Symptoms of High Stress Level | మీలో ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపే 7 సంకేతాలు..!
08 September 2022, 18:08 IST
- అధిక స్థాయి ఒత్తిడి హార్మోన్లు మీ మనస్సు, శరీరాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరం కనబరిచే 7 సంకేతాలను గమనించండి.
7 signs of high stress levels.
మన శరీరంలోని అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేసి రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ కార్టిసాల్ ను "ఒత్తిడి హార్మోన్" అని కూడా పిలుస్తారు. ఇది రక్తంలో విడుదలైనపుడు రక్తపోటు ఎక్కువవుతుంది, హృదయ స్పందన రేటు పెరుగుతుంది.
వ్యక్తి ఉగ్రరూపంలో ఆవేశంగా ఉంటాడు. ఈ రకమైన ఒత్తిడి మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. మీరు మరింత శక్తివంతంగా పనిచేస్తారు, మీ ఉత్పాదక పెరుగుతుంది, మీ శరీరంలోని అధిక బరువు కూడా తగ్గుతుంది. కానీ ఇది ఒక పాయింట్ వరకు మాత్రమే. ఉచ్ఛస్థితికి చేరిన తర్వాత అన్నీ రివర్స్ అవుతాయి. ఆరోగ్య ప్రయోజనాల పరంగా భారీ నష్టం వాటిల్లుతుంది. జుట్టు రాలడం, బరువు పెరగడం జరుగుతుంది, మీలో ఆందోళన ఎక్కువ అవుతుంది. కాబట్టి కార్టిసాల్ స్థాయి గురించి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది.
డైటీషియన్ కైలీ ఇవానీర్ ఒత్తిడి హార్మోన్ల గురించి చర్చించారు. ఎవరిలో అయితే ఒత్తిడి ఎక్కువ ఉంటుందో అది వారిలో కార్టిసాల్ స్థాయిలు పెరుగులకు సూచన. కార్టిసాల్ స్థాయిలు పెరిగినపుడు శరీరం కొన్ని సంకేతాలను కనబరుస్తుందని కైలీ తెలిపారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
జీర్ణ సమస్యలు
ఉదయాన్నే 2 లేదా 3 సార్లు బాత్రూమ్‌కి వెళ్లాల్సి రావటం లేదా అస్సలు వెళ్లలేకపోవటం వంటి అనుభవం మీకు ఎదురవుతుందా? ఇది ఒత్తిడికి సంకేతమే. ఒత్తిడి హార్మోన్లు ఎక్కువైనపుడు ఉదయం పూట జీర్ణ సమస్యలు, మలబద్ధకం లక్షణాలను కలిగిస్తాయి.
ఆకలి లేకపోవడం
ఆకలి లేకపోవడం, ముఖ్యంగా ఉదయం పూట ఆకలి అనేది లేకపోతే అది సానుకూల విషయం కాదు. ఇది వాస్తవానికి శరీరం గుండా ప్రవహించే ఒత్తిడి హార్మోన్ల హెచ్చు స్థాయిని సూచిస్తుంది. ఇది మీ ఆకలిని అణిచివేస్తుంది.
అతిగా తినడం
మీరు ఒత్తిడిలో ఉన్నపుడు మీకు తెలియకుండానే అతిగా కూడా తినేయవచ్చు. దీంతో ఉదయం పూట కూడా కడుపు నిండుగా ఉంటుంది. అల్పాహారం చేయాలనే ఆసక్తి ఉండదు.
చెదిరిన నిద్ర
తరచుగా నడిరాత్రి వేళలో నిద్ర నుంచి మెలకువ వస్తుంటే.. ఇది మీలో హార్మోన్ల అసమతుల్యతను సూచిస్తుంది. మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ విడుదలైనపుడు, అది నిద్రలోని REM దశలకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా మీకు నిద్రభంగం కలుగుతుంది.
బరువు హెచ్చుతగ్గులు
ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండలేరు. విపరీతంగా బరువు పెరగడం లేదా ఊహించని విధంగా బరువు తగ్గడం జరుగుతుంది అంటే మీ శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ప్రభావం ఎక్కువ ఉందని అర్థం. ఇది మీ ఆహార కోరికలను పెంచుతుంది, అది కూడా ఆరోగ్యకరమైనది కాకుండా ఏదైనా రుచికరమైన క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తినాలని అనిపిస్తుంది.
ప్రశాంతంగా ఉండలేరు, పనిపైనే ధ్యాస
పనిపైన ధ్యాస ఉండటం మంచిదే కానీ అది ఒక వ్యసనంలా మారకూడదు. మీరు రోజులో ఎక్కువ పనిచేయ గలుగుతున్నారు అంటే మీ శరీరం ఒత్తిడితో మనుగడ సాగిస్తోందనడానికి చెప్పే సంకేతం. మన శరీరం, మనసుకు తగినంత విశ్రాంతి, నిద్ర అనేది అవసరం.
క్రమరహిత పీరియడ్స్
ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదల ఎక్కువైనపుడు ఆడవారిలో నెలసరి క్రమంగా ఉండదు. పీరియడ్స్ ఆలస్యం అవటం లేదా రాకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.