Summer Health Care । వేసవిలో మీ ఆరోగ్యాన్ని చల్లగా ఉంచుకోండి.. ఎండాకాలంలో మీ రక్షణ ఇలా!
12 April 2023, 15:54 IST
- Summer Health Care: ఎండల తీవ్రత పెరుగుతుంది, ఈ సీజన్ లో కొన్ని సమస్యలు సర్వసాధారణంగా వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. వేసవిలో మీ సంరక్షణ కోసం చిట్కాలు పాటించండి.
Summer Health Care
Summer Health Care: మనదేశంలో వేసవి కాలంలో ఎండలు భరించలేని విధంగా ఉంటాయి. సాధారణంగా మార్చి నుంచి మే నెలాఖరు వరకు ఎండలు తీవ్రంగానే ఉంటాయి. ప్రతీ ఏడాది ఎండల తీవ్రత మరింత పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. పెరిగిన వేడి శరీరంలోని ఏదైనా ఒక భాగానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సన్ స్టోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు చర్మం, కళ్లు, శ్వాసకోశ సమస్యలు వేసవిలో సర్వసాధారణం. ఎండ వేడిమికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి వేసవిలో వచ్చే సాధారణ వ్యాధులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
వేసవిలో సాధారణంగాతలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యలు (Common Summer Illnesses) ఇక్కడ చూద్దాం
వడ దెబ్బ
వేసవిలో హైపర్థెర్మియా లేదా హీట్ స్ట్రోక్ సర్వసాధారణం. తీవ్రమైన ఎండకు గురికావడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల తల తిరగడం, తలనొప్పి, స్పృహ కోల్పోవడం, డీహైడ్రేషన్ కలిగి కొన్నిసార్లు ప్రాణాపాయానికి కారణమవుతుంది. హీట్‌స్ట్రోక్‌కు గురికాకుండా ఉండాలంటే ఎండలో తిరగకూడదు అలాగే ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి.
ఫుడ్ పాయిజనింగ్
వేసవిలో ఫుడ్ పాయిజన్ అనేది సర్వసాధారణం. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు నొప్పి, వికారం, విరేచనాలు, వాంతులు సంభవించవచ్చు. అందువల్ల ఇంట్లో వండిన తాజా ఆహారాన్నే స్వీకరించాలి.
డీహైడ్రేషన్
వేసవిలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య ఇది. తగినంత నీరు త్రాగకపోవడమే కాకుండా తీపి, ఉప్పు గల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.
చర్మ వ్యాధులు
వేసవిలో వచ్చే మరో సాధారణ వ్యాధి గవదబిళ్లలు లేదా తట్టు. ఇది ఒక అంటు వ్యాధి. ఇది సూర్యుని అధిక వేడి కారణంగా ముఖ్యంగా పిల్లలలో ఇది కనిపిస్తుంది. దగ్గు, తుమ్మడం ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.అమ్మవారు పోయడం లేదా చికెన్ పాక్స్ కూడా వేసవిలో వచ్చే చర్మవ్యాధి. చర్మంపై పొక్కులు, దురద, దద్దుర్లు, అధిక జ్వరం, ఆకలి లేకపోవడం , తలనొప్పి ఈ వ్యాధి లక్షణాలు.
చర్మం కమలడం
సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హానికరం, అవి చర్మ కణాలను కూడా దెబ్బతీస్తాయి. UV కిరణాలకు చర్మం ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల చర్మం నల్లబడటం జరుగుతుంది.
వేసవిలో స్ట్రీట్ ఫుడ్, బయటి ఫుడ్ తినడం తగ్గించండి. ఇంటి భోజనానికి ప్రాధాన్యతనివ్వండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.
వదులుగా ఉండే దుస్తులు ధరించండి. కాటన్ , లేత రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎండ తగలకుండా తలకు టోపి, స్కార్ఫ్, గొడుగు ధరించండి. సన్ గ్లాసెస్ ధరించండి.
పరిశుభ్రంగా ఉండండి, తరచుగా చేతులు కడుక్కోండి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వలన చెమట వలన కలిగే ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని కాపాడుకోవచ్చు,
వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించండి. బయటకు వెళ్లేటపుడు చర్మ సంరక్షణ చర్యలు తీసుకోండి. SPF 15 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.