Shocking survey: పెద్ద బ్రాండ్ల చక్కెర, ఉప్పులోనూ మైక్రో ప్లాస్టిక్స్..ఆ ఉప్పు, చక్కెరల్లోనే కల్తీ తక్కువ-latest survey says all salts and sugar brands have micro plastics see alternatives ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shocking Survey: పెద్ద బ్రాండ్ల చక్కెర, ఉప్పులోనూ మైక్రో ప్లాస్టిక్స్..ఆ ఉప్పు, చక్కెరల్లోనే కల్తీ తక్కువ

Shocking survey: పెద్ద బ్రాండ్ల చక్కెర, ఉప్పులోనూ మైక్రో ప్లాస్టిక్స్..ఆ ఉప్పు, చక్కెరల్లోనే కల్తీ తక్కువ

Koutik Pranaya Sree HT Telugu
Aug 16, 2024 12:30 PM IST

Shocking survey: తాజాగా చేసిన ఒక అధ్యయనంలో చిన్న బ్రాండ్ల నుంచి పెద్ద బ్లాండ్ల ఉప్పు, పంచదారల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏమిటి? వీటి ప్రభావం ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది? ఈ కల్తీ నుంచి తప్పించుకోడానికి మనమెలాంటి మార్పులు చేసుకోవచ్చో వివరంగా తెల్సుకోండి.

ఉప్పు, పంచదారల్లో మైక్రో ప్లాస్టిక్స్
ఉప్పు, పంచదారల్లో మైక్రో ప్లాస్టిక్స్

ఉప్పు, చక్కెరలు మన రోజువారీ ఆహార వినియోగంలో చాలా ముఖ్యమైన పదార్థాలు. వంటకాల రుచిని ప్రభావితం చేయడంలో ఇవి కీలక పదార్థాలు. రుచికోసం వాడే ఈ రెండూ ఇప్పుడు మన అనారోగ్యానికి కారకాలు కావచ్చు. తాజా అధ్యయనం ప్రకారం, అన్ని భారతీయ చక్కెర, ఉప్పు బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని వెళ్లడైంది. ఇది శరీర పనితీరుకు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి.

ప్రతి ఉప్పు, పంచదార శ్యాంపుల్స్‌లో మైక్రో ప్లాస్టిక్లు ఉన్నట్లు ఈ పరిశోధనలో తెలిసింది. వివిధ ఆకారాల్లో, ఫైబర్ల లాగా, చిన్న ముక్కల్లాగా వివిధ సైజుల్లో, రూపాల్లో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. వాటి పరిమాణం 0.1 నుంచి 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంది. అంటే ఇవి కంటితో గుర్తించడం దాదాపు అసాధ్యమే. ఉప్పు, చక్కెరలో గుర్తు పట్టలేనంతగా కలిసిపోతాయివి. అన్నింటికన్నా ఎక్కువ కల్తీ జరుగుతున్న అయోడైజ్డ్ సాల్ట్‌లో ప్రతి కేజీకి 89.15 సరాసరిగా మైక్రోప్లాస్టిక్ ముక్కలుండగా, ఆర్గానిక్ రాళ్లుప్పులో కేజీకి 6.70 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి.

మైక్రోప్లాస్టిక్స్:

మైక్రోప్లాస్టిక్స్ అనేవి అతి చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి పెద్ద పెద్ద బ్రాండ్ల నుంచి చిన్న బ్లాండ్ల ఉప్పు, చక్కెరల్లో కనిపించాయి. ఎన్విరాన్‌మెంటర్ రీసర్చ్ ఆర్గనైజేషన్ చేసిన పరిశోధనలో ఈ విషయాలు బయటికొచ్చాయి. ఇవి దీర్ఘకాలికంగా అనేక ప్రమాదకరమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తాయి.

ఈ ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి చేరితే..

