కిం పూర్వపు బౌద్ధ రాజ్యం. ఇంకా విస్తారమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంటుంది. ఇక్కడ హైకింగ్ మొదట్లో తేలికగా అనిపిస్తుంది, పైకి వెళ్తున్నకొద్దీ చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి అనుభవజ్ఞులైన హైకర్లు అవసరం. వసంత రుతువు, శరదృతువులు ఈ ప్రదేశం సందర్శించడానికి ఉత్తమ సమయాలు.

తదుపరి వ్యాసం