Meal Maker Manchurian: మీల్ మేకర్ మంచూరియా, సాయంత్రానికి బెస్ట్ స్నాక్ రెసిపీ
20 February 2024, 15:01 IST
- Meal Maker Manchurian: సాయంత్రమైతే ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? ఒకసారి మీల్ మేకర్‌తో మంచూరియా చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.
మీల్ మేకర్ మంచూరియా రెసిపీ
Meal Maker Manchurian: మార్కెట్లో సోయా చంక్స్ పేరుతో మీల్ మేకర్ లభిస్తుంది. బ్రాండెడ్ కంపెనీలు సోయా చంక్స్‌ను అమ్ముతున్నాయి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఒకసారి మీల్ మేకర్ మంచూరియా ట్రై చేసి చూడండి. దీని రుచి అదిరిపోతుంది. సాధారణంగా మీల్ మేకర్ ను బిర్యానీ, పలావుల్లో వేసి వండుతారు. వీటిని కూరగా కూడా వండుకోవచ్చు. ఈసారి మీరు మీల్ మేకర్ మంచూరియా రెసిపీ ట్రై చేయండి.
మీల్ మేకర్ మంచూరియా రెసిపీకి కావలసిన పదార్థాలు
మీల్ మేకర్ - ఒక కప్పు
ఉల్లిపాయల తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
గ్రీన్ చిల్లి సాస్ - ఒక స్పూను
సోయా సాస్ - అర స్పూను
టమాటా కెచప్ - ఒక స్పూను
వెనిగర్ - అర స్పూను
నీళ్లు - తగినన్ని
మిరియాల పొడి - అర స్పూను
స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు - ఒక స్పూను
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
మీల్ మేకర్ మంచూరియా రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు వేయండి.
2. నీళ్లు వేడెక్కాక మీల్ మేకర్ ను అందులో వేయండి. తర్వాత స్టవ్ కట్టేయండి.
3. ఐదు నిమిషాలు ఉంచితే మీల్ మేకర్ మెత్తగా ఉడికిపోతుంది.
4. వాటిని చేత్తో తీసి పిండి వేరే గిన్నెలో వేసుకోండి.
5. ఆ గిన్నెలోనే రుచికి సరిపడా ఉప్పు, కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలపండి.
6. ఈ మీల్ మేకర్ మొత్తానికి కార్న్ ఫ్లోర్, ఉప్పు పట్టేలా చూడండి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి.
8. ఆ మీల్ మేకర్‌ను నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేయండి.
9. తర్వాత మరొక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టండి. స్టవ్ వెలిగించి కళాయిలో మూడు స్పూన్ల నూనె వేయండి.
10. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి వేయించండి.
11. అందులోనే చిల్లీ సాస్, సోయాసాస్, టమాటా కెచప్, వెనిగర్ వేసి చిన్న మంట మీద వేయించండి.
12. మిరియాల పొడి కూడా వేసి కలుపుకోండి. కాస్త ఉప్పు కూడా చల్లుకోండి మిశ్రమాన్ని ఉడికించండి.
13. అది గ్రేవీలా ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్‌లను అందులో వేసి బాగా కలుపుకోండి.
14. పైన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోండి. అంతే మీల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయినట్టే.
15. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీన్ని ఇష్టంగా తినడం ఖాయం. ఒక్కసారి తిని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.
సోయా చంక్స్ అని పిలిచే మీల్ మేకర్ తినడం వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. సోయాతో చేసిన ఈ మీల్ మేకర్‌ను తినడం వల్ల మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే ఈ మీల్ మేకర్లో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది.
జీర్ణవ్యవస్థను కాపాడడంలో సోయా చంక్స్ ముందుంటాయి. చిక్కుడు జాతికి చెందిన సోయా గింజలతోనే వీటిని తయారు చేస్తారు. కాబట్టి ఆ చిక్కుడు గింజల్లో ఉన్న పోషకాలన్నీ మీల్ మేకర్ ద్వారా మన శరీరానికి అందుతాయి. ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి మీల్ మేకర్ కి ఉంది. కాబట్టి సూపర్ మార్కెట్లలో సోయా చంక్స్ అని రాసిపెట్టి ఉన్న మీల్ మేకర్ కొని ఇంటికి తెచ్చుకోండి. వాటిని తరచూ ఆహారంలో భాగం చేయండి. ఒకసారి ఈ మీల్ మేకర్ మంచూరియా కూడా ట్రై చేసి చూడండి.
టాపిక్