తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Health Supplements । గుండె జబ్బుల నుంచి తప్పించుకోవాలంటే ఈ మూడు ముఖ్యం!

Heart Health Supplements । గుండె జబ్బుల నుంచి తప్పించుకోవాలంటే ఈ మూడు ముఖ్యం!

HT Telugu Desk HT Telugu

29 August 2022, 13:06 IST

    • ఈరోజుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బుల బారినపడుతున్న వారు ఎంతో మంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం 3 కీలక సప్లిమెంట్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
Heart Health
Heart Health (iStock)

Heart Health

నేడు హార్ట్ ఎటాక్ ఎవరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఆరోగ్యంగా కనిపించే యువకులు సైతం హఠాత్తుగా గుండెపోటుతో మరిణించే సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇందుకు కారణం నిశ్చలమైన జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు, అలాగే అనారోగ్యకరమైన ఆహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పరిస్థితిని మరింత దిగజార్చుకోకుండా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈరోజు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి.

హృదయం పదిలంగా ఉండాలంటే అందుకు మొదటి అడుగు శారీరక శ్రమ, ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం తదుపరిది. కొద్దికాలం పాటు మీరు వేసే ఈ చిన్ని అడుగులే ఆరోగ్యకరమైన హృదయానికి దారులు పరుస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. భారీ వ్యాయామాలు చేసే ఒక్కసారిగా బరువు తగ్గే ప్రయత్నాలు చేయడం, ఆహారపు అలవాట్లను వెంటనే పూర్తిగా మార్చేసి మీకు సరిపడనిది తినడం ద్వారా మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఏదైనా నెమ్మదిగా, కొద్దికొద్దిగా ప్రారంభించండి. ఆరోగ్యకరమైన జీవనశైలికి మీ శరీరం అలవాటుపడేలా చేసుకోవాలి. ఆ తర్వాత డోస్ పెంచుకుంటూ పోవాలి.

అలాగే అప్పుడప్పుడు వైద్యులను సంప్రదించి చెక్ చేసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్రను కలిగి ఉంటే అలాంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి, వారి గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

హార్ట్ హెల్త్ సప్లిమెంట్లు

గుండె జబ్బులను చిటికెలో నయం చేసే మ్యాజిక్ పిల్ అంటూ ఏదీ లేదు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం అలాగే మంచి నిద్ర అలవాట్లను కలిగి ఉండి, అదనంగా కొన్ని సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా కూడా గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని న్యూట్రిషనిస్ట్ భక్తి కపూర్ తెలిపారు.

హార్ట్ హెల్త్ సప్లిమెంట్‌ను ఎలా ఎంచుకోవాలో ఆమె వివరించారు. హార్ట్ హెల్త్ సప్లిమెంట్లను ఎంచుకునేటప్పుడు కృత్రిమ రంగులు లేదా ఫిల్లర్లు వంటి అవాంఛిత పదార్థాలు లేని ఉత్పత్తులను ఎంచుకోవాలని తెలిపారు.

ఆరోగ్యకరమైన గుండె కోసం పోషకాహార నిపుణులు సూచించే మూడు హార్ట్ హెల్త్ సప్లిమెంట్లు ఇక్కడ ఉన్నాయి.

1. ఒమేగా 3-కొవ్వు ఆమ్లాలు

  • వాపును తగ్గిస్తుంది
  • ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది
  • మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది
  • ధమనుల గోడను టోన్‌ చేస్తుంది
  • రక్తపోటును తగ్గిస్తుంది
  • రక్తం గడ్డకట్టడాన్ని అణిచివేస్తుంది
  • క్రమరహిత గుండె లయలను మెరుగుపరుస్తుంది

2. కోఎంజైమ్ Q10 (CoQ10)

  • సెల్యులార్ శక్తి ఉత్పత్తికి ఇది అవసరం
  • యాంటీఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్ నష్టాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది
  • రక్తపోటును తగ్గిస్తుంది

3. మెగ్నీషియం

  • మీ గుండె కండరాలలో జీవరసాయన ప్రతిచర్యలలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది
  • రక్తపోటును మెరుగుపరుస్తుంది
  • గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిడిని తగ్గిస్తుంది.

అయితే ఈ సప్లిమెంట్లను తీసుకునే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సిఫారసు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం