Miriyala Pulusu: మిరియాల పులుసు రెసిపీ, శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన వంటకం రెసిపీ ఇదిగోండి
18 November 2024, 15:30 IST
- Miriyala Pulusu: శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మిరియాలతో చేసిన వంటకాలను అప్పుడప్పుడు తినాలి. ఇక్కడ మేము మిరియాల పులుసు రెసిపీని ఇచ్చాము.
మిరియాల పులుసు రెసిపీ
మిరియాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. చలికాలంలో మన రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. కాబట్టి మిరియాల పులుసును ఒకసారి చేసుకుని చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ప్రతి వారం రెండు మూడు సార్లు ఇలా మిరియాల పులుసును చేసుకొని తినడం వల్ల చలికాలంలో జ్వరం, ఫ్లూ వంటివి త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే నిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది. ఈ మిరియాల పులుసు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మిరియాల పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
మిరియాలు - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
కొబ్బరి తురుము - పావుకప్పు
ఎండుమిర్చి - ఎనిమిది
బియ్యం - ఒక స్పూను
మెంతులు - పావు స్పూను
పచ్చి శనగపప్పు - ఒక స్పూను
ధనియాలు - ఒకటిన్నర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
టమోటోలు - రెండు
చింతపండు పులుసు - ఒక కప్పు
నీరు - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి - పది రెబ్బలు
చిన్న ఉల్లిపాయలు - ఆరు
ఇంగువ - చిటికెడు
ఆవాలు - ఒక స్పూను
నూనె - మూడు స్పూన్లు
మిరియాల పులుసు రెసిపీ
1. మిరియాల పులుసు చేసేందుకు ముందుగా మిరియాల పేస్టును రెడీ చేసుకోవాలి.
2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి అందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చి శనగపప్పు, మెంతులు, బియ్యం, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
3. చివర్లో పచ్చి కొబ్బరి తురుమును కూడా వేయాలి.
4. అలాగే కరివేపాకులను కూడా వేసి వేయించుకోవాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద అదే కళాయిని పెట్టి అందులో నూనె వేయాలి.
7. ఆ నూనెలో ఆవాలు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకులు, ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి.
8. సాంబార్లో వేసే చిన్న ఉల్లిపాయలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
9. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మొత్తం మిశ్రమాన్ని వేగనివ్వాలి.
10. ఇది వేగాక టమోటో ముక్కలను అందులో వేసి మెత్తగా ఇగురులాగా అయ్యేవరకు వేయించుకోవాలి.
11. ముందుగానే నీటిలో నానబెట్టి చింతపండు పులుసును తీసి పక్కన పెట్టుకోవాలి.
12. ఒక కప్పు చింతపండు పులుసును అందులో వేసి బాగా కలుపుకోవాలి.
13. పైన మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
14. ఆ తర్వాత ఆ పులుసులో మిరియాల పేస్టును వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్ళను కూడా పోసుకోవాలి.
15. పైన మూత పెట్టి పావుగంట సేపు ఉడికించుకోవాలి.
16. అంతే టేస్టీ మిరియాల పులుసు రెడీ అయినట్టే.
17. మీకు నచ్చితే చిటికెడు బెల్లం తురుమును కూడా వేసుకోవచ్చు.
మిరియాల పులుసు స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఎండుమిర్చి, మిరియాలు వేసాము. ఈ రెండూ కూడా కాస్త ఘాటుని, కారాన్ని కలిగి ఉంటాయి. నోరు చప్పగా అనిపించినప్పుడు కూడా ఈ మిరియాల పులుసు చాలా టేస్టీగా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ మిరియాల పులుసుని వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది.
టాపిక్