Masala Dal Recipe: మసాలా పప్పు ఇలా చేశారంటే ఇడ్లీ, చపాతీ, పూరీ, అన్నం... అన్నింట్లోకి అదిరిపోతుంది
Masala Dal Recipe: ఎప్పుడూ పప్పును చప్పగా ఒకేలా చేయకండి. ఓసారి మసాలా పప్పు చేసి చూడండి. ఇది అన్నంతోనే కాదు, అన్ని రకాల టిఫిన్లతోనూ టేస్టీగా ఉంటుంది.
Masala Dal Recipe: పప్పు అనగానే అందరికీ గుర్తొచ్చేది టమాటో పప్పు, ముద్దపప్పు, పప్పు పాలకూర... ఇలాంటి కాంబినేషన్లే. ఒకసారి మసాలా పప్పు చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. కేవలం వేడి వేడి అన్నంలోనే కాదు, చపాతీ పూరీ, ఇడ్లీ, దోశ... ఇలా దేనితో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. పప్పులో ప్రోటీన్లు కూడా ఎక్కువే. కాబట్టి ఉదయాన బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ చేసుకొని ఈ పప్పును వండుకొని తింటే ఆ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈ మసాలా పప్పును చేయడం చాలా సులువు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
మసాలా పప్పు రెసిపీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు పొడి - పావు స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
నూనె - ఒక స్పూను
నీళ్లు - తగినన్ని
మసాలా పప్పు రెసిపీ
1. సాధారణ పప్పుకు ముందుగా కందిపప్పును ఉడకబెడతాం. ఈ మసాలా పప్పు కూడా అంతే.
2. ముందుగా కందిపప్పును మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
3. ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. సన్నగా తరిగిన ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా వేయించాలి.
5. అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
6. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
7. ఈ మిశ్రమంలో పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
8. తర్వాత ముందుగా ఉడకబెట్టిన పప్పును వేసి బాగా కలుపుకోవాలి.
9. ఈ పప్పు మరీ నీళ్ళల్లా చేస్తే టేస్టీగా ఉండదు. అలా అని మరీ గట్టిగా వచ్చినా కూడా బాగోదు.
10. కాబట్టి మరీ గట్టిగా కాకుండా, అలా అని సాంబార్‌లా కాకుండా మధ్యస్థంగా ఉండేలా నీరు పోసుకోవాలి.
11. పైన గరం మసాలా చల్లుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే మసాలా పప్పు రెడీ అయినట్టే. ఇది పిల్లలకు ,పెద్దలకు బాగా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకొని తింటారు.
మసాలా పప్పులో మనం అన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే వాడాము. కందిపప్పు, గరం మసాలాలోని మసాలా దినుసులు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఈ మసాలా పప్పును అన్నంతో తిన్నా... ఇడ్లీతో తిన్నా, దోశతో తిన్నా, చపాతీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడానికి పెద్ద సమయం పట్టదు. పప్పు ఉడకపెట్టుకుంటే చాలు. మరొక పది నిమిషాల్లో ఈ మసాలా పప్పు రెడీ అయిపోతుంది.
పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేసుకుని చూడండి. మీకు అందరికీ నచ్చడం ఖాయం. కందిపప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో ఈ మసాలా పప్పును భాగం చేసుకుంటే ఆ రోజంతా మీరు ఉత్సాహంగా, చురుగ్గా గడుస్తుంది. శక్తి హీనంగా ఎప్పుడూ అనిపించదు. రెండు గుడ్లు తింటే ఎంత బలమో ఈ మసాలా పప్పును బ్రేక్ ఫాస్ట్‌లో తినడం కూడా అంతే బలం.
టాపిక్