Gratitude | కృతజ్ఞత భావంతో ఉప్పొంగే ఆనందం.. దానిని ఎలా అలవరచుకోవాలి?-how gratitude makes you happier ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How Gratitude Makes You Happier

Gratitude | కృతజ్ఞత భావంతో ఉప్పొంగే ఆనందం.. దానిని ఎలా అలవరచుకోవాలి?

Praveen Kumar Lenkala HT Telugu
Dec 28, 2021 03:19 PM IST

Gratitude | కృతజ్ఞత అనేది ఒక మనిషి అందుకున్న సాయానికి తెలిపే ప్రతిస్పందన. పాజిటివ్ సైకాలజీ రీసెర్చ్‌లో కృతజ్ఞత గొప్ప ఆనందంతో ముడిపడి ఉంటుందని తేలింది. సానుకూల భావోద్వేగాలను అనుభూతి చెందడానికి, మంచి అనుభవాలను ఆస్వాదించడానికి, తద్వారా మానసిక ఆరోగ్యం మెరుగయ్యేందుకు దోహదపడుతుంది.

కృతజ్ఞత భావంతో ఆనందం ఉప్పొంగుతుంది
కృతజ్ఞత భావంతో ఆనందం ఉప్పొంగుతుంది (Photo by Donald Giannatti on Unsplash )

Gratitude.. కృతజ్ఞత‌పై పలు పరిశోధనలు కూడా జరిగాయి. కాలిఫోర్నియా, మియామి విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు ఈ పరిశోధన నిర్వహించారు. ఆ అధ్యయనంలో పాల్గొన్న వారిని ప్రతి రోజూ నిర్ధిష్ట అంశాలపై కొన్ని వాక్యాలు రాయమని సూచించారు. ఆ వారంలో జరిగిన సంఘటనలపై కృతజ్ఞత‌తో ఒక గ్రూపు రాయగా, రెండో గ్రూపు రోజువారీ చికాకులు, అసంతృప్తుల గురించి రాసింది. తమను ప్రభావితం చేసిన సంఘటనల గురించి మూడో గ్రూపు రాసింది.

పది వారాల తరువాత గమనిస్తే కృతజ్ఞత గురించి రాసిన వారు ఎక్కువ సానుకూల వైఖరితో ఉన్నారు. తమ జీవితం గురించి సానుకూల దృక్పథంతో వ్యవహరించారు. జీవన శైలి మెరుగుపరుచుకున్నారు.

తమ భాగస్వామి విషయంలో కృతజ్ఞత చూపే వారు వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడమే కాకుండా, వారి మధ్య ఉన్న బాధలు, అసంతృప్తులు పంచుకునే చొరవ కలిగి ఉన్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే ఒక బృందంలోని ఉద్యోగులు బాగా పనిచేసినప్పుడు ఆ బృంద నాయకుడు కృతజ్ఞత తెలియపరిస్తే ఆ ఉద్యోగులు మరింత కష్టపడేందుకు దోహదపడుతుందని కూడా అధ్యయనాల్లో తేలింది. కృతజ్ఞత అడ్డంకులను ఎదుర్కోవడానికి, బలమైన సంబంధ పునాదులకు తోడ్పడుతుంది.

కృతజ్ఞత ఇలా పెంపొందించుకోవచ్చు..

మీ పిల్లలకు చిన్న చిన్న పనులు పురమాయించినప్పుడు వారు సంతోషంగా చేస్తారు. పని పూర్తయ్యాక వారికి ధన్యవాదాలు తెలిపితే వారిలో ఆనందం వెల్లివిరిస్తుంది. మంచి నీళ్లు తీసుకురమ్మనో లేక ఇంకేదైనా చిన్న పనులతో ప్రారంభించండి. వారి సంతోషాన్ని గుర్తించి, ఆ అనుభూతిని పొందేందుకు మీరూ ఇతరులకు సాయపడండి.

ఇతరుల ద్వారా ఏ సాయం పొందినా ఫోన్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గానీ కృతజ్ఞత తెలపడం ప్రారంభించండి. ప్రతి వారం ఒక పది నిమిషాలు సమయం కేటాయించి ఆ వారంలో మీరు పొందిన సాయం గుర్తుకు తెచ్చుకుని అనుభూతి పొందండి. ధన్యవాదాలు తెలిపే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ప్రకృతికి నేరుగా మనం ధన్యవాదాలు తెలపలేం. మనసులో కృతజ్ఞత చెప్పుకోండి. లేదా ప్రకృతి మరింత బాగుండేలా మీరు సహకరించండి. మొక్క నాటడం ద్వారానో, కాలుష్యం తగ్గించడం ద్వారానో మీ ధన్యవాదాలు తెలపండి.

మిమ్మల్ని ఇంత వారిని చేసిన సమాజానికి కృతజ్ఞత తెలిపే మార్గాలను పరిశీలించండి. మీరు చదువుకున్న బడికో, కళాశాలకో సాయం చేయండి. మీ గ్రామంలో ఉన్న వృద్ధులకు పనికి వచ్చేలా వారికి ఆహారం లేదా బట్టలు సమకూర్చండి. మంచి పని చేసి సమాజానికి కృతజ్ఞత తెలపండి. 

కోవిడ్ సమయంలో మీరు ఎంతో మందికి ఎన్నోసార్లు సహాయం చేసి ఉండవచ్చు. మీరే సహాయం పొంది ఉండవచ్చు. సహాయం పొంది ఉంటే వారికి ధన్యవాదాలు తెలపండి. మీరే సహాయం చేసి ఉంటే దానిని కొనసాగిస్తూ సమాజానికి ధన్యవాదాలు తెలపండి. 

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్