Microplastic Research: ‘ప్లాస్టిక్ అనేది భూతం కాదు. మనమే తప్పుగా వాడుతున్నాం’
22 December 2024, 10:00 IST
మైక్రోప్లాస్టిక్స్ అనే పదం సృష్టించిన రిచర్డ్ థాంప్సన్, ప్లాస్టిక్ ని భూతంలా చూడొద్దని దానిని వినియోగించడం మనకు తెలియడం లేదని అంటున్నారు. అనుకున్న దాని కంటే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని గుర్తు చేస్తున్నారు.
(Photo courtesy University of Plymouth) మైక్రోప్లాస్టిక్స్ కథనం
మైక్రోప్లాస్టిక్స్ అనే పదానికి బీజం వేసిన 'రిచర్డ్ థాంప్సన్' ప్లాస్టిక్‌ను మనమంతా తప్పు భావనతో చూస్తున్నామని అంటున్నారు. 1990వ దశకంలో పీహెచ్‌డీ పరిశోధకుడిగా ఆర్కిటిక్ సముద్ర తీర ప్రాంతాలకు వచ్చాడు. అక్కడ సముద్రంలో నుంచి కొట్టుకువచ్చిన చెత్త నమూనాలను పరిశోధించారు. ఆ తర్వాత రిచర్డ్ థాంప్సన్ 2004లో వేర్ ఈజ్ ద ప్లాస్టిక్ అనే బుక్ రాశాడు. అందులో పేర్కొన్న పదమే మైక్రో ప్లాస్టిక్స్.
అప్పట్లో పాడైపోయిన షూ, చెడిపోయిన టైర్లు, ఫిషింగ్ వల శకలాలు, బాటిల్ క్యాప్స్ లాంటి ప్లాస్టిక్ వస్తువులను సేకరించిన ఆయన ఇన్నేళ్ల తర్వాత మరోసారి అదే తీర ప్రాంతానికి వెళ్లారు. మైక్రో ప్లాస్టిక్స్ అనే పదంతో ప్రమాద ఘంటికలు మోగించిన ఆయన "ఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలే అత్యంత సమృద్ధిగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాను" అని ఇన్నేళ్ల తర్వాత వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటీష్ సముద్ర జీవశాస్త్రవేత్తగా ఉన్న ఆయన ప్లైమౌత్ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ మెరైన్ లిట్టర్ రీసెర్చ్ యూనిట్ కు నేతృత్వం వహిస్తున్నారు.
వీరంతా కలిసి చేసిన రీసెర్చ్ గురించి గత సెప్టెంబర్‌లో సైన్స్ జర్నల్లో ఒక జర్నల్ ప్రచురితమైంది. "ఇరవై సంవత్సరాల మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ రీసెర్చ్ - దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము" అనే శీర్షికతో ఉన్న ఫాలో-అప్ పత్రమది. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి:
థాంప్సన్ తాత గారి పుస్తకం:
ప్లాస్టిక్ భవిష్యత్తును అంచనా వేస్తూ 1937లో ప్రచురితమైన మా తాతగారి పుస్తకం నా దగ్గర ఉంది. అప్పట్లో కేవలం లైట్ స్విచ్లు, డోర్ హ్యాండిల్స్, విండో ఫ్రేమ్స్ వంటి ఖరీదైన వస్తువుల కోసమే ప్లాస్టిక్‌ను వినియోగించేవారట. అప్పట్లో ఊహించని విషయమేమిటంటే వాడేసిన తర్వాత వ్యర్థంగా మిగిలిపోయే పదార్థం ప్లాస్టిక్ అని తెలుసుకోలేకపోవడం.
ప్లాస్టిక్ వాడకం మొదలైంది అప్పుడే:
అంత మన్నికైన ప్లాస్టిక్‌ను 1950వ దశకంలో తక్కువ ధరలోనే భారీగా ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దాంతో అసలు సవాలు మొదలైంది. అకస్మాత్తుగా, మన చరిత్రలో మొదటిసారిగా, సింగిల్-యూజ్, డిస్పోజబుల్ వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. రాతియుగం నుండి ఉపయోగకరమైన, ఎక్కువ కాలం నిలిచిపోయే వస్తువులు తయారుచేసుకుంటూ వచ్చేవాళ్లం ఉన్నట్టుండి తక్కువ ధరకు వచ్చే ప్లాస్టిక్ కు అలవాటు పడ్డాం. పర్యావరణానికి గణనీయమైన హాని గురించి తెలిసినప్పటికీ వాడి పారేస్తున్నాం. ఇది హానికరమేనని తెలిసినా వినియోగాన్ని పెంచుతూనే ఉన్నాం. ఉత్పత్తిని పెంచుతూ అత్యవసరత లేని వస్తువుల కోసం కూడా ప్లాస్టిక్ నే వాడుతున్నాం.
మైక్రోప్లాస్టిక్స్ గా మారేందుకు సమయం:
వాతావరణంలో ఇంకిపోయి మైక్రోప్లాస్టిక్స్‌గా మారిపోవడానికి ఆయా పదార్థాలను బట్టి సమయం ఆధారపడి ఉంటుంది. 2004లో నేను పుస్తకం రాసిన సమయంలో ఒక విద్యార్థి నన్ను ప్రశ్నించింది. మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లు తీర ప్రాంత జంతువుల్లో కూడా ఉండాలి కదా అని ఆమె అడిగిన ప్రశ్నను బలపరిచే విధంగా అతను 2013లో రాసిన జర్నల్ ప్రచురితమైంది. 500 చేపలపై జరిపిన పరీక్షలో మూడింట ఒక వంతులో ప్లాస్టిక్ ఉన్నట్లు కనుగొన్నాం.
వాడకాన్ని తగ్గించాలి:
వాతావరణంలో ఇంకిపోయి ఉన్న ప్లాస్టిక్ ను తొలగించాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. మనం నిర్మూలించడానికి వెచ్చించే ఖర్చు మొత్తం వృథా అవుతుంది. పైగా మనం ఊహించిన దాని కంటే వేగంగా ప్లాస్టిక్ వాతావరణంలోకి ఇంకిపోతుంది. దీని కోసం మనం చేయాల్సిందల్లా బాధ్యతగా వ్యవహరిస్తూ అవసరమైన మేరకే ప్లాస్టిక్ వినియోగించాలి. కార్లు, విమానాల్లో ప్లాస్టిక్ వాడకాలను తగ్గించడం వల్ల ఇందన వాడకంతో పాటు, కార్బన్ వ్యర్థాలు కూడా తగ్గిపోతాయి" అని రిచర్డ్ థాంప్సన్ పేర్కొన్నారు.
టాపిక్