Peethala Pulusu: ఆంధ్రా స్టైల్‌లో ఇలా పీతల పులుసు పెట్టి చూడండి, వేడి వేడి అన్నంలో పులుసు కలుపుకొని తింటే రుచి అదిరిపోతు
23 May 2024, 18:00 IST
- Peethala Pulusu: చాలామంది పీతలను చూసి భయపడి పోతారు. కానీ వాటిని వండితే రుచి మాములుగా ఉండదు. ఆంధ్రా స్టైల్ లో పీతల పులుసు రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
పీతల పులుసు రెసిపీ
Peethala Pulusu: చేపలు, రొయ్యల్లాగే పీతలను కూడా టేస్టీగా వండుకోవచ్చు. పీతలతో చేసే పులుసు అదిరిపోతుంది. పీతల పైన డొల్లను పగలగొట్టి లోపల ఉన్న మాంసాన్ని తింటారు. చేపలతో పోలిస్తే పీతలే రుచిగా ఉంటాయి. ఆంధ్ర స్టైల్‌లో పీతల పులుసు పెట్టి చూడండి. ప్రతి ఒక్కరికీ నచ్చడం ఖాయం. దీన్ని చేయడం చాలా సులువు. వేడివేడి అన్నంలో ఈ పీతల పులుసును వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది.
పీతల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
పీతలు - కిలో
చింతపండు - నిమ్మకాయ సైజులో
కరివేపాకులు - గుప్పెడు
గరం మసాలా - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూన్
జీలకర్ర పొడి - అర స్పూను
నీళ్లు - సరిపడినంత
టమోటా - ఒకటి
మెంతులు - పావు స్పూను
నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
నూనె - మూడు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
పీతల పులుసు రెసిపీ
1. పీతలను ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పీతలను అందరూ శుభ్రం చేయలేరు.
2. కాబట్టి కొన్న చోటే వాటిని శుభ్రంగా చేసి తెచ్చుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, మెంతులు వేసి వేయించుకోవాలి.
5. ఇవి బాగా వేగాక టమాటాలను సన్నగా తరిగి వేయాలి.
6. కాస్త ఉప్పు వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి.
7. ఇవి ఇగురు లాగా మెత్తగా మగ్గాక అందులో పీతలు వేయాలి.
8. పైన మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
9. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
10. తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
11. చింతపండు నీటిలో వేసి కాసేపు నానబెట్టాలి. మూత తీసి ఈ చింతపండు పులుసును కూడా వేసి బాగా కలపాలి.
12. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి.
13. పులుసు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసుకోవచ్చు.
14. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి.
15. నూనె పైకి తేలితే పీతలు మెత్తగా ఉడికినట్టే.
16. స్టవ్ కట్టేసి పైన కొత్తిమీరను చల్లుకోవాలి. అంతే వేడి వేడి పీతల పులుసు రెడీ అయినట్టే. దీన్ని అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది.
చేపల కూర, రొయ్యల్లాగే పీతలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. పీత మాంసంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన దంతాలకు, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే సెలీనియం ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి, థైరాయిడ్ పనితీరుకి ఇది చాలా ముఖ్యం. పీతలను అధికంగా తింటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి మెరుగుపడుతుంది. దీనివల్ల ఎనీమియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పీతలను దొరకడం కష్టమే, కాబట్టి దొరికినప్పుడైనా వీటిని తినడం అలవాటు చేసుకోవాలి.
టాపిక్