Dry Fruit Laddu Recipe : ఉపవాస సమయంలో శక్తినిచ్చే డ్రైఫ్రూట్ లడ్డూలు..
04 October 2022, 7:03 IST
- Dry Fruit Laddu Recipe : పండుగ సమయంలో చాలామంది ఉపవాసముంటారు. ఆ సమయంలో సరైన పోషకాలు అందక అనారోగ్యానికి గురవుతారు. అయితే పండుగ సమయంలో హెల్తీగా ఉండాలంటే డ్రైఫ్రూట్స్ లడ్డూలు చేసేసుకోండి. వాటిని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రైఫ్రూట్ లడ్డూలు
Dry Fruit Laddu Recipe : నవరాత్రి ఉత్సవాల్లో అందరూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ సమయంలో ఉపవాసం ఉండడం వల్ల చాలామంది సరైన ఫుడ్ తీసుకోలేక అనారోగ్యానికి గురవుతారు. అయితే ఉపవాసం అయిపోయాక.. లేదా.. పండుగ తర్వాత మళ్లీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడం కోసం.. మీ ఆహారంలో ఈ డ్రైఫ్రూట్ లడ్డూలు చేర్చుకోండి. ఇవి మీకు తక్షణమే శక్తిని ఇస్తాయి. కాబట్టి వీటిని మీ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చేర్చుకోవచ్చు. మరి వీటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఎండుద్రాక్ష - 3 టేబుల్ స్పూన్లు
* నెయ్యి - 1 టేబుల్ స్పూన్
* ఖర్జూరం - 1 కప్పు (విత్తనాలు లేనివి)
* పిస్తా - 1/4 కప్పు
* జీడిపప్పు -1/4 కప్పు
* ఏలకుల పొడి - 1/2 tsp
* బాదం - 1/4 కప్పు
తయారీ విధానం
ముందుగా ఖర్జూరాలను తీసుకుని.. మిక్సీలో కచ్చపచ్చగా అయ్యేలా మిక్స్ చేయండి. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి తీసుకుని.. దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా, బాదంలను దానిలో వేసి బాగా కలపండి. వాటిని 3-4 నిమిషాలు మీడియం మంట మీద కాస్త రంగు మారే వరకు వేయించాలి. ఇప్పుడు దానిలో ఖర్జూరం పేస్ట్ కలపాలి. మీడియం మంట మీద కలుపుతూ వేయించండి. ఖర్జూరాలను గరిటెతో స్మాష్ చేయండి. ఇది ఇతర డ్రై ఫ్రూట్‌లతో కలవడానికి సహాయపడుతుంది.
ఇప్పుడు దానిలో యాలకుల పొడిని కూడా వేసి.. ఖర్జూరం నూనె విడుదలయ్యే వరకు వేయించండి. నూనె విడుదలవుతుంది అనిపించినప్పుడు మంటను ఆపేసి.. రెండు నిమిషాలు చల్లారనివ్వండి. వెంటనే లడ్డూలను తయారు చేయడం ప్రారంభించండి. పూర్తిగా చల్లారిపోతే.. లడ్డూలుగా రావు. వీటిని వెంటనే తినొచ్చు. లేదా గాలి చేరని కంటైనర్‌లో నిల్వ చేయవచ్చు.