Epilepsy । తాళాల గుత్తి చేతిలో పెడితే ఫిట్స్ తగ్గుతాయా? మూర్ఛ వ్యాధికి చికిత్స ఇదీ!
Epilepsy: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఫిట్స్ కంట్రోల్ చేయడం ఎలా, మూర్ఛ వ్యాధికి చికిత్స మొదలైన అన్ని అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
ఎపిలెప్సీ అనేది కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన ఒక అనారోగ్య పరిస్థితి. ఎవరైనా వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వారి మెదడులో కార్యకలాపాలు అసాధారణంగా మారుతాయి. తద్వారా మూర్ఛలు వస్తాయి, కొన్నిసార్లు వారి ప్రవర్తన కూడా అసాధారణంగా ఉండవచ్చు, అవగాహనలేమితో కూడిన లక్షణాలు, అనుభూతులను అనుభవిస్తారు. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం కూడా ఉంటుంది.
మూర్ఛ అనేది జన్యుపరంగా తలెత్తవచ్చు లేదా మెదడుకు గాయం లేదా స్ట్రోక్ ఫలితంగా సంభవించవచ్చు. ఈ వ్యాధి స్త్రీలు, పురుషులు అనే బేధం లేకుండా ఎవరికైనా సంభవించవచ్చు. ఇది ఏ వయసు వారినైనా ప్రభావితం చేసే ఒక న్యూరాలజికల్ డిజార్డర్.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ సోమవారం నాడు అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం (International Epilepsy Day) గా జరుపుకుంటారు, మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ఫిట్స్ ఎలా వస్తాయి? దానిని ఎలా చికిత్స చేయవచ్చు వంటి విషయాలపై అవగాహన కల్పించడం ఈరోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
Epilepsy Myths- మూర్చ వ్యాధి విషయంలో అపోహాలు
మూర్చ వ్యాధి ఉన్న వ్యక్తులు ఎవరైనా అకస్మాత్తుగా ఫిట్స్ అనుభవిస్తుంటే, తక్షణమే ఏం చేయాలనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఈ సమయంలో ఫిట్స్ తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తిని పెట్టి ఉంచుతారు, లేదా ఇనుప రాడ్ పట్టుకోవడం చేయిస్తారు. ఉల్లిపాయ వాసన చూపించడం, లేదా సాక్స్ వాసన చూపించడం ద్వారా ఫిట్స్ ఆగిపోతాయని నమ్ముతారు. కానీ వాస్తవికంగా చూస్తే ఇవన్నీ అపోహలు మాత్రమేనని వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటివి చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, కొన్నిసార్లు ప్రమాదాన్ని పెంచవచ్చునని చెబుతున్నారు.
ఫిట్స్, లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్‌ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. అయితే ఇది స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలిచే పరిస్థితి. ఒకవేళ ఒక మూర్ఛ ఎపిసోడ్ 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు కొనసాగిగే అది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స అందించాలి.
Epilepsy Treatment- మూర్చ వ్యాధికి ప్రాథమిక చికిత్స ఏమిటి?
మూర్చ వ్యాధి ప్రాథమిక చికిత్సకు సంబంధించి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫిట్స్ తగ్గటానికి ఏం చేయాలి?
- వ్యక్తిని నేలపైన సౌకర్యంగా పడుకోబెట్టండి, గుంపుగా చుట్టుముట్టకుండా వారికి గాలి తగిలేలా చూడండి.
- ఈ సమయంలో రోగికి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వారిని మెల్లగా ఒక వైపుకు తిప్పండి. ఇది వారికి శ్వాస పీల్చుకోవడానికి సహాయపడుతుంది.
- వ్యక్తి చుట్టూ ఉన్న ప్రాంతంలో గరుకుగా, గట్టిగా లేదా పదునైనవి ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయండి. తద్వారా గాయాలు కాకుండా నివారించవచ్చు.
- వారి తల కింద తలగడ లేదా ఏదైనా మృదువైన వస్త్రాన్ని ఉంచండి.
- కళ్లద్దాలు తొలగించండి, మెడ చుట్టూ ఏమైనా గొలుసులు, బిగుతుగా ఏదైనా ఉంటే విప్పండి.
- ఫిట్స్ 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు కొనసాగుతుంటే, వెంటనే వైద్య సహాయం పొందండి.
ఫిట్స్ కలుగుతున్నప్పుడు ఏం చేయకూడదు?
- ఫిట్స్ అనుభవిస్తున్న వ్యక్తిని గట్టిగా పట్టుకోవద్దు లేదా వారి కదలికలను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించవద్దు.
- రోగి నోటిలో ఏమీ పెట్టవద్దు. ఇది దంతాలు లేదా దవడకు హాని కలిగించవచ్చు.
- నోటిలో నోరు పెట్టి శ్వాస అందించడం CPR వంటివి చేయకూడదు. వారంతట వారే శ్వాస తీసుకునేలా అవకాశం కల్పించాలి.
- వారు పూర్తిగా మూర్ఛ నుంచి స్పృహలోకి వచ్చేంత వరకు ఆ వ్యక్తికి నీరు లేదా ఆహారం అందించవద్దు.
మూర్ఛ వ్యాధి సాధారణంగా ఒక పీరియడ్ నుంచి దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి. దీనిని మందుల ద్వారా, ఆహార మార్పుల ద్వారా చికిత్స చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.
మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. ఈ సమాచారాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్