Pregnancy Skincare । గర్భిణీ స్త్రీలు నివారించాల్సిన కొన్ని కాస్మెటిక్స్ ఏవో చూడండి!
06 May 2023, 16:57 IST
- Pregnancy Skincare: గర్భిణీ స్త్రీలు తమ చర్మ సంరక్షణ కోసం కొన్ని రకాల కాస్మెటిక్స్ వాడటం మంచిది కాదు. అవి ఎలాంటివో ఇక్కడ తెలుసుకోండి.
safe skin care during pregnancy
Pregnancy Skincare: వివాహం అనేది ఒక స్త్రీ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం అయితే, ఆ తర్వాత గర్భందాల్చడం అనేది ఆమెకు, వారి కుటుంబానికి మరింత సంతోషాన్ని పంచే క్షణం. తొలిసారి మాతృత్వాన్ని అందుకునే స్త్రీలలో ఉత్సాహం, ఆనందం, నిరీక్షణ, ఆందోళన ఇలా అనేక రకాల భావోద్వేగాలు కలుగుతాయి. మరోవైపు గర్భధారణ తర్వాత ఆ స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది, ఈ క్రమంలో వివిధ అనారోగ్య సమస్యలు సహజంగా తలెత్తుతాయి. ఇవికాకుండా చర్మ సమస్యలు కూడా ఉంటాయి. చర్మం సాగుతున్నకొద్దీ దురద, చర్మంపై చారలు మొదలైనవి ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారు ఉపశమనం కోసం ఇంట్లో వాడే పౌడర్లు, క్రీములు, నూనెలు, ఇతర కాస్మోటిక్స్, హోమ్ రెమెడీస్ ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. కానీ, కొన్నిసార్లు వీటిని ఉపయోగించటం కూడా మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఉండే రసాయనాలు శిశువు ఆరోగ్యానికి హానికలిగించవచ్చు.
గర్భిణీస్త్రీలు తమ ఆరోగ్యంతో పాటు తమ కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యంపైనా దృష్టిపెట్టడం ముఖ్యం. కాబట్టి గర్భంతో ఉన్న స్త్రీలు ఎప్పుడూ వైద్యులు సూచించిన ఉత్పత్తులు, ఔషధాలు మాత్రమే వాడాలి. మీరు ఇంట్లో ఏవైనా ఉత్పత్తులు వాడుతుంటే అందులో రసాయన సమ్మేళనాలు లేనివి ఉపయోగించండి. ఇక్కడ కొన్ని రసాయన ఉత్పత్తుల గురించి వివరిస్తున్నాం. మీరు వాడే ఉత్పత్తుల తయారీలో వీటి వినియోగం లేదని నిర్ధారించుకోండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదవండి.
రెటినోయిడ్స్
ట్రెటినోయిన్, ఐసోట్రిటినోయిన్ వంటి రెటినాయిడ్స్ మొటిమలు, ముడతలు, హైపర్పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. కానీ ఇవి కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే గర్భధారణ సమయంలో వీటితో తయారైన ఉత్పత్తుల వాడకాన్ని నిలిపివేయడం మంచిది. మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలోనూ రెటినాయిడ్స్ వాడకంపై వైద్యుడి సలహా తీసుకోండి.
సాలిసిలిక్ ఆమ్లము
సాలిసిలిక్ యాసిడ్ అనేది బీటా-హైడ్రాక్సీ యాసిడ్ (BHA), ఇది సాధారణంగా మొటిమల చికిత్సకు, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. తక్కువ మోతాదులో ఉపయోగించడం సురక్షితమని భావించినప్పటికీ, గర్భధారణ సమయంలో దీనిని ఉపయోగించినప్పుడు జాగ్రత్త వహించాలి. ఎక్కువ సాలిసిలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల పిండం దెబ్బతింటుంది. అలాగే, ఇది ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది.
హైడ్రోక్వినోన్
హైడ్రోక్వినోన్ అనేది చర్మాన్ని కాంతివంతం చేసే ఏజెంట్, దీనిని సాధారణంగా హైపర్‌పిగ్మెంటేషన్ చికిత్సకు ఉపయోగిస్తారు. దీని ఉపయోగం గర్భధారణ సమయంలో పిండం వైకల్యం, న్యూరోటాక్సిసిటీ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో హైడ్రోక్వినోన్ వాడకుండా ఉండటం మంచిది.
ఎసెన్షియల్ ఆయిల్స్
ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి పరిమళభరితమైన మూలికల నుంచి తయారు చేస్తారు. వీటిని సాధారణంగా అరోమాథెరపీ , చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. వీటితో పలు రకాల ప్రయోజనాలునప్పటికీ, గర్భిణీ స్త్రీలకు లేదా పుట్టబోయే బిడ్డలకు ఇవి సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా టీ ట్రీ ఆయిల్, క్లారీ సేజ్ ఆయిల్ వంటివి హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి. కాబట్టి గర్భధారణ సమయంలో వాడకూడదు.
కొన్ని సన్‌స్క్రీన్ లోషన్లు
ఆక్సిబెంజోన్ , ఆక్టినోక్సేట్ వంటి రసాయనాలతో కూడిన సన్‌స్క్రీన్‌లు UV కిరణాలను గ్రహించి చర్య చేస్తాయి. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో ఇవి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాల ప్రకారం ఇవి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తేలింది.
మొటిమల మందులు
అక్యుటేన్ వంటి మొటిమల చికిత్సకు ఉపయోగించే మందులు పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి. మీరు గర్భవతి కావాలని ప్లాన్ చేస్తున్నట్లయితే వీటిని ఉపయోగించకపోవడమే మంచిది.
టాపిక్