Running Reverse | వెనక్కి పరుగెత్తితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
08 May 2022, 6:45 IST
- నిండు చందురుడు ఒకవైపు చుక్కలు వైపు అన్నట్లుగా.. నలుగురిలా రన్నింగ్ చేయకండి, వారికి రివర్స్‌లో రన్నింగ్ చేయండి. రివర్స్ రన్నింగ్ ఇప్పుడు లేటెస్ట్ ఫిట్‌నెస్ ట్రెండ్.
Reverse Running
రన్నింగ్, జాగింగ్ చేయడం లాంటివి సర్వసాధారణం, కానీ వాటిని రివర్స్‌లో ఎప్పుడైనా చేశారా? ఇటీవల కాలంగా ఫిట్‌నెస్ ట్రెండ్ లలో రివర్స్ రన్నింగ్ పాపులర్ అవుతోంది. దీనినే బ్యాక్‌వర్డ్స్ రన్నింగ్ లేదా రెట్రో రన్నింగ్ అనికూడా పిలుస్తున్నారు. ఈ రివర్స్ రన్నింగ్ అంటే అందరిలా ముందుకు పరుగెత్తడం కాకుండా మనకు మనమే రివర్స్ గేర్ వేసుకొని వెనకకి పరుగెత్తాలి. ఇందులోనూ ఎవరు వేగంగా పరుగెత్తారు, ఇలా ఎంత దూరం పరుగెత్తారు అని పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇలా రివర్స్ పరుగెత్తడం సరదాగా ఉండటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తుండటంతో ఇప్పుడు ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది.
రివర్స్ రన్నింగ్ ద్వారా గాయాలు త్వరగా నయమవుతాయి, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు మాయం అవుతాయని చెబుతున్నారు. శరీరం ముందుభాగానికి, వెనుక భాగానికి ఒక స్థిరత్వం లభిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ రివర్స్ రన్నింగ్ గురించి నిపుణులు ఇలా వివరించారు.
ఇది ఫ్యాషన్ కాదు - ఆరోగ్యం
వెనక్కి పరుగెత్తడం అనేది ఒక గేమ్ కాదు, ఫ్యాషన్ కోసమో చేసేది కాదు. ఇది కూడా మీ సాధారణ వ్యాయామ దినచర్యలో ఒక భాగమే. వెనుకకు పరుగెత్తడం ద్వారా బహు విధమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ల్యాప్‌లో వెనుకకు పరుగెత్తడం ఎనిమిది ల్యాప్‌లు ముందుకు పరిగెత్తిన దానికి సమానమని రన్నర్స్ వరల్డ్ కోచ్ జెన్నీ హాడ్‌ఫీల్డ్ వివరించారు.
విభిన్నమైన వ్యాయామం
రివర్స్ రన్నింగ్ శరీరానికి విభిన్నమైన వ్యాయామాన్ని కల్పిస్తుంది. వెనక్కి పరుగెత్తుతుంటే నడుము, భుజాలు, మోకాళ్లు మరింత క్రియాశీలకం అవుతాయి.
మిలటరీ శిక్షణ
ఈ రివర్స్ రన్నింగ్ అనేది బాక్సర్ల కోసం, మల్లయోధులు, ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం నిర్ధేషించిన ఒక వ్యాయామం. సైనిక శిక్షణలో కూడా కూడా ఇలాంటి డ్రిల్స్ చేయిస్తుంటారు.
రెండు విధాల పరుగు
ముందుకు- వెనకకు రెండు రకాల పరుగును అమలు చేయాలని మరికొంత మంది నిపుణులు సిఫార్సు చేశారు. ముందుకు పరుగెత్తడం వలన సాధారణంగా లభించే ప్రయోజనాలతో పాటు రివర్స్ రన్నింగ్ చేయడం ద్వారా దాని ఫలితం మరింత మెరుగుపడుతుంది. కండరాలను బలపరచడంతో పాటు శరీరానికి బ్యాలెన్స్ లభిస్తుందని పేర్కొన్నారు.
అయితే మీరు కొత్తగా రివర్స్ రన్నింగ్ చేసేటపుడు మిమ్మల్ని చూసే నవ్వుకునేవాళ్లు ఉండొచ్చు, ఎదురు ప్రశ్నలు వేసే వారు ఉండొచ్చు.
వారికి తెలియకపోతే తెలియజెప్పండి లేదా వారిని విస్మరించండి. మీకోసం మీరు రివర్స్ గేరులో వెనక్కి పరుగెత్తండి.. మీ ఆరోగ్యాన్ని ముందుకు పరుగెత్తించండి.
అయితే ఒక్క గమనిక: వెనకకు రన్నింగ్ చేసేటపుడు వెనకాల ఎవరున్నారు? ఏముంది అనేది గమనించాలి.