Instant Noodles । రెండు నిమిషాల ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటే.. రెండు గాజులు అమ్ముకునే పరిస్థితి!
09 March 2023, 18:50 IST
- Instant Noodles- Disadvantages: ఇన్‌స్టంట్ నూడుల్స్ రుచిగా ఉన్నాయని తరచుగా తింటున్నారా? ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు జాగ్రత్త.
Instant noodles
మీలో చాలా మంది నూడుల్స్ అంటే ఇష్టం ఉండవచ్చు. అందులోనూ కేవలం రెండు నిమిషాల్లోనే సిద్ధం చేసుకోగలిగే ఇన్‌స్టంట్ నూడుల్స్ అంటే మరీ ఇష్టంగా తినవచ్చు. సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ప్రతీసారి డజన్ల కొద్దీ ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తూ ఉండవచ్చు. కానీ, ఈసారి అలా చేయకండి. ఎందుకంటే ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్ మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలను కలిగి ఉండవచ్చు. అయితే ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదని గమనించడం ముఖ్యం. కానీ క్రమం తప్పకుండా వీటిని తినడం వలన మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇన్‌స్టంట్ నూడుల్స్ రుచికరంగా ఉంటాయి, పేరుకు తగినట్లుగా వాటిని తక్షణమే తయారు చేయవచ్చు. కొద్దిగా ఆకలి వేసినపుడు తక్కువ సమయంలో వీటిని చేసుకొని తింటారు. వీటి ధర కూడా తక్కువగానే ఉండటం వలన అన్ని వర్గాల వారు వీటిని విరివిగా కొనుగోలు చేస్తారు. అయితే వీటిని తరచుగా తినడం వలన ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Instant Noodles- Disadvantages:
ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో పోషకాలు తక్కువ, హానికర సమ్మేళనాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తినడం వలన ప్రధానంగా ఎదురయ్యే కొన్ని ఆరోగ్య సమస్యలు ఈ కింద చూడండి.
అధిక సోడియం కంటెంట్: ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును పెంచుతుంది. తద్వారా గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తుంది.
పోషకాలు తక్కువే: ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యానికి సరైన ఆహారం కాదు. తరచుగా తింటే మీ శరీరంలో పోషకాల లోపానికి దారి తీయవచ్చు.
కొవ్వులు అధికం: చాలావరకు ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తక్కువ నాణ్యత గల పామాయిల్ వంటి అనారోగ్యకరమైన కొవ్వులతో తయారు చేస్తారు, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రిజర్వేటివ్‌లు ఎక్కువ: ఇన్‌స్టంట్ నూడుల్స్ సాధారణంగా ప్రిజర్వేటివ్‌లు, ఇతర సంకలితాలతో లోడ్ చేసి ఉంటాయి, వీటిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం.
క్యాన్సర్ కారకాలు ఉండవచ్చు: ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో యాక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఉన్నట్లు కనుగొనడమైనది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఒక కారకం.
మెటబాలిక్ సిండ్రోమ్: కొన్ని అధ్యయనాల ప్రకారంగా, ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తరచుగా తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది, ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసే అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, ఊబకాయం వంటి పరిస్థితులతో ముడిపడి ఉంటుంది.