Seeds Health Benefits : ఈ గింజలు చూసేందుకు చిన్నవే.. కానీ ఆరోగ్యాన్ని కాపాడటంలో పెద్దవి
18 February 2024, 12:30 IST
- Seeds Health Benefits In Telugu : కొన్ని రకాల విత్తనాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిని రోజూ తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు పొందుతారు. చిన్న విత్తనాలే అయినా మంచి ప్రయోజనాలు అందిస్తాయి.
విత్తనాల ప్రయోజనాలు
విగ్రహం చిన్నదే.. కానీ కీర్తి పెద్దది అనే సామెత వినే ఉంటారు. విత్తనాల విషయంలో ఇది నిజంగా సరిపోతుంది. గింజల్లో ఆరోగ్యకరమైన పదార్థాలు దాగి ఉంటాయి. మీకు ఆరోగ్యం కావాలంటే విత్తనాలను తీసుకోవడం మరిచిపోవద్దు. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. పోషకాల విషయానికి వస్తే విత్తనాలు చాలా గొప్పవి. వీటిలో ప్రొటీన్లు, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
మీ ఆహారంలో కొన్ని కూరగాయల విత్తనాలను చేర్చుకోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మలబద్ధకం, గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చు. తినడానికి రుచికరమైన, ఆరోగ్యకరమైన విత్తనాల గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.., గింజలను తినడం మర్చిపోకండి. నెల రోజుల్లో మీ బరువులో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచే విత్తనాల గురించి చూద్దాం..
బొప్పాయి గింజల విత్తనాలు
కొన్ని కారణాల వల్ల కాలేయం దాని సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనికి ప్రధాన కారణం మద్యం. అప్పుడు దాని సామర్థ్యం ప్రకారం పనిచేయదు, కొంత భాగం మలినాలతో నిండిపోతుంది. దీని నుంచి బయటపడాలంటే రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చిన్న కప్పు బొప్పాయి గింజల పొడి, ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే రెండు నెలల్లో ఈ సమస్య తగ్గుతుంది.
గుమ్మడికాయ గింజలు
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గుమ్మడికాయ గింజలు తినడం వల్ల క్యాన్సర్ ఏర్పడకుండా, పెరగకుండా నిరోధించవచ్చు. ఇందులో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వినియోగం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇందులోని ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన గుమ్మడికాయ గింజలను తినడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి.
అవిసె గింజల్లో ఆరోగ్యం
అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక వైద్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి. నేటికీ ఈ విత్తనాలను అద్భుతమైన కొలెస్ట్రాల్ తగ్గించే విత్తనాలు అంటారు. ఇవి మనిషి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇందులోని మరో ప్రత్యేకత ఏంటంటే పొడి చేసి తాగవచ్చు. దాన్ని అలాగే తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది. అవిసె గింజల పొడిని ప్రతిరోజూ నీటితో సేవించవచ్చు. ఇది మీ శరీరానికి అవసరమైన ఫైబర్‌ని అందిస్తుంది. వీటిని తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలని గుర్తుంచుకోవాలి. కావాలంటే వేయించి కూడా తినవచ్చు.
నువ్వుల గింజలు చేసే అద్భుతాలు
నువ్వుల గింజలు కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఇనుము యొక్క అధిక కంటెంట్‌కు ప్రసిద్ధి చెందాయి. నువ్వులలో కొలెస్ట్రాల్‌తో పోరాడే లెగ్నాస్ ఉంటాయి. బ్లడ్ ప్రెజర్ రెగ్యులేటర్ కావడంతోపాటు నువ్వులు ఆస్తమా, మైగ్రేన్‌లను కూడా నివారిస్తుంది. గర్భధారణ సమయంలో నువ్వులను మితంగా తీసుకోవడం ఆరోగ్యకరమని గుర్తుపెట్టుకోవాలి
చియా విత్తనాలతో ప్రయోజనాలు
చియా విత్తనాలు శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. వేసవి కాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. మెదడుకు మేలు చేస్తుంది. పైన చెప్పిన విత్తనాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోజూవారీ ఆహారంలో వాటిని ఉండేలా చూసుకుంటే మంచిది.