తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

03 May 2024, 11:39 IST

google News
    • Moongdal Curry: పొట్టు పెసరపప్పుని నానబెట్టుకొని మొలకలు వచ్చాక తింటారు. ఆ పొట్టు తీయని పెసరపప్పును కూరగా కూడా వండుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి వండి చూడండి.
పొట్టు పెసరపప్పు కర్రీ
పొట్టు పెసరపప్పు కర్రీ

పొట్టు పెసరపప్పు కర్రీ

Moongdal Curry: పొట్టు తీయని పెసరపప్పును రాత్రంతా నానబెట్టుకొని మొలకలు వచ్చాక తింటూ ఉంటారు. అలాగే పెసలతో దోశలు కూడా వేసుకుంటారు. నిజానికి పొట్టు తీయని పెసలతో చేసే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పులో ఎన్ని పోషకాలు ఉంటాయో... పెసర పొట్టులో కూడా అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పొట్టు ఉన్న పెసరపప్పు ఒకటి. ఇక్కడ పొట్టుతీయని పెసరపప్పుతో కూర ఎలా వండుకోవాలో చెప్పాము. ఇలా ఫాలో అయితే మీకు టేస్టీ కూర రెడీ అయిపోతుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా హైబీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు పెసలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మధుమేహంతో బాధపడే వారు కూడా పెసలతో వండిన కూరలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మొలకొచ్చిన పెసరపప్పు తినడం ఎంత ఆరోగ్యమో, వాటితో వండిన కూర తినడం కూడా అంతే ఆరోగ్యం. పొట్టుతీయని పెసరపప్పుతో కూర ఎలా వండాలో కింద రెసిపీ ఇచ్చాము .ఒకసారి ప్రయత్నించి చూడండి.

పొట్టు పెసరపప్పు కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసరపప్పు - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

ఆవాలు - అర స్పూను

పచ్చిమిర్చి - నాలుగు

టమాటాలు - రెండు

నూనె - సరిపడినంత

జీలకర్ర - ఒక స్పూను

ఎండుమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

మినపప్పు - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - ఒక స్పూను

పొట్టు పెసరపప్పు రెసిపీ

1. పెసరపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

2. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఈ పెసరపప్పును మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకొని ఆ పేస్టును పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

5. తరువాత ఎండు మిర్చి, కరివేపాకులు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.

6. సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి.

7. అవి రంగు మారేవరకు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.

8. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

9. కాస్త నీళ్లు వేస్తే అది ఇగురులాగా అవుతుంది.

10. ఇప్పుడు ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకున్న టమోటా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

11. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

12. పైన మూత పెట్టి మంట చిన్నగా పెడితే అది ఇగురు లాగా అవుతుంది.

13. టమాటా ఇగురు లాగా అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అందులో వేసి బాగా కలపాలి.

14. తర్వాత గరం మసాలాను కూడా వేసుకోవాలి.

15. ఒక గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టి పావుగంట ఉడికించుకోవాలి.

16. ఆ తర్వాత మూత తీసి ఒక స్పూను నెయ్యిని కూర అంతా చల్లుకోవాలి.

17. తరిగిన కొత్తిమీరను జల్లుకోవాలి. స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ పెసరపప్పు కూర రెడీ అయినట్టే.

18. ఇది అన్నంలోకే కాదు, దోశ, చపాతీ, రోటీ ఇలా ఎందులో తిన్నా టేస్టీగా ఉంటుంది.

19. ఒక్కసారి మీరు చేసుకుని చూడండి. మీ ఇంటిళ్లపాదికి నచ్చుతుంది.

పొట్టు తీయని పెసరపప్పు మార్కెట్లో లభిస్తుంది. దీంతో రుచికరమైన ఆహారాలను వండుకోవచ్చు. పొట్టులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాటిని తినాలి.

టాపిక్

తదుపరి వ్యాసం