Skipping Health Benefits | రోజూ అరగంట స్కిప్పింగ్ చేయండి.. స్లిమ్ అవుతారు!
27 November 2022, 18:20 IST
- Skipping Health Benefits: ప్రతిరోజు అరగంట పాటు స్కిప్పింగ్ (తాడు ఆట) చేస్తే నడుము నాజూకుగా మారుతుంది, అధిక బరువు తగ్గుతారు, సన్నగా మారుతారట. అంతేకాదు, ఇంకేంటో ఇక్కడ తెలుసుకోండి.
Skipping Health Benefits
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మిమ్మల్ని మీరు సరైన ఆకృతిలో, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే వ్యాయామం తప్పనిసరి. అయితే చాలామందికి వ్యాయామం చేయాలన్నా, సమయం దొరకక చేయకుండా లావెక్కిపోతారు. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు శారీరక శ్రమ లేకపోవడంతో లావెక్కిపోతున్నారు. దీంతో వారి శరీరాకృతి షేప్ ఔట్ అయిపోవడమే కాకుండా, అకారణంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి సన్నగా అవ్వాలంటే సరైన ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం చేయడం మినహా మరో మార్గం లేదు.
మీరు వ్యాయామం చేయడానికి ఇంటి నుండి బయటకు రాలేకపోతే, ఇంటి లోపలే ఉంటూ ఇండోర్ వ్యాయామాలు ప్రయత్నించవచ్చు. ఇందులో భాగంగా స్పాట్ జాగింగ్, యోగా, స్కిప్పింగ్ వంటివి చేయవచ్చు.
Skipping Health Benefits- స్కిప్పింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
స్కిప్పింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజూ కనీసం ఒక అరగంట లేదా 1000 రౌండ్లు తాడును స్కిప్ చేస్తే.. శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు, అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
సులభంగా బరువు తగ్గుతారు
అధిక బరువు ఉన్నవారికి స్కిప్పింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అవాంఛిత కొవ్వు కరిగిపోతుంది, తద్వారా మీరు సన్నగా మారవచ్చు. ప్రతిరోజూ కనీసం అరగంట స్కిప్పింగ్ చేయడం వల్ల 300 కేలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి స్కిప్పింగ్ మంచి ఫలితాలను ఇస్తుంది. పది నిమిషాలు స్కిప్పింగ్ అంటే 2 కి.మీ పరుగుతో సమానమని నిపుణులు అంటున్నారు.
శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది
స్కిప్పింగ్ ఆడుతున్నప్పుడు భుజాలను తిప్పడం, పైకి దూకడం వల్ల మొత్తం శరీరంలో కదలిక వచ్చి, శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇది శరీరంలోని అవయవాల కదలికను పెంచుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది, అవయవాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు, తొడలు బలపడతాయి.
ఊపిరితిత్తులకు మంచిది
స్కిప్పింగ్ ఆడిన తర్వాత శ్వాస వేగంగా అవుతుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండెకు మంచిది
స్కిప్పింగ్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తాడు ఆట హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల చాలా వరకు గుండె సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
ప్రస్తుతం చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఒత్తిడి , ఆందోళనతో బాధపడుతున్నారు. స్కిప్పింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. స్కిప్పింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అరగంట సాధ్యం కాకపోతే ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు స్కిప్పింగ్ ఆడండి.
మెదడు చురుకుగా ఉంటుంది
స్కిప్పింగ్ మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
టాపిక్