తెలుగు న్యూస్  /  Lifestyle  /  Saturday Motivation On If You Are Thankful And Grateful Every Morning As You Woke Up

Saturday Motivation : అన్నీ ఉన్నా జీవితంలో సంతోషంగా లేరా? అయితే మీ దగ్గర లేనిది అదే..

21 January 2023, 4:00 IST

    • Saturday Motivation : కొంతమంది ఎంత జీవితంలో ఎంత డబ్బున్నా.. తమ అవసరాలను తీర్చే ఎన్ని వస్తువులు ఉన్నా.. చుట్టూ ఎంతమంది ప్రేమించేవారున్నా.. హ్యాపీగా ఉండలేరు. దానికి కారణం వారు కృతజ్ఞతతో ఉండకపోవడమే. అలా లేకపోవడం వల్ల.. వారికి ఏమి ఉన్నా సంతోషంగా ఉండలేరు. కొందరు తమకి ఏమి లేకపోయినా సంతోషంగా ఉంటారు. అలా ఎలా? ఎందుకు? అనుకుంటున్నారా?
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : జీవితంలో సంతృప్తి అనేది చాలా ముఖ్యమైన విషయం. మన దగ్గర ఏమున్నా.. లేకపోయినా.. మనం ఉన్నవాటితో సంతృప్తి చెందుతున్నామంటే.. మనకి మించిన హ్యాపీ పర్సన్ ఈ లోకంలో ఉండరు. ఇదే నిజం. ఈ సంతృప్తి అనేది లేని రోజు.. నీ దగ్గర ఎంతున్నా.. ఏమున్నా.. నువ్వు కచ్చితంగా సంతోషంగా ఉండలేవు. కొంతమంది డబ్బుతో సంతోషం వస్తుంది అనుకుంటారు. మరికొందరు ప్రేమించేవ్యక్తులు ఉంటే సంతోషంగా ఉంటామనుకుంటారు. ఇలా చెప్పుకుంటే సంతోషాన్ని ఎక్కడెక్కడో వెతుక్కుంటారు కానీ.. తమలోనే దాగి ఉన్న సంతోషాన్ని వెలికి తీయరు.

సంతోషం ఎవరి వల్లనో కాదు.. మనవల్ల మాత్రమే మనకి అది వస్తుంది.. మనతో ఉన్న వాటికి మనం ఎంత కృతజ్ఞతతో ఉంటున్నామో అనే దానిమీదనే సంతోషం ఆధారపడి ఉంది. కొందరు డబ్బు, ఆస్తి, ఆదాయం ఉన్నా సరే సంతోషంగా ఉండరు. తమకు లేనిదానిని ఏదొకటి వెతుక్కుని బాధపడుతూ ఉంటారు. ఉన్నవాటికి మాత్రం కృతజ్ఞతతో ఉండరు. అలాగే మరికొందరు ప్రేమించే వ్యక్తులు పక్కన ఉన్నా సరే.. తమకి ఇంకేదో కావాలి అంటూ.. ఆరాటపడుతూ ఉంటారు. ఎప్పుడైనా మనకున్న వాటితో సంతృప్తి చెందితే.. కచ్చితంగా హ్యాపీగా ఉంటాము. ఈరోజు మన దగ్గరున్నది ఏంటో గుర్తించకపోతే.. అది పోయాక తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది.

మీ దగ్గర ఏమున్నా.. వాటిని ఈరోజే గుర్తించండి. వాటిని కలిగి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. అలాగే.. మీ దగ్గర ఏమి లేకున్నా.. ఎవరు లేకున్నా.. ఉదయం లేవగానే.. ఏదైనా సాధించేందుకు మీకు ప్రాణం ఉంది కాబట్టి.. దానికి థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు నేను నిద్ర లేచాను. అంటే ఈరోజు నేను ఏదైనా సాధిస్తాను లేదా ఏదైనా నేను పొందగలిగేందుకు నాకు ఈరోజు ప్రాణం ఉంది.. నా జీవితంలో ఇంకో రోజు చూడగలిగే భాగ్యం దక్కింది అనుకోండి. ఉన్న ప్రాణంతో ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచించండి. అంతే కానీ ఏమి లేదని బాధపడకండి.

మీ జీవితం పట్ల మీరు కృతజ్ఞతతో, వినయంగా ఉండాలి. లేదంటే మీకు ఎన్ని విలాసాలు ఉన్నప్పటికీ.. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. కాబట్టి మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే.. ఉదయాన్నే నిద్రలేచి.. మీకు జీవితం ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. అలాగే మీకు ఆనందాన్ని అందిస్తున్న వ్యక్తులకు మీరు కృతజ్ఞతతో ఉండాలి. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న అన్నింటికి మీరు కృతజ్ఞతతో ఉండండి. ఇలా ఉండడం వల్ల మీరు కొన్ని శారీరక, మానసిక ప్రయోజనాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా.. మీరు మీ ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవచ్చు. సంతోషంగా ఉండడం అనేది మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేసే చిహ్నం. మీ దగ్గర ఏమున్నా లేకున్నా సంతోషంగా ఉంటే చాలు మీ శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. అది మీరు వారిపై సాధించే విజయం అవుతుంది. ఇలా చేయగలిగితే మీరు లోపల నుంచి సంతోషిస్తారు.