Lemon Ginger Tea: అల్లం-లెమన్ టీ.. మీకు చికాకు తెప్పించే ఎన్నో అనారోగ్య సమస్యలకి నిమిషాల్లోనే ఉపశమనం!
27 October 2024, 14:00 IST
తలనొప్పి లేదా వికారంగా అనిపిస్తే మనం వెంటనే టీ తాగుతుంటాం. కానీ.. సాధారణ టీ కంటే ఆ సమయంలో అల్లం-లెమన్ కాంబినేషన్‌తో టీ తాగితే నిమిషాల్లోనే మీకు ఉపశమనం లభిస్తుంది.
అల్లం-లెమన్ టీ
ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాదించిన వనమూలికల్లో అల్లం ఒకటి. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అల్లం టీ అనేది ఆరోగ్యకరమైన పానీయంగా చెప్పొచ్చు. ఆ అల్లం టీకి నిమ్మరసం కూడా జోడిస్తే జలుబు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, వాంతులు వంటి ఎన్నో సమస్యలకి వేగంగా ఉపశమనం లభిస్తుంది.
అల్లం మనకి మార్కెట్లలో సులభంగా దొరుకుతుంది. అల్లం పై లేయర్‌ని తొలగించి.. చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి 10 నిమిషాల వరకు ఉడకబెట్టి అందులో కొంచెం నిమ్మరసం వేసి టీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొందరు ఆ నీటిలో పసుపు , మిరియాలు, పుదీనా లేదా దాల్చిన చెక్క వంటివి కూడా జోడిస్తుంటారు. ఇవి టీ రుచిని పెంచడంతో పాటు మీకు తక్షణ ఉపశమనం ఇచ్చేందుకు ఉపయోగపడతాయి.
లెమన్ జింజర్ టీ ఎలా తయారు చేయాలి
- తాజా అల్లం (చిన్న ముక్కలు)- 4
- నిమ్మకాయ-1
- వేడినీరు- 4 కప్పులు
తయారు చేసే విధానం
- అల్లం ముక్కలని తురుము చేసుకోండి
- ఒక బౌల్‌లో నీరు పోసి అందులో ఆ అల్లం తురుమును వేసి బాగా ఉడకబెట్టండి
- ఆ తర్వాత నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని అందులో వేసి ఉడకనివ్వండి
- ఓ 5 నిమిషాల తర్వాత దించేసి గ్లాస్‌లో పోసుకుని గోరువెచ్చగా తాగండి.
- రోజులో మీరు ఓ 4-5 సార్లు ఈ టీని వేడి చేసుకుని తాగొచ్చు
అజీర్ణం, కడుపు ఉబ్బరం
లెమన్ జింజర్ టీ అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను వేగంగా తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. అలానే లెమన్, అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లతో మీ రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, ఫ్లూ లాంటి రోగాల నుండి రక్షణ లభిస్తుంది. ఇంకా మీ మెటబాలిజం పెంచి బరువు తగ్గడంలోనూ మీకు సహాయపడుతుంది. ఈ టీ మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతని ఇస్తుంది.
నొప్పి నుంచి ఉపశమనం
లెమన్ అల్లం టీ వాపు, కీళ్లనొప్పులు, తలనొప్పికి సంబంధించిన నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొంతమంది వ్యాయామం తర్వాత కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఒక కప్పు నిమ్మ అల్లం టీ తాగడానికి మక్కువ చూపుతారు.
బరువు తగ్గడం
లెమన్ జింజర్ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఇన్సులిన్ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు మొత్తాన్ని తగ్గిస్తుందని తేలింది. అల్లం ఆకలిని తగ్గిస్తుంది.. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది
వికారం నుంచి ఉపశమనం
పురాతన కాలం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి పరిష్కారం కోసం అల్లంను ఉపయోగిస్తున్నారు. వాంతులు, వికారంగా ఉన్నప్పుడు లెమన్ అల్లం టీ తాగితే మీకు ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దాంతో అల్లం- లెమన్ టీ తాగితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఈ టీ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. అలానే గుండెకి కూడా మంచిది. కాలేయ వ్యాధికి సంబంధించిన ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గర్భిణీలు లేదా పాలు ఇస్తున్న తల్లులు వైద్యులను సంప్రదించకుండా అల్లం-లెమన్ టీ తాగకూడదు. అలానే వార్ఫరిన్ లేదా ఇతర బ్లడ్ థిన్నర్స్ వంటి మందులను ఉపయోగిస్తుంటే ఈ టీ తాగే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.