Sudden Cardiac Arrest । కార్డియాక్ అరెస్ట్ వచ్చేముందు లక్షణాలేమిటి? ప్రాణాపాయం ఎలా తప్పించవచ్చు?!
27 May 2023, 10:59 IST
- Sudden Cardiac Arrest: సడన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) అనేది ఒక ప్రాణాంతక పరిస్థితి. లక్షణాలు, చికిత్సా విధానం ఇక్కడ తెలుసుకోండి.
Sudden Cardiac Arrest
Sudden Cardiac Arrest: సడన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) అనేది సక్రమంగా లేని గుండె లయ కారణంగా తలెత్తే ఒక ప్రాణాంతక పరిస్థితి. కార్డియాక్ అరెస్ట్ అయినపుడు గుండె కార్యకలాపాలన్నీ ఆకస్మికంగా నిలిచిపోతాయి, శ్వాస ఆగిపోతుంది. వ్యక్తి స్పృహ కోల్పోతాడు, తక్షణమే స్పందించి వీలైనంత త్వరగా చికిత్స చేయకపోతే అది వ్యక్తి మరణానికి దారి తీస్తుంది.
ఎవరైనా వ్యక్తి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కు గురైనపుడు అత్యవసర ప్రాథమిక చికిత్సలో భాగంగా ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేయాలి. ఇదేకాకుండా వైద్యులు ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) అనే పరికరంతో గుండెకు షాక్‌లు ఇవ్వడం ద్వారా గుండె కార్యకలాపాలు కొనసాగించేలా చేయడం సాధ్యమవుతుంది.
కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు రెండూ ఒకటేనా?
కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు రెండూ ఒకటి కాదు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. మరోవైపు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది రక్త ప్రసరణకు అడ్డుపడటం వల్ల కాదు. గుండె విద్యుత్ చర్యలో మార్పు జరిగి గుండె లయ తప్పినపుడు కలుగుతుంది. అయినప్పటికీ, గుండెపోటు కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు వేగంగా కనిపిస్తుంటాయి, అవి తీవ్రంగా ఉంటాయి. లక్షణాలు ఈ కింద గమనించండి
- వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలడం
- పల్స్ లేకపోవడం
- శ్వాస తీసుకోకపోవడం
- స్పృహ కోల్పోవడం
ఈ లక్షణాలతో పాటు కొన్నిసార్లు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి, అవి ఈ కింది విధంగా ఉంటాయి.
- ఛాతీలో అసౌకర్యం.
- శ్వాస ఆడకపోవుట.
- బలహీనత.
- గుండె వేగంగా కొట్టుకోవడం, అస్తవ్యస్తంగా కొట్టుకోవడం, గుండె దడగా అనిపించడం
- మూర్ఛ
- తలతిరగడం
కొన్నిసార్లు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా కూడా సంభవించవచ్చు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అపస్మారక స్థితిలో ఉండి, శ్వాస తీసుకోని స్థితిలో ఉన్నారని గమనిస్తే వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయండి. ఈలోపు CPR చేయాలి, మీకు అందుబాటులో ఉంటే AED అని పిలిచే ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ కూడా ఉపయోగించండి.
CPR ఎలా చేయాలి?
వ్యక్తి శ్వాస తీసుకోకపోతే CPR చేయండి. వ్యక్తి ఛాతీపై గట్టిగా, వేగంగా నెట్టండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఛాతీపై చేతులతో ఒత్తిడి వర్తించండి. మీరు CPRలో శిక్షణ పొందినట్లయితే, వ్యక్తి శ్వాస తీసుకునే మార్గాన్ని చెక్ చేయండి. ప్రతి 30 కుదింపుల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించండి.