పని పూర్తవగానే పడుకోకండి, కలయిక తర్వాత పరిశుభ్రత ముఖ్యం!
13 August 2024, 7:58 IST
- కలయిక తర్వాత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎందుకో తెలుసుకోండి, ఎలాంటి పరిశుభ్రత చర్యలు తీసుకోవాలో చూడండి.
కలయిక తరువాత ఏం చేయాలి
మనసులు ఏకమైన తర్వాత కలిసిన తనువులతో ముద్దుముచ్చట్లు ఆడటం, శృంగార రసాలను ఆస్వాదించడం బాగానే ఉంటుంది. రతి క్రీడలో లాలాజలం మార్పిడి, ఆవిరితో తనువుల నుంచి జాలువారే చెమటలు, ఇలా ఒక్క కలయికతో ఇరువురి శరీరాల్లో కలిసిపోయే అనేక శరీర ద్రవాలు గజిబిజి అందరగోళాన్ని కలిగించవచ్చు. అందుకే కలయిక తర్వాత శారీరక పరిశుభ్రత చాలా ముఖ్యం.
చాలా మంది జంటలు పని పూర్తవగానే చెరో పక్క తిరిగి పడుకుంటారు. కానీ శృంగారం తర్వాత శుభ్రత పాటించకుంటే అది ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. అయితే సెక్స్ తర్వాత వెంటనే బాత్ రూంలకు వెళ్లి స్నానం చేయాలని కాదు, కాకపోతే జననావయవాలను శుభ్రం చేసుకుంటే మూత్ర నాళం (UTIలు) ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, కొన్ని రకాల లైంగిక సంక్రమణల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి.
Post-Sex Hygiene- కలయిక తర్వాత పరిశుభ్రత
శృంగారానంతర పరిశుభ్రత మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీకు మంచి నిద్రను కలిగిస్తుంది. కలయిక తర్వాత ఎలాంటి పరిశుభ్రత చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయండి
సెక్స్ సమయంలో, బ్యాక్టీరియా మీ మూత్రనాళంలోకి ప్రవేశించవచ్చు, ఇది మీ శరీరం నుండి మూత్రాన్ని బయటకు తీసుకువెళుతుంది. ఇది మీ మూత్రనాళ సంక్రమణ అవకాశాలను పెంచుతుంది. అయితే మీరు మూత్ర విసర్జన చేయడం ద్వారా జననావయవాల ద్వారా మార్పిడి జరిగిన క్రిములను బయటకు పంపివేయడం జరుగుతుంది. గర్భం కోసం ప్లాన్ చేస్తున్న వారు సెక్స్ తర్వాత మూత్రం పోయడం ద్వారా గర్భం రాదు అని అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే స్త్రీ ఒక పది నిమిషాలు అయ్యాక మూత్ర విసర్జన చేసి యోని భాగాన్ని శుభ్రపరుచుకోవాల్సిందిగా కొంతమంది వైద్యులు సూచిస్తారు.
ఒక గ్లాసు నీరు త్రాగండి
కలయిక తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగటం మర్చిపోవద్దు. శృంగారం అనంతరం మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యకరం అని చెప్పుకున్నాం. కాబట్టి నీరు తాగి హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు, మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారు, తద్వారా మీ శరీరం నుండి ఎక్కువ బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.
సన్నిహిత ప్రాంతాలను శుభ్రపరచండి
శారీరకంగా కలిసిన తర్వాత స్త్రీపురుషులు ఇరువురు తమ సన్నిహిత ప్రాంతాలను శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు షాంపూలు, సబ్బులు ఎలాంటివి అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన నీరు, తేలికపాటి సబ్బు మాత్రమే అవసరం. సువాసనలు కలిగినవి ఏవీ ఉపయోగించవద్దు. ఇవి అలర్జీలను కలిగిస్తాయి. ఇక స్త్రీలు తమ యోనిని శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఉత్పత్తులు వాడనవసరం లేదు. యోని స్వీయశుభ్రత కలిగిన అవయవం కాబట్టి దానంతటదే ఆ భాగాన్ని పరిశుభ్రం చేసుకుంటుంది, కేవలం కాస్త నీరు ఉపయోగిస్తే చాలు.
అలాగే చాలా మందికి ఎదురయ్యే సందేహం, గర్భధారణ సమయంలో సెక్స్ సురక్షితమేనా అని. సాధారణంగా సురక్షితమే, కానీ ఈ సమయంలో స్త్రీలు UTIల వంటి ఇన్ఫెక్షన్‌లను పొందే అవకాశం ఉంది. కాబట్టి సెక్స్ తర్వాత ప్రాథమిక విషయాలపై శ్రద్ధ వహించడం మరింత ముఖ్యం. కలయిక తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయండి, మీ యోని భాగాన్ని కడుక్కోండి , నీరు త్రాగండి. మీ భాగస్వామిని కూడా పరిశుభ్రంగా ఉండమని ప్రోత్సహించండి.
హ్యాండ్ వాష్- మౌత్ వాష్
శృంగారంలో మీ భాగస్వామి జననాంగాలను తాకడం చేయవచ్చు. కాబట్టి సన్నిహితంగా ఉన్న తర్వాత, చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. గోరువెచ్చని నీరు, సబ్బు సహాయంతో చేతులు బాగా కడగాలి. తద్వారా బ్యాక్టీరియా ఉండదు. అలాగే మీ భాగస్వామిని నోటితో సంతృప్తి పరిచినట్లయితే అనంతరం నోటి శుభ్రత చాలా ముఖ్యం. దీని కోసం మౌత్ వాష్ ఉపయోగించండి. అలాగే బ్రష్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే, బ్యాక్టీరియా శరీరం అంతటా వ్యాపిస్తుంది.
వదులుగా ఉండే దుస్తులు ధరించండి
వేడి, చెమటతో కూడిన శరీర భాగాలు బ్యాక్టీరియా, ఈస్ట్ వృద్ధి చెందడానికి కారణం అవుతాయి. కాబట్టి లోదుస్తులు, గాలి ప్రసరణ సరిగ్గా జరిగే దుస్తులను ధరించండి. మహిళలు ప్యాంటీహోస్, గిర్డిల్స్, ప్యాంటీలకు దూరంగా ఉండాలి. కాటన్ అండర్ గార్మెంట్స్ ఇద్దరికి బాగా పని చేస్తాయి, అవి గాలి ప్రసరణ చేసి, తేమను గ్రహిస్తాయి. లేదా మీరు పడుకునేటప్పుడు లోదుస్తులను వేసుకోవడం మానేయండి.
కాబట్టి, భాగస్వాములు ఇద్దరూ కూడా కలయిక తర్వాత పరిశుభ్రత పాటించండి. ఆరోగ్యకరమైన శృంగారాన్ని ఆస్వాదించండి.