పిఎస్ఆర్ఐ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ హేమాటో-ఆంకాలజీ డాక్టర్ అమిత్ ఉపాధ్యాయ, మైక్రోప్లాస్టిక్స్ జీర్ణవ్యవస్థకు, జీవక్రియకు హాని కలిగించే మార్గాలపై కొన్ని విషయాలు పంచుకున్నారు. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పేగు లోపల చిక్కుకుంటాయి. అవి ఆ ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తాయి. ప్రేగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను నశింపజేసి హానికరమైన బ్యాక్టీరియాతో భర్తీ చేస్తాయి. ఇది జీర్ణ సమస్యలు, క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది అన్నారు.

మైక్రోప్లాస్టిక్స్ కాలక్రమేణా శరీరం లోపల పేరుకుపోతాయి. సహజ విసర్జనకు మార్గం లేకపోవడమే దానికి కారణం. దీంతో రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మరిన్ని జీవక్రియ సమస్యలు, గుండెపోటు, పెరుగుదలలో లోపం లాంటి సమస్యలకు దారితీస్తాయి. నిరంతరంగా ఇవి శరీరంలోకి చేరితే జీర్ణ సమస్యలు రావడం, పోషకాల శోషణ జరక్కపోవడం, పేగు ఆరోగ్యం దెబ్బతినడం లాంటి సమస్యలొస్తాయి. దాంతో అధిక బరువు, డయాబెటిస్ వ్యాధులూ రావచ్చు.

చిన్న పిల్లల్లో తీవ్ర ప్రభావం:

చిన్న వయస్సులోనే మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరడం వల్ల బలహీనమైన అభిజ్ఞా సమస్యలు, మెదడు అభివృద్ధి లోపం, న్యూరోటాక్సిసిటీలకు దారితీస్తుంది. పెరుగుదల ప్రారంభ దశల్లోనే రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో మైక్రోప్లాస్టిక్స్ అధికంగా తీసుకోవడం ప్రవర్తనా తీరులో సమస్యలు, ఎదుగుదల లోపాలకు దారి తీయొచ్చు. గర్భిణీ స్త్రీల విషయంలో, మైక్రోప్లాస్టిక్ కణాలు మావి లోపలకు చేరి ఇరుక్కుపోవడం వల్ల పిండం ఎదుగుదల మీదా ప్రభావం ఉంటుంది.

గాజు జాడీల వాడకం
గాజు జాడీల వాడకం

మనమేం చేయొచ్చు?

“ప్లాస్టిక్ డబ్బాల వాడకం పూర్తిగా తగ్గించేయాలి. బదులుగా మెటల్, గ్లాసుతో చేసిన జాడీలు వాడాలి. దీంతో మైక్రో ప్లాస్టిక్స్ చేరకుండా కాస్తైనా తగ్గించొచ్చు. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులు మానేయాలి." అని డాక్టర్ నాన్సీ నాగ్‌పాల్ సూచించారు.

ఫ్లేవర్ కోసం మూలికలు వాడటం
ఫ్లేవర్ కోసం మూలికలు వాడటం

ఈ ఉప్పు, చక్కెర వాడితే సురక్షితం:

ఉప్పు, పంచదారను ఆహారం రుచిని పెంచడానికి వాడతాం. అయితే వీటికి బదులుగా తులసి పొడి, ఆరిగానో, ఆనియన్ పౌడర్, జీలకర్ర పొడి, కొత్తిమీర, పార్స్‌లీ లాంటి రుచిని పెంచే మూలికల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. దీంతో రుచి చాలా పెరుగుతుంది. అలాగే రాక్ సాల్ట్ లేదా రాళ్లుప్పు తయారీకి తక్కువ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇవి కల్తీ జరిగే అవకాశాలు తక్కువుంటాయి. అందుకే ఈ ఉప్పును ఎంచుకోవడం శ్రేయస్కరం. ఆర్గానిక్ పంచదార, ముడి చక్కెరలు లేదా కేన్ షుగర్ లేదా టర్బినాడో షుగర్ వాడటం మంచిది. ఇది చూడ్డానికి కాస్త గోధుమ రంగులో ఉంటుంది. మామూలు పంచదార లాగే చిన్న స్ఫటికాలతో ఉంటుంది. అలాగే ఖర్జూరం పేస్ట్, కోకోనట్ షుగర్, మాపుల్ సిరప్, తేనెను తీపి కోసం వాడొచ్చు

టాపిక్