Milk Payasam Recipe : నవరాత్రుల్లో పాల పాయసం ఇలా చేసేయండి..
01 October 2022, 7:46 IST
- Milk Payasam Recipe : పాయసం అనేది ప్రతి ఇండియన్ ఇంట్లో చేసుకునే ఓ అద్భుతమైన రెసిపీ. పండుగలకు, పుట్టినరోజులకు కచ్చితంగా తయారు చేసుకుంటాం. కొందరికి ఈ పాలతో పాయసం ఎలా చేయాలో అంతగా తెలియదు. మరి దీనిని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాయసం
Milk Payasam Recipe : ప్రస్తుతం నవరాత్రుల సంబరాల్లో అందరూ బిజీగా ఉన్నారు. అయితే ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి పాలతో చేసిన పాయాసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అంతే కాకుండా స్వీట్స్ తినాలనుకునేవారికి కూడా ఇది ఓ మంచి డిజర్ట్ అని చెప్పవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
* నెయ్యి - 1/4 టీస్పూన్
* బియ్యం - 3 టేబుల్ స్పూన్లు
* పాలు - 2 లీటర్లు
* చక్కెర - 1/2 కప్పు
పాల పాయసం తయారీ విధానం
ముందు బియ్యాన్ని కడిగి.. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తక్కువ మంట మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడిచేయాలి. ఇప్పుడు బియ్యం దానిలో వేసి.. కొద్దిగా కాలిన వాసన వచ్చేవరకు మీడియం మంట మీద రోస్ట్ చేయాలి. అన్నం గోధుమ రంగులోకి మారకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు దానిలో పాలు వేసి.. ఉడకనివ్వాలి. పాలు దాని పరిమాణంలో సగం అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. తక్కువ వేడి మీద పాలు, బియ్యం మిశ్రమాన్ని ఉడకబెట్టాలి. అన్నం ఉడికిన తర్వాత.. దానిలో చక్కెర వేసి.. చక్కెర కరిగిపోయే వరకు బాగా కలపాలి. మీకు నచ్చితే కుంకుమ పువ్వు లేదా నట్స్ వేసుకోవచ్చు. దీనిని వేడిగా లేదా చల్లారిన తర్వాత తినొచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కూడా.. పూజ తర్వాత బ్రేక్ ఫాస్ట్, డిజెర్ట్ లాగా తినేయొచ్చు.