Female Masturbation | ఆడవారు హస్తప్రయోగం చేసుకుంటే నెలసరి ఆగిపోతుందా?
07 September 2022, 21:32 IST
- లైంగికంగా ప్రేరేపణలు కలిగినపుడు సంతృప్తి పొందటానికి హస్తప్రయోగం ఒక ఆరోగ్యకరమైన మార్గం. మరి మహిళలు హస్తప్రయోగం చేసుకోవడం మంచిదేనా? ఇది వారి నెలసరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇక్కడ తెలుసుకోండి.
Masturbation
హస్తప్రయోగం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా సాధారణ విషయం. ఇది పురుషులకు ఎంత సాధారణమో, స్త్రీలకు కూడా అంతే సాధారణం. లైంగిక కోరికలు కలిగినపుడు మిమ్మల్ని మీరు స్వయంతృప్తి పరుచుకోవటానికి ఇది ఇక ఆరోగ్యకరమైన మార్గం. హస్తప్రయోగంతో రిలాక్స్‌గా అనిపించి ఒత్తిడి దూరం అవుతుంది. ముఖ్యంగా ఆడవారికి హస్తప్రయోగం మంచి అనుభూతి కలిగించటంతో పాటు, అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది స్త్రీల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అయితే సమాజంలోని కొన్ని కట్టుబాట్లు, మరికొన్ని భయాలను సాకుగా చూపుతూ ఆడవారు హస్తప్రయోగం చేసుకోవడం మంచిది కాదనే అపోహ ఉంది. తప్పుదోవ పట్టించే అనేక భావనలు వ్యాప్తిలో ఉన్నాయి. వీటిలో ఒకటి పీరియడ్స్ ఆలస్యం కావడం. మహిళలు హస్తప్రయోగం చేసుకుంటే వారికి నెలసరి ఆలస్యం అవుతుందనేది కొందరి వాదన. ఈ భయాల నడుమ హస్తప్రయోగం చేసుకున్నా భావప్రాప్తి కలగదు.
మరి, ఆడవారు హస్త ప్రయోగం చేసుకుంటే పీరియడ్స్ రాకపోవడం లేదా ఆలస్యమవడం అనే వాదనలో నిజమెంత? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హస్తప్రయోగం అనేది ఒక స్ట్రెస్ బస్టర్
ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, ఆడవారు తమ శరీరాన్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. హస్తప్రయోగాన్ని ప్రేరేపించే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది తద్వారా మీరు ఎలాంటి ఆందోళన లేకుండా రిలాక్స్‌గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
పీరియడ్స్‌తో సంబంధం లేదు
హస్తప్రయోగంతో పీరియడ్స్ ఆలస్యం అవుతాయి అనే వాదనలో ఎంతమాత్రం నిజం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ వైభవి శర్మ పేర్కొన్నారు. నెలసరి రావటం లేద రాకపోవటానికి హస్తప్రయోగం అలవాటుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హస్తప్రయోగంతో లైంగిక వ్యాధులు వస్తాయి, ఇది వ్యక్తి ఎదుగుదలను అడ్డుకుంటుంది, మానసిక సమస్యలు, అంధత్వాన్ని కలిగిస్తుంది, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది అని చాలా ప్రచారాలు ఉన్నాయి, కానీ ఇవేవి నిజం కాదని డా. వైభవి తెలిపారు. లైంగిక స్వయంతృప్తి, లైంగిక ఆరోగ్యం ఇతర కట్టుబాట్ల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు.
పీరియడ్స్ రాకపోవటానికి కారణాలు
ఆడవారిలో PCOD, పోషకాహారం లోపం లేదా కొన్ని హార్మోన్ల అసమతుల్యత కారణంగా క్రమరహిత పీరియడ్స్ లేదా పీరియడ్స్ రాకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. వరుసగా మూడు నెలల పాటు పీరియడ్స్ రాకపోతే, అలాగే మీరు లైంగికంగా నిష్క్రియంగా ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించి కారణాలు తెలుసుకోవటం మంచింది. ఇందుకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.