తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jumping Rope |ఉదయం కేవలం 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే చాలు, అద్భుత ప్రయోజనాలు!

Jumping Rope |ఉదయం కేవలం 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే చాలు, అద్భుత ప్రయోజనాలు!

HT Telugu Desk HT Telugu

13 June 2022, 6:44 IST

    • ప్రతిరోజూ ఉదయం కేవలం 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే హార్ట్ బీటింగ్ రేట్ పెరుగుతుంది. జీవక్రియ త్వరగా ప్రారంభమవుతుంది. మరేతర వ్యాయామాలు అవసరం లేకుండానే బహుళ విధాలుగా ఫిట్‌నెస్ ప్రయోజనాలు పొందుతారని నిపుణులు అంటున్నారు.
Jumping Rope
Jumping Rope (Unsplash)

Jumping Rope

రోజూ ఉదయాన్నే మీ ఫిట్‌నెస్ దినచర్యగా జంపింగ్ రోప్ లేదా స్కిప్పింగ్ ఎంచుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. జాగింగ్, రన్నింగ్ అంటూ ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు, అలాగే జిమ్‌లలో వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.  మీకు కావాల్సింది స్కిప్పింగ్ కోసం ఒక త్రాడు, జంప్ చేయడానికి ఎక్కడో ఒకచోట కొద్దిపాటి స్థలం. 

ఈ స్కిప్పింగ్ ఒక్కటి చేయడం వలన మీకు అనేక వ్యాయామాలు చేయడం ద్వారా వచ్చే ఫలితం దక్కుతుందని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు.  మీ బాడీని టోన్ చేయాలన్నా స్కిప్పింగ్ ఒక్కటి చేస్తే చాలని చెబుతున్నారు.. ఇంకా ఏమేం ప్రయోజనాలుంటాయో ఇక్కడ చూడండి.

కేలరీలను బర్న్ చేయవచ్చు

స్కిప్పింగ్ చేస్తుంటే ఒకేసారి శరీరంలోని వివిధ కండరాలు యాక్టివ్ అవుతాయి. కేవలం 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరానికి పూర్తి వ్యాయామం లభించినట్లవుతుంది. దీంతో కేలరీలను కరిగించవచ్చు. అధిక బరువును నియంత్రణలో ఉంచవచ్చు. చేతులు, కాళ్లను టోన్ చేయడానికి స్కిప్పింగ్ ఒక సులభమైన పద్ధతి అంతేకాదు. సిక్స్ ప్యాక్ లాంటివి పొందటానికి జిమ్‌లలో చేయించే క్రంచ్‌లకు సమానంగా ప్రభావం ఉంటుంది. 

ఎముకల దృఢత్వం కోసం

స్కిప్పింగ్ చేయడం వలన ఎమ్ముకల్లో దృఢత్వాన్ని పెంచుతుంది. వయసుతో సంబంధం లేకుండా రోజూ ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే రన్నింగ్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలకంటే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

కండరాలను బలపరుస్తుంది

ప్రతిరోజూ స్కిప్పింగ్ చేస్తూ ఉంటే మీ బరువు నియంత్రణలోకి రావడమే కాకుండా మీరు మీ కాళ్లపై తేలికగా నిలబడిన అనుభూతి కలుగుతుంది. ఇది మీ కాళ్లు, మోకాళ్లు, చీలమండ కీళ్లపై మంచి ప్రభావం చూపడమే కాకుండా కండరాలలో బలాన్ని పెంచుతుంది. ఎలాంటి నొప్పులు, వాపులు రావు. మీకు తెలియకుండానే మీ ఫుట్‌వర్క్‌ మెరుగవుతుంది.

మెదడుకు వ్యాయామం

స్కిప్పింగ్ చేయడం వలన కేవలం శరీరానికి మాత్రమే కాదు మానసిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. స్కిప్పింగ్ చేయడం ద్వారా మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది. మెదడులోని ముఖ్య భాగాలు అభివృద్ధి చెందుతాయి. దీంతో మీ పఠనా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. మంచి మానసిక పరిణితిని సాధించవచ్చు.

మరి ఇన్ని లాభాలున్నప్పుడు ఒక తాడు తీసుకొని కొద్దిసేపు స్కిప్పింగ్ ఎందుకు చేయలేరు? కాబట్టి మీకు సమయం లేదని సాకులు వెతుక్కోకుండా ఒక 5-10 నిమిషాలు స్కిపింగ్ చేయండి.

టాపిక